పరిశ్రమ సమస్యలు పరిష్కరించాలని వినతి
తెలంగాణ రాష్ట్ర (Telangana State) చలనచిత్ర(Film), టీవీ (TV), నాటక రంగ (Theater) అభివృద్ధి (Development) సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ (Md) ప్రియాంకను టీవీ పరిశ్రమ ప్రముఖులు(Celebrities), కార్మికులు (Labour) కలిశారు. తెలుగు టీవీ పరిశ్రమ కార్మికులు ఎదుర్కొంటున్నప్రధాన సమస్యలకు పరిష్కారం కోసం ఆమెతో సమాచార భవన్‌లో శుక్రవారం సమావేశమయ్యారు. ఇందులో సంస్థ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ కిషోర్ బాబు కూడా ఉన్నారు. తెలుగు టెలివిజన్ వర్కర్స్, టెక్నీషియన్స్ ఫెడరేషన్ వ్యవస్థాపక అధ్యక్షులు నాగబాల సురేష్ కుమార్ (Nagabala Suresh Kumar) సారథ్యంలో ఈ భేటీ జరిగింది. టీవీ నటీనటులు అశోక్ కుమార్, జి.యల్ శ్రీనివాస్, లహరి, మధుప్రియ, మాణిక్, నటి సూర్యకళ, దర్శకులు-రచయితల సంఘం అధ్యక్షులు ప్రేమ్‌రాజ్, నరేంద్ర, తెలుగు తెలంగాణ సినీ టీవీ నటినటుల సంఘం అధ్యక్షుడు రాజ్‌శేఖర్, గోపాలకృష్ణ, యం.ఎస్.ప్రసాద్, చిత్తరంజన్ దాస్, సినీ, టీవీ గేయ రచయిత వెనిగళ్ల రాంబాబు, సత్యం యాబి మాస్టారు, అక్కినేని శ్రీధర్ లక్ష్మి, డాక్టర్ శ్రీరాందత్తి, శ్రీరామోజు లక్ష్మి నారాయణ, భాస్కర్ల వాసు, నరేందర్ రెడ్డి, ఆర్డీఎస్ ప్రకాష్ తదితరులు 60 మంది సభ్యులు హాజరయ్యారు.

మన దేశంలో ప్రస్తుతం తెలుగు టీవీ రంగ పరిశ్రమ ఎంతో ఉన్నత స్థాయిలో ఉంది. దూరదర్శన్‌లో అర గంట చిత్రలహరి కార్యక్రమంతో మొదలైన ప్రస్థానం నేడు 148 శాటిలైట్ ఛానల్స్, 82 యూట్యూబ్ ఛానల్స్, 9 ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లతో రోజు 180 షూటింగ్‌లతో ప్రత్యక్షంగా సుమారు 20 వేల మంది, పరోక్షంగా లక్షా 26 వేల మందికి ఉపాధి కల్పిస్తోంది. అంతేకాకుండా టెలివిజన్ పరిశ్రమ ప్రజలకు వినోదాన్నిఅందిస్తూ వ్యాపారపరంగా వేల కోట్ల ఆదాయంపై వచ్చే టిడిఎస్, జిఎస్టీ వంటి పన్నుల రూపంలో వందల కోట్ల రూపాయలను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు ఆదాయం సమకూర్చుతోంది. కానీ నేడు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నుంచి టెలివిజన్ పరిశ్రమకు ఉపాధి గానీ ఆర్థిక సహకారం గానీ అందట్లేదు. తెలుగు టెలివిజన్ పరిశ్రమ కార్మికులకు, సాంకేతిక నిపుణులకు టీవీ నగర్‌తోపాటు ఇల్లు లేని పేదలకు డబుల్ బెడ్ రూమ్ ఇళ్లు ఇవ్వాలని, జీవిత బీమా, ప్రమాద బీమా కల్పించాలని కోరుతున్నారు. 60 ఏళ్లు నిండిన కార్మికులకు, సాంకేతిక నిపుణులకు నెలకు పది వేల రూపాయల పెన్షన్ అందించాలని, టీఎల్ కాంతారావు, పైడి జైరాజ్ పేరిట ఏటా అవార్డులు ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. నైపుణ్యం పెంచడానికి సెమినార్‌లు, వర్క్‌షాప్‌లు నిర్వహించాలని కోరుతూ ప్రియాంకకు తెలుగు టెలివిజన్ పరిశ్రమ ప్రముఖులు వినతి పత్రం ఇచ్చారు.

