సర్పంచ్‌లకు పెండింగ్ బిల్లులను చెల్లించాలని తెలంగాణ సర్పంచుల సంఘం (Telangana Sarpanch Association) జేఏసీ రాష్ట్ర అధ్యక్షుడు సుర్వి యాదయ్య గౌడ్ డిమాండ్ చేశారు. ఈ మేరకు ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు. అందులోని ముఖ్యాంశాలు..
తెలంగాణ రాష్ట్రంలోని సర్పంచులు 2019–2024 మధ్య గ్రామాల అభివృద్ధిలో దేశంలోనే అగ్రస్థానంలో నిలిచి 19/20 జాతీయ అవార్డులు సాధించారు. కానీ.. ఈ గ్రామాలను అభివృద్ధి చేసిన అదే సర్పంచులే ఈ రోజు అప్పుల్లో (Debts) మునిగి జీవన్మరణ స్థితిలో ఉన్నారు. కారణం ఒక్కటే.. రాష్ట్ర ప్రభుత్వం (State Government) రెండేళ్లుగా సర్పంచుల పెండింగ్ బిల్లులను ఒక్క రూపాయి కూడా విడుదల చేయకపోవడం. ఎన్నికల సమయంలో ఇచ్చిన ‘ఒక నెలలో బిల్లులు ఇస్తాం’ హామీ రెండు సంవత్సరాలుగా పూర్తిగా నిర్లక్ష్యంగా మారింది. ప్రభుత్వం ఇచ్చిన 450 హామీల్లో 10 కూడా అమలుకాలేదు.
రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల్లో ప్రకటించిన 450 హామీల్లో కనీసం పది కూడా అమలు జరగలేదు అనేది ప్రజలు గమనించాల్సిన కఠినమైన నిజం. ఇంత అశ్రద్ధగా ప్రవర్తిస్తున్న ప్రభుత్వం.. గ్రామాల అభివృద్ధిని పట్టించుకుంటుందా?. సర్పంచుల బిల్లులు విడుదల చేస్తుందా?. అనే ప్రశ్నలకు సమాధానం స్పష్టంగా లేదు. పారిశుధ్య కార్మికుల జీతాలే (Sanitation workers Salaries) దీనికి రుజువు. గత రెండేళ్లుగా గ్రామాల్లో పనిచేస్తున్న పారిశుధ్య కార్మికులకు జీతాలు 3–4 నెలలకు ఒకసారి మాత్రమే పడుతున్నాయి. అది కూడా వారు రోడ్లపై ధర్నాలు చేసిన తర్వాతే.
గ్రామాలను (Villages) శుభ్రం చేసే కార్మికులకు జీతం ఇవ్వలేని ప్రభుత్వం గ్రామాల అభివృద్ధికి (Development) నిధులు ఇస్తుందని ఎలా నమ్మాలి?. మార్చి లోపు సర్పంచుల ఎన్నికలు నిర్వహించటానికి అసలు కారణం ఏంటి?. మార్చి లోపు సర్పంచుల ఎన్నికలు పెట్టకపోతే కేంద్రం ఇచ్చే రూ.4,000 కోట్ల నిధులను రాష్ట్రం కోల్పోతుంది. ఇదే నిజమైన కారణం. కేంద్ర నిధులు కోల్పోకుండా ఉండటానికే ప్రభుత్వం తొందరగా ఎన్నికలు పెట్టుతోంది గానీ గ్రామాల అభివృద్ధి కోసం కాదు.
రెండు సంవత్సరాలుగా బిల్లులు ఇవ్వని ప్రభుత్వం రేపు ఎన్నికల్లో గెలిచిందన్న కారణంతో ఒక్కసారిగా గ్రామాలను ప్రేమిస్తుందన్న నమ్మకం ప్రజలకు లేదు. కొత్తగా ఎన్నికయ్యే సర్పంచులు కూడా అప్పుల్లో మునిగే పరిస్థితి నెలకొంది. పెండింగ్ బిల్లులు విడుదల చేయని రాష్ట్రంలో కొత్తగా ఎన్నికయ్యే సర్పంచులు కూడా అదే బిల్లుల బాది, అదే అప్పుల గుంతలో పడతారని స్పష్టంగా చెప్పాలి. ఇది అభివృద్ధి కాదు. సర్పంచుల్ని అప్పుల్లో ముంచే వ్యవస్థ.
రాష్ట్ర సర్పంచుల సంఘం డిమాండ్లు..
తక్షణమే అన్ని పెండింగ్ బిల్లులను పూర్తి స్థాయిలో విడుదల చేయాలి.
సర్పంచుల అప్పుల సమస్య పరిష్కరించేందుకు ప్రత్యేక ఆర్థిక ప్యాకేజీ ప్రకటించాలి.
గ్రామ పంచాయతీల నెలవారీ గ్రాంట్లు
సమయానికి విడుదల చేయాలి
ఇది రాజ్యాంగబద్ధమైన బాధ్యత.
సర్పంచులు వ్యక్తిగత డబ్బుతో గ్రామాలను నడపాల్సిన అన్యాయాన్ని తక్షణమే నిలిపివేయాలి.
చివరి హెచ్చరిక..
సర్పంచుల ప్రాణాలు పోయినా స్పందించని, గ్రామాల అభివృద్ధి నిలిచిపోయినా పట్టించుకోని, రాజ్యాంగ హక్కులను ఉల్లంఘిస్తున్న ప్రభుత్వ నిర్లక్ష్యం కొనసాగితే రాష్ట్ర సర్పంచుల సంఘం రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర స్థాయిలో, చట్టబద్ధమైన ఉద్యమాలు ప్రారంభిస్తుంది. గ్రామాల అభివృద్ధి కోసం పని చేసిన సర్పంచులను అప్పుల్లో ముంచే ప్రభుత్వ వైఖరిని ఇక మేం ఎట్టి పరిస్థితుల్లోనూ సహించం.
