తెలంగాణలో ఉత్కంఠంగా ఎదురుచూస్తున్నటువంటి జూబ్లీహిల్స్ ఉపఎన్నికకు షెడ్యూల్ వచ్చేసింది. ఈ మేరకు ఎన్నికల కమిషన్ (ఈసీఐ) షెడ్యూల్‌ను ప్రకటించింది. బిహార్ ఎన్నికలతోపాటు దేశవ్యాప్తంగా ఖాళీ అయిన పలు పార్లమెంట్, అసెంబ్లీ స్థానాలకు ఎన్నికల సంఘం ఉపఎన్నికలు నిర్వహిస్తోంది. అందులో తెలంగాణలోని జూబ్లీహిల్స్ అసెంబ్లీ నియోజకవర్గం కూడా ఉంది. ఇక్కడ బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ ఆకస్మిక మృతితో ఇక్కడ ఎన్నికలు నిర్వహిస్తోంది. ఈనెల 13 జూబ్లీహిల్స్ ఉపఎన్నికకు నోటిఫికేషన్ వెలువడనుంది. ఆ రోజు నుంచే నామినేషన్ల ప్రక్రియ ప్రారంభం కానుంది. ఈ నెల 21వ తేదీ వరకు నామినేషన్లను స్వీకరించనున్నారు. 22న నామినేషన్లను స్క్రుటినీ చేస్తారు. వచ్చే నెల 11వ తేదీన ఉప ఎన్నిక పోలింగ్ నిర్వహిస్తారు. 14వ తేదీన కౌంటింగ్ చేసి, ఫలితాలు విడుదల చేస్తారు.
జూబ్లీహిల్స్ పరిధిలో 3,92,669 మంది ఓటర్లు ఉన్నారు. ఇప్పటికే బీఆర్ఎస్ పార్టీ తమ అభ్యర్థిని ప్రకటించింది. దివంగత నేత, మాజీ ఎమ్మెల్యే మాగంటి గోపినాథ్ భార్య మాగంటి సునీతను బరిలోకి దింపింది. స్థానికంగా ప్రచారం కూడా మొదలుపెట్టారు. మరోవైపు కాంగ్రెస్, బీజేపీ తమ అభ్యర్థులను ప్రకటించలేదు. ఆశావహులు ఎక్కువగా ఉండటంతో ఈ రెండు జాతీయ పార్టీలు కాస్త కన్ఫ్యూజన్‌లో పడినట్టు తెలుస్తోంది. ఎన్నిక రిజల్ట్ మూడు పార్టీలకు హైదరనగరంలో భవితవ్యం కానుంది. నియోజకవర్గ ఓటర్లు ఎవరి వైపు నిలబడుతారో వేచిచూడాలి..