- ప్రభుత్వ ఉత్తర్వులను పక్కకు నెట్టి, అడిషనల్ కలెక్టర్ ఇష్టారాజ్యం..!
- బీసీ సంక్షేమంలో రూ.కోటి, ఎస్సి సంక్షేమంలో రూ.54 లక్షల టెండర్లు ఏకపక్షం..
- అనుభవం లేని ట్రేడర్ కు నామినేషన్ పద్ధతిన పనులు అప్పగించిన వైనం
- టెండర్లు పిలువకుండానే కాంట్రాక్ట్ ఇవ్వాల్సిందిగా అడిషనల్ కలెక్టర్ అంతర్గత ఆదేశాలు..
- సంక్షేమ శాఖల పనులకు వర్తించే జీ.ఓ నెం.35/2018 కి సమాధి!
నల్లగొండ జిల్లాలోని సంక్షేమ శాఖల్లో భారీ అవకతవకలు వెలుగులోకి వచ్చాయి. ప్రభుత్వం స్పష్టంగా అన్ని పనులు, బీసీ మరియు ఎస్సి, ఎస్టీ హాస్టళ్లలో వస్తువుల కొనుగోలు, సప్లయ్ మొత్తం పారదర్శకంగా టెండర్ పద్ధతిలోనే జరగాలనీ, సంక్షేమ శాఖల పనులకు వర్తించే జి.ఓ.నెం.35, ఎస్.సి.డి/2018 ద్వారా స్పష్టమైన ఆదేశాలు ఉన్నప్పటికీ వీటిని తుంగలో తొక్కి, జిల్లా కొనుగోలు కమిటీ చైర్మన్ అయిన అడిషనల్ కలెక్టర్ (రెవిన్యూ) స్వయంగా సొంత ఆదేశాలు జారీ చేసి, కోట్ల రూపాయల కొనుగోలు, సప్లయ్ పనులు నేరుగా నామినేషన్ పద్ధతిలో, కనీస పూర్వ అనుభవం కూడా లేని ఒక ట్రేడర్ కు ఈ కాంట్రాక్ట్ అప్పగించినట్లు సమాచారం.(సంబంధిత వర్క్ ఆర్డర్ నెం.ఎ2/48/2025, తేది.20/03/2025) స్థానిక నల్లగొండ జిల్లా కేంద్రంలో ఉన్న విజయలక్ష్మి ట్రేడర్స్ అనే ఈ సంస్థ గతంలో ఎప్పుడుకూడా సంక్షేమ హాస్టళ్లకు వస్తువులు సరఫరా చేసిన పూర్వ అనుభవ దాఖలాలు లేవని తెలుస్తోంది.

బీసీ సంక్షేమంలో రూ.కోటి, ఎస్సి సంక్షేమంలో రూ. 54 లక్షల టెండర్లు ఏకపక్షం..
పైన తెలిపిన జి.ఓ.నెం.35 గైడ్ లైన్స్ ప్రకారం రూ.5 లక్షలకు మించి ఉన్న పనులు తప్పనిసరిగా టెండర్ పద్ధతిలోనే జరగాలి. కానీ, నల్లగొండ జిల్లా అడిషనల్ కలెక్టర్ తానే స్వయంగా ఆదేశాలు జారీ చేసి, కోట్ల రూపాయల పనులు టెండర్లే పిలవకుండా తనకు నచ్చిన, తాను మెచ్చిన కాంట్రాక్టర్ కు ఈ పనులు అప్పగించడంపై తీవ్ర చర్చకు దారి తీసింది. జిల్లా బీసీ సంక్షేమ విభాగంలో సుమారు రూ. 1 కోటి విలువ చేసే సరఫరాలు, పనులు టెండర్లు పిలవకుండా ఒకే ఏజెన్సీకి అప్పగించినట్లు వెలుగులోకి వచ్చింది. ఇక ఎస్సి సంక్షేమ విభాగంలో రూ. 54 లక్షల విలువైన టెండర్లు కూడా ఇదే విధంగా ‘నామినేషన్’ పద్ధతిలో విజయలక్ష్మి ట్రేడర్స్ కు అప్పగించాలని నోట్ ఫైల్ ద్వారా అడిషనల్ కలెక్టర్ ఎస్సి సంక్షేమ విభాగం అధికారులను ఆదేశించినట్లు తెలుస్తోంది. అప్పటికే వారు టెండర్ నోటిఫికేషన్ కు సిద్ధమై రాగా, టెండర్ నోటిఫికేషన్ అవసరం లేదని, టెండర్లు పిలవకుండా కాంట్రాక్ట్ ఇవ్వాలని తాను ఆదేశించినట్టు చెయ్యాలని వారికి అయన హుకుం జారీ చేసినట్లు సమాచారం!
అనుభవం లేని ట్రేడర్ కు లాభం..
అత్యంత ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే, సంక్షేమ శాఖ పనులకు సంబంధం లేని, ఎలాంటి అనుభవం లేని ఒక చిన్న ట్రేడర్ కు ఈ కాంట్రాక్టులు అప్పగించారని తెల్సింది. ఈ నిర్ణయం వెనుక ప్రత్యేక ఆసక్తులు, లాభాలు దాగి ఉన్నాయనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

పరిపాలన విభాగంలో తీవ్ర చర్చ..
ఈ వ్యవహారం వెలుగులోకి రావడంతో, నల్లగొండ జిల్లా రాజకీయ, పరిపాలనా వర్గాల్లో తీవ్ర చర్చ మొదలైంది. ప్రభుత్వ ఆదేశాలను ధిక్కరించి ఇలాంటి అవకతవకలు ఎలా జరుగుతున్నాయి? ఈ పనుల వెనుక ఎవరి ప్రభావం ఉంది? అన్న ప్రశ్నలు వేడెక్కుతున్నాయి. జిల్లాలో సంక్షేమ శాఖల పేరుతో జరిగే ఈ టెండర్ల దందాపై అధికారిక విచారణ అవసరమని, లబ్ధిదారుల సంక్షేమం కోసం కేటాయించిన నిధులు నిజంగా ఉపయోగపడుతున్నాయా లేదా అన్న అంశంపై ప్రజలు సమాధానం కోరుతున్నారు. నామినేషన్ పద్ధతిలో కాంట్రాక్టులు ఇచ్చిన సంస్థ అడిషనల్ కలెక్టర్ కు సన్నిహితంగా ఉన్నవ్యక్తులదే అన్న ఆరోపణలు వెలువడుతున్నాయి. టెండర్లను మినహాయించి నేరుగా కాంట్రాక్టులు ఇవ్వడానికి డిస్ట్రిక్ట్ టెండర్ కమిటీ ఆమోదం తప్పనిసరి. కానీ నల్లగొండలో, అడిషనల్ కలెక్టర్ స్వయంగా మౌఖిక ఆదేశాలు ఇచ్చి అధికారులను బలవంతపెట్టినట్లు ఆ విభాగం లోపలి వర్గాలు చెబుతున్నాయి. ఈ వ్యవహారం బయటపడటంతో జిల్లా ప్రజల్లో తీవ్ర చర్చ మొదలైంది. జరిగిన ఈ తంతుపై బీసీ, ఎస్.సి విద్యార్థి సంఘాలు మండిపడుతున్నాయి. సంక్షేమ నిధులు లక్ష్యానికి చేరకుండా అధికారులు, కాంట్రాక్టర్ దందాలో మునిగిపోతున్నాయి అంటూ ఆరోపిస్తున్నాయి.
విచారణ డిమాండ్!
ఈ వ్యవహారంపై జిల్లా ప్రజలు, సామాజిక సంస్థలు ప్రభుత్వం వెంటనే విజిలెన్స్ విచారణ లేదా ఏసీబీ దర్యాప్తు ప్రారంభించాలని డిమాండ్ చేస్తున్నారు. కోట్ల రూపాయల ప్రజా ధనానికి లెక్క చెప్పేది ఎవరు?” అన్న ప్రశ్న గట్టిగా వినిపిస్తోంది.