- గుంతల్లో పడి చస్తే మాకు దిక్కెవరు..?
- వికారాబాద్ మున్సిపల్ వెంకటాపూర్ తండా వాసుల ఆగ్రహం
- నేవీ రాడార్ స్టేషన్ నిర్మాణ పనులకు నడిచే భారీ వాహనాలను ఆపి నిరసన
దేవి రాడార్ స్టేషన్ నిర్మాణ పనుల కొరకు అధిక లోడు కలిగిన భారీ వాహనాలు నడవడంతో రోడ్డు మొత్తం గుంతలుగా మారి ప్రమాదాలకు నిలయంగా మారిందని, తక్షణమే ఈ దారి గుండా వాహనాలు నడపరాదని వికారాబాద్ మున్సిపల్ పరిధిలోని ఆరవ వార్డు వెంకటాపూర్ తండావాసులు భారీ వాహనాలను ఆపేసి నిరసనకు దిగారు. 10 టన్నుల సామర్థ్యం కలిగిన రోడ్డుపై నేవీ రాడార్ స్టేషన్ నిర్మాణ కాంట్రాక్టర్లు ఇష్టారాజ్యంగా అధిక లోడుతో వాహనాలు నడపడం చేత రోడ్డు మొత్తం పాడై పలువురు ప్రమాదాల బారిన పడ్డారని ఆవేదన వ్యక్తం చేశారు. కనీసం గుంతల్లో తట్టెడు మట్టికూడా వేయకపోవడం దురదృష్ట కరమన్నారు. మనుషులు చస్తే గాని అధికారులు పాలకులు స్పందించరా అని ప్రశ్నించారు. స్థానిక ఎమ్మెల్యే స్పీకర్ ప్రసాద్ కుమార్ గతంలో అసెంబ్లీలో మాట్లాడుతూ… వికారాబాద్ ప్రాంతంలో రోడ్లు సక్కగా లేక యువకులకు పిల్లని ఇచ్చే పరిస్థితి లేదని చెప్పారు, కానీ రోడ్లను పునరుద్ధరించడం పట్ల ఎందుకు నిర్లక్ష్యం వహిస్తున్నారు అనేది సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.ముఖ్యంగా ఎన్నెపల్లి నుండి మహావీర్ హాస్పిటల్, వెంకటాపూర్ తండా, చిన్న వందూరు తండా, మద్దుల గడ్డ తండా మీదుగా దామగుండం వెళ్ళే రహదారి కళ్ళ ముందు పాడైపోయి మా పాలిట శాపంగా మారిందని తండా వాసులు ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా అధికారులు పాలకులు నిద్రమత్తు వీడి రోడ్డు దుస్థిపై స్పందించి తగు చర్యలు చేపట్టాలని,లేని పక్షంలో ఈ రోడ్డు గుండా నేవీ రాడార్ పనులకు నడిచే ఒక్క వాహనాన్ని వెళ్ళనివ్వబోమని హెచ్చరించారు.
