Tuesday, February 10, 2026
HomeతెలంగాణDGP | ఖైదీలకు వడ్డీ లేని రుణాలు

DGP | ఖైదీలకు వడ్డీ లేని రుణాలు

ఈ పథకం అమలుచేస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ
పేద ఖైదీలకు బెయిల్ సహాయం పథకం
ఈ పథకం అమలులో దేశంలోనే తెలంగాణ టాప్
జైళ్ల శాఖలో సమగ్ర సంస్కరణలు
డిజిటల్, పునరావాసంలో గణనీయమైన పురోగతి
డీజీపీ డాక్టర్ సౌమ్య మిశ్రా ఐపీఎస్

తెలంగాణ రాష్ట్ర జైళ్ల శాఖ(Telangana State Prisons Department)లో 2025లో గణనీయమైన సంస్కరణలు(Reforms), సాంకేతిక పురోగతి(Technological Progress), ఖైదీల పునరావాసం(Prisoner Rehabilitation), సిబ్బంది సంక్షేమం(Staff Welfare)లో స్పష్టమైన మార్పులు చోటుచేసుకున్నాయని డైరెక్టర్ జనరల్ ఆఫ్ ప్రిజన్స్ డాక్టర్ సౌమ్య మిశ్రా(Soumya Mishra) తెలిపారు. తెలంగాణ జైళ్ల శాఖ వార్షిక నివేదిక(Annual Report) వివరాలను సోమవారం వెల్లడించారు. 2025లో మొత్తం జైలు ప్రవేశాలు 11.8 శాతం పెరిగాయి. ముఖ్యంగా సైబర్ నేరాలు (135.6%), మద్యం తాగి వాహనం నడిపిన కేసులు(152%) అత్యధికంగా ఉన్నాయి. విదేశీ ఖైదీల సంఖ్య తగ్గడం గమనార్హం.

- Advertisement -

కోర్టుల్లో కేసుల విచారణకు సంబంధించి విప్లవాత్మక మార్పులు చోటుచేసుకున్నాయి. 2025లో 69.47 శాతం కేసులు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా నిర్వహించారు. దీనివల్ల భద్రత పెరిగింది. ఖర్చు తగ్గింది. విచారణ వేగవంతంగా జరిగింది. లీగల్ ఎయిడ్ వ్యవస్థ బలోపేతం అయింది. రాష్ట్రవ్యాప్తంగా 155 లీగల్ ఎయిడ్ అడ్వకేట్లు, 47 పారా లీగల్ వాలంటీర్లు సేవలందిస్తున్నారు. జైల్ అదాలత్‌ల ద్వారా 985 మంది ఖైదీలు విడుదలయ్యారు.

పేద ఖైదీలకు బెయిల్ సహాయం పథకం అమలులో తెలంగాణ రాష్ట్రం దేశంలోనే తొలి స్థానంలో నిలిచింది. పునరావాసం లక్ష్యంగా జైళ్ల శాఖ పనిచేస్తోంది. 2025లో 79 శాతం మంది ఖైదీలకు నైపుణ్యాభివృద్ధి శిక్షణ అందించారు. జైలు పరిశ్రమల ద్వారా ఖైదీలు రూ.1.63 కోట్లకు పైగా వేతనాలు సంపాదించారు. ఖైదీలకు వడ్డీ లేని రుణాలు(Interest-Free Loans For Prisoners) అందిస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ. దేశంలోనే తొలిసారిగా డీ-అడిక్షన్ కేంద్రాలు, సెంటెన్స్ ప్లానింగ్ విధానం, వేస్ట్ టు వెల్త్, తేనెటీగల పెంపకం, పుష్పాల నుంచి అగరుబత్తీల తయారీ వంటి వినూత్న కార్యక్రమాలను అమలుచేస్తున్నారు.

ఆరోగ్య సంరక్షణలో భాగంగా ప్రతి ఖైదీకి తప్పనిసరిగా వైద్య పరీక్షలు నిర్వహిస్తున్నారు. 2025లో 379 శస్త్ర చికిత్సలు, అనేక ప్రత్యేక చికిత్సలు, 13 మెడికల్ క్యాంపులు నిర్వహించారు. అంతర్జాతీయ యోగా దినోత్సవంలో 6,597 మంది ఖైదీలు పాల్గొన్నారు. సాంకేతిక ఆధునికీకరణలో భాగంగా సీఐజేఎస్ 2.0 కింద రూ.2.5 కోట్ల విలువైన ఎలక్ట్రానిక్ పరికరాలు, ఐటీ సెల్ ఏర్పాటు, స్వాగతం పోర్టల్, జైళ్ల వెబ్‌సైట్, ఇ-ఆఫీస్, బయోమెట్రిక్ హాజరు వ్యవస్థను అమల్లోకి తెచ్చారు.

మౌలిక వసతుల అభివృద్ధిలో సిద్ధిపేట జిల్లా జైలు, కొత్త బ్యారక్స్ పూర్తి, హై సెక్యూరిటీ జైలు, నేషనల్ ప్రిజన్ అకాడమీ ప్రతిపాదనలు ప్రభుత్వానికి పంపారు. సిబ్బంది సంక్షేమానికి ఆరోగ్య బీమా, రుణాలు, జీతభత్యాల ప్యాకేజీలు, క్రీడా కార్యక్రమాలు అమలుచేస్తున్నారు. తెలంగాణ జైళ్ల శాఖకు ఖైదీల పునరావాసం, సమాజంలో తిరిగి కలపడంలో ఉత్తమ పనితీరుకు స్కోచ్ అవార్డ్, సెంట్రల్ ప్రిజన్ చెర్లపల్లికి దేశంలోనే ఉత్తమ పరిశుభ్రమైన జైలుగా గోల్డ్ మెడల్ లభించింది.

7వ అఖిల భారత జైళ్ల డ్యూటీ మీట్‌లో తెలంగాణ అత్యధిక బంగారు పతకాలు సాధించి ఓవరాల్ చాంపియన్‌షిప్‌ను కైవసం చేసుకొని విజేతగా నిలిచింది. సీఎం రేవంత్ రెడ్డి అభినందించడం గర్వకారణం. తెలంగాణ జైళ్ల శాఖ కేవలం కస్టడీకి పరిమితం కాకుండా సంస్కరణలు, గౌరవం, సాంకేతికత, పునరావాసం దిశగా ముందుకు సాగుతోంది అని డీజీపీ డాక్టర్ సౌమ్య మిశ్రా వివరించారు. ఈ కార్యక్రమంలో వై.రాజేష్, ఇన్‌స్పెక్టర్ జనరల్, ఎన్.మురళి బాబు, ఇన్‌స్పెక్టర్ జనరల్, డీఐజీ హైదరాబాద్ రేంజ్ డాక్టర్ డి.శ్రీనివాస్, డీఐజీ వరంగల్ రేంజ్ ఎం.సంపత్ పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES

Latest News