Monday, October 27, 2025
ePaper
Homeసాహిత్యంDharmapuri | అకాల మృత్యుహరుడు… ధర్మపురి యముడు

Dharmapuri | అకాల మృత్యుహరుడు… ధర్మపురి యముడు

భారతావనిలో అపురూప ఆలయం

భారతీయ ప్రాచీన ఆర్ష విద్యా సభ్యతా సంస్కృతులకు పట్టుకొమ్మగా, హైందవ సనాతన సంప్రదాయాలకు నెలవుగా, అనాదిగా హైందవ ధర్మప్రచార కేంద్ర బిందువుగా, పవిత్ర గోదావరి (Godavari) నదీ తీరాన వెలసి ఆస్తిక ప్రపంచానికి వరదాయిగా, భక్తి ముక్తి ప్రదాయినిగా విరాజిల్లుతోంది ధర్మపురి (Dharmapuri) క్షేత్రం. తెలుగు నేలపై సుప్రసిద్ధ పుణ్యక్షేత్రంగా, దక్షిణ కాశీ(South Kasi)గా, నవ నారసింహ (Narasimha) క్షేత్రాల్లో ఉత్కృష్టమైందిగా, హరిహర క్షేత్రంగా, పౌరాణిక, ఐతిహాసిక, చారిత్రక ప్రాధాన్యతను సంతరించుకుంది.

బ్రహ్మాండ, స్కందాది పురాణాల్లో, ధర్మపురి క్షేత్ర ప్రాశస్త్యం నిక్షిప్తమై ఉంది. ఈ క్షేత్ర దేవస్థాన అంతర్గతంగా ఉన్న యమధర్మరాజు (Yamadharma Raju) మందిరం విశేష ప్రాధాన్యతను సంతరించుకుంది. భారతావనిలోనే అరుదుగా, అపురూపంగా, క్షేత్రంలో వెలసిన యమధర్మరాజును దర్శిస్తే యమపురి ఉండబోదని ప్రతీతి. హిరణ్యకశిపుని సంహరించిన అనంతరం ఉగ్ర నరసింహ స్వామిని శాంతింప చేసేందుకు, బ్రహ్మాది దేవతలు పుణ్య తీర్థం, పవిత్ర క్షేత్రం అయిన ధర్మపురిలో తపో, యజ్ఞ, ధ్యానం ఆది సత్కర్మలను ఒనరించినట్లు స్థల పురాణాలు స్పష్టం చేస్తున్నాయి. ఒకానొక సమయాన యమధర్మరాజు తన లోకంలో అనేక శారీరక బాధలను అనుభవిస్తున్న పాపులను చూసి నిట్టూర్చి తనలోతాను బాధపడ్డాడు.

పుణ్యాత్ములను దర్శిస్తే పుణ్యం, పాపాత్ములను చూస్తే పాపమే లభిస్తుందని, నిత్యం పాపులను దర్శించటం వల్ల తనకు పాపమే కలుగుతోందని, తనలో స్వయంకృత పాపం అనేది ఏమాత్రం లేకున్నా పాపుల నిత్యదర్శనంతో మనశ్శాంతి కలగడంలేదని తలచి, మనశ్శాంతిని పొందుటం కోసం పుణ్యక్షేత్ర దర్శనానికి ప్రయాణం ప్రారంభించి, సమస్త క్షేత్రాలను తిరిగాడు. చివరకు ధర్మపురికి రాగా ఈ క్షేత్రంలోని గోదావరి నదిలో స్నానం ఆచరించగానే యముడికి మనశ్శాంతి కలిగిందని, పాపాత్ముల దర్శన దోషాలు తొలిగాయని, బ్రహ్మాండం, స్కాంద పురాణాంతర్గత “ధర్మపురి క్షేత్ర మహాత్మ్యం” ఆధారంగా నైమిశారణ్యంలో సూత పౌరాణికుడు, శౌనకాది మహర్షులకు వివరించినట్లు నారదుడు పృథు మహారాజుకు క్షేత్ర మహిమను తెలిపినట్లు వివరణ ఉంది.

యమధర్మరాజు నరసింహుని మందిరానికి వెళ్లి చేసిన పూజలకు ప్రసన్నుడైన నరసింహుడు యమధర్మరాజును తన సన్నిధిలో నివసించాలని చెప్పినట్లు పురాణాలు పేర్కొంటున్నాయి. యముడు గోదావరిలో స్నానం చేసిన స్థలానికి “యమ కుండం” అని పేరు. అక్కడ స్నానం చేసి నరసింహుని పూజిస్తే యమలోక బాధలు కలగవని, సర్వ పాప విముక్తి కలుగుతుందని నరసింహుడు వరం ఇచ్చినట్లు యమధర్మరాజు తన అంశ రూపమును నరసింహ మందిర పురో భాగాన నిలిపెనని పురాణాలు స్పష్టం చేస్తున్నాయి. దేవస్థానంలో యోగానంద నరసింహ ప్రధానాలయం ముందు భాగాన యమధర్మరాజ మందిరం ఉంది. కోరలతో యమదండాన్ని ధరించిన భీకరాకార ఆరు అడుగుల భారీ విగ్రహం ఇందులో ఉంది.

“దక్షిణాదిభి ముఖీ గంగా, యత్ర దేవో నృకేసరి, తత్ర శ్రీర్విజయోర్భూతి: కాశ్య యశ్వత గుణం భవేత్” అని దక్షిణ అభిముఖియై ప్రవహిస్తున్న గోదావరి తీరస్థమైన ధర్మపురి క్షేత్రం విశిష్టతను కలిగి ఉంది. వేరే ఎక్కడా కానరాని విధంగా ధర్మపురి క్షేత్రం వద్ద గోదావరి దక్షిణ వాహినిగా ప్రవహిస్తోంది. అష్టదిక్పాలకుల్లో ఒకరైన యముడు దక్షిణ దిశకు అధిపతి. అంతేగాక గ్రహాల దృష్ట్యా కుజుడు దక్షిణ దిశకు అధిపతి. కుజ గ్రహానికి మూలాధిపతి నరసింహుడని పరాశరుడు బృహత్ పరాశర హోరా శాస్త్రంలో చెప్పాడు. కనుక ధర్మపురిలో దక్షిణ వాహినిగా ఉన్న గౌతమిలో దక్షిణాభిముఖులై స్నానాలు ఆచరించి నరసింహూని దర్శిస్తే నరక బాధలు ఉండవని భక్తుల ప్రగాఢ విశ్వాసం.

ఇంతటి ప్రాధాన్యత కలిగిన ధర్మపురిలో వెలసిన యమధర్మరాజును దర్శించే భక్తుల (Devotees) సంఖ్య నానాటికీ పెరుగుతోంది. ఇటీవల సంభవిస్తున్న అనూహ్య ప్రకృతి (Nature) వైపరీత్యాల దృష్ట్యా అకాల మృత్యు నివారణకై అధర్వణ వేదంలో పేర్కొన్న ఆయుష్య సూక్తం ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు. అలాగే.. భరణి నక్షత్రం, చతుర్దశి తదితర దినాల్లో ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. అక్టోబర్ 23న గురువారం యమ ద్వితీయ సందర్భంగా అభిషేకం, ఆయుష్య సూక్తం, యమ సూక్త మంత్రం, పురుష సూక్తం, శ్రీసూక్తం, జ్వర హర స్తోత్ర పఠనాలు, రోగ (Diseas) నివారణ సూక్తాలు పూజలు, యమాష్టకాది నిర్వహించేందుకు విస్తృత ఏర్పాట్లు చేస్తున్నారు.

(అక్టోబర్ 23న యమ ద్వితీయ సందర్భంగా)

రామకిష్టయ్య సంగనభట్ల, సీనియర్ ఇండిపెండెంట్ జర్నలిస్ట్, కాలమిస్ట్

RELATED ARTICLES
- Advertisment -

Latest News