Saturday, October 4, 2025
ePaper
Homeతెలంగాణఆర్థిక సంస్కరణల పితామహుడు పీవీ

ఆర్థిక సంస్కరణల పితామహుడు పీవీ

నెక్లెస్‌ రోడ్డు పీవీ ఘాట్‌ వద్ద నివాళి అర్పించిన మంత్రులు

మాజీ ప్రధాని పీవీ నరసింహారావు జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. హైదరాబాద్‌లోని పీవీ ఘాట్‌ వద్ద పలువురు కాంగ్రెస్‌ నేతలు నివాళి అర్పించారు. భారతరత్న పీవీ నరసింహారావు జయంతి సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి నివాళులర్పించారు. ఈ సందర్భంగా పీవీ నరసింహారావు సేవలను గుర్తు చేసుకున్నారు. బహుభాషాకోవిదుడిగా, రచయితగా, ఆర్థిక సంస్కరణల పితామహుడిగా ఆయన దేశానికి ఎనలేని సేవలను అందించారని కొనియాడారు. దేశాన్ని ప్రగతిపథంలో నడిపించడంలో పీవీ పాత్ర ఎనలేనిదన్నారు. సీఎంతో పాటు ముఖ్యమంత్రి సలహాదారు వేం నరేంద్‌ రెడ్డి, తుంగతుర్తి ఎమ్మెల్యే మందుల సామేల్‌, సత్తుపల్లి ఎమ్మెల్యే మట్టా రాగమయి, టూరిజం కార్పొరేషన్‌ చైర్మన్‌ పటేల్‌ రమేష్‌ రెడ్డి.. పీవీకి నివాళులు అర్పించారు. మాజీ ప్రధాని పీవీ నరసింహ రావు జయంతి సందర్భంగా పీవీ ఘాట్‌లో ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, మంత్రులు పొన్నం ప్రభాకర్‌, కొండా సురేఖ నివాళులు అర్పించారు.

ఈ సందర్భంగా భట్టి విక్రమార్క మాట్లాడుతూ.. ప్రధానిగా, ముఖ్యమంత్రిగా పీవీ దేశంలో రాష్ట్రంలో అనేక సంస్కరణలు తెచ్చారన్నారు. ఆర్థిక సంస్కరణలతో భారత దేశాన్ని ప్రపంచంలో బలమైన ఆర్థిక శక్తిగా నిలబెట్టారని గుర్తుచేశారు. భూ సంస్కరణలతో సమాజంలో సమానత్వానికి కృషి చేశారని తెలిపారు. భూ సంస్కరణలో భాగంగా కాంగ్రెస్‌ ఇప్పటి వరకు 24 లక్షల ఎకరాలకు పైగా భూమిని పేదలకు పంచిందన్నారు. తెలంగాణలో గత పదేళ్లు పాలించిన ప్రభుత్వం ధరణి తెచ్చి పేదలను ఇబ్బంది పెట్టిందని విమర్శించారు. పేదల హక్కులను కాపాడడానికి భూభారతి చట్టాన్ని తెచ్చామని ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క పేర్కొన్నారు. ఈ సందర్భంగా మంత్రి పొన్నం ప్రభాకర్‌ మాట్లాడుతూ.. విద్యారంగం బలోపేతం పీవీతోనే సాధ్యమైంద్నారు. దేశ ఆర్థిక రంగంలో ఆయన చేసిన సేవలు మరువలేనివని కొనియాడారు. ఆయన అనేక సంస్కరణలు తెచ్చారని వివరించారు. కార్యక్రమంలో మంత్రి కొండా సురేఖ, సీనియర్‌ నేత వి.హనుమంతరావు తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Latest News