వారోత్సవాల సమయంలో అభివృద్ధి, సంక్షేమా కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని కేబినెట్ నిర్ణయించింది.
- ప్రజాపాలన వారోత్సవాలనంతరం నోటిఫికేషన్
- వారోత్సవాల్లో గ్రామాల్లో పెద్ద ఎత్తున ప్రచారం
- గిగ్ వర్కర్లకు ఇక రక్షణ కవచం
- వెట్టినుంచి విముక్తితో పాటు ఉద్యోగ భద్రత
- సంక్షేమం, సామాజిక భద్రత లక్ష్యంగా బిల్లు
- చర్చించి ఆమోడించిన తెలంగాణ కేబినేట్
- కేబినేట్లో మంత్రులతో చర్చించిన సీఎం రేవంత్
కేబినెట్ కీలక నిర్ణయం
స్థానిక సంస్థల ఎన్నికలపై తెలంగాణ కేబినెట్ కీలక నిర్ణయం తీసుకుంది. ప్రజాపాలన వారోత్సవాల తర్వాత ఎన్నికలు నిర్వహించాలని నిర్ణయించింది. డిసెంబర్ 1 నుంచి 9 వరకు ప్రజాపాలన వారోత్సవాలు నిర్వహించనున్నారు. ఆ తర్వాత ఎప్పుడైనా ఎన్నికలు నిర్వహించే అవకాశం ఉంది. మరోవైపు సౌదీ అరేబియాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతిచెందిన వారి కుటుంబాలకు రూ.5 లక్షల పరిహారం చెల్లించాలని కేబినెట్ నిర్ణయించింది. మంత్రి అజారుద్దీన్, ఎంఐఎం ఎమ్మెల్యే, మైనార్టీ విభాగానికి చెందిన ఓ అధికారితో కూడిన ప్రభుత్వ ప్రతినిధి బృందాన్ని వెంటనే సౌదీకి పంపించాలని సూచించింది.
చనిపోయిన వారి మృతదేహాలకు మత సంప్రదాయం ప్రకారం.. అక్కడే అంత్యక్రియలు నిర్వహించాలని నిర్ణయించింది. బిసి రిజర్వేషన్ల వ్యవహారంతో ఆగిపోయిన స్థానిక సంస్థల ఎన్నికలను నిర్వహించాలని కేబినెట్ కీలక నిర్ణయం తీసుకుంది. డిసెంబర్ రెండో వారంలో స్థానిక సంస్థల ఎన్నికల షెడ్యూల్ ఉంటుందని పేర్కొంది. ప్రజాపాలన వారోత్సవాల తర్వాతే లోకల్ బాడీ ఎలక్షన్స్ ఉంటాయని మంత్రివర్గ భేటీ స్పష్టం చేసింది. డిసెంబర్ 1 నుంచి 9 వరకు తెలంగాణ ప్రజాపాలన వారోత్సవాలు జరగనున్నాయి. వారోత్సవాల సమయంలో ప్రభుత్వం అమలు చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని కేబినెట్ నిర్ణయించింది.
స్థానిక సంస్థల ఎన్నికలలో భాగంగా సర్పంచ్ సహా జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలు నిర్వహించాల్సి ఉంది. అయితే ముందుగా సర్పంచ్ ఎన్నికలు నిర్వహించాలని కేబినెట్ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. సర్పంచ్ ఎన్నికల తరవాతే జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలు నిర్వహించాలని మంత్రివర్గ భేటీలో చర్చించినట్లు సమాచారం. జూబ్లీహిల్స్ ఎన్నికల ఫలితంనే లోకల్ బాడీ ఎలక్షన్‌లలో పునరావృతం చేయాలని కాంగ్రెస్ ప్రభుత్వం చూస్తోంది.
ఇక తెలంగాణ రాష్ట్రంలో స్థానిక సంస్థల పదవీకాలం ముగిసి 20 నెలలు పూర్తయ్యాయి. ఇటీవల బీసీలకు 42 శాతం రిజర్వేషన్ల అంశం తీవ్ర వివాదాస్పదమైంది. దీనిపై హైకోర్టు, సుప్రీం కోర్టు వ్యతిరేకంగా తీర్పు నిచ్చాయి. రిజర్వేషన్లు 50శాతం దాటరాదన్న నిబంధనలను పాటించాలని సూచించాయి. మొత్తానికి డిసెంబర్‌లో ఎన్నికలకు సంబంధించి నోటిఫికేషన్ విడుదల కానుంది. సిఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన సోమవారం నాడు రాష్ట్ర సచివాలయంలో మంత్రివర్గం సమావేశం జరిగింది.
ఈ సమావేశంలో అనేక అంశాలపై చర్చించారు. ముఖ్యంగా స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణపై చర్చించినట్లు సమాచారం. ఇప్పటికే ఎన్నికల నిర్వహణ ఆలస్యమైన నేపథ్యంలో ఇక ఆలస్యం చేయొద్దని.. వీలైనంత తర్వగా లోకల్ బాడీ ఎలక్షన్స్ నిర్వహించాలని నిర్ణయించింది మంత్రివర్గం. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి రెండేళ్లు అవుతున్న నేపథ్యంలో తమ ప్రభుత్వం ప్రజల కోసం ఏం చేసిందనే విషయాన్ని ప్రజాపాలన వారోత్సవాల్లో వివరించాలని మంత్రివర్గం తీర్మానించింది.
గ్రామ స్థాయిలో ప్రభుత్వ పథకాలు, ప్రభుత్వం చేపట్టిన కార్యక్రమాలను ప్రచారం చేసి.. లోక్‌బాడీ ఎన్నికల్లో జయకేతనం ఎగురవేయాలని నిర్ణయించింది. ప్రజాపాలన వారోత్సవాలతో గ్రామ స్థాయి కేడర్‌లో మరింత ఉత్సాహం నింపి స్థానిక ఎన్నికల్లో విజయ ఢంకా మోగించాలని భావిస్తున్నారు.
తెలంగాణ గిగ్ వర్కర్స్ బిల్లుకు కేబినెట్ ఆమోదం తెలిపింది. సోమవారం సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన సచివాలయంలో మంత్రి మండలి సమావేశం జరిగింది.
ఈ భేటీలో ’తెలంగాణ ప్లాట్‌ఫామ్ ఆధారిత గిగ్ వర్కర్ల రిజిస్టేష్రన్, సామాజిక భద్రత, సంక్షేమం బిల్లు2025’పై చర్చించిన అనంతరం బిల్లుకు కేబినెట్ ఆమోద ముద్ర వేసింది. గిగ్ వర్కర్ల సంక్షేమం, సామాజిక భద్రత లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం ఈ బిల్లును రూపొందించింది. కేబినెట్ ఆమోదం పొందిన ఈ బిల్లు చట్టరూపం దాలిస్తే దేశంలోనే తొలిసారిగా సమగ్ర గిగ్ వర్కర్ల చట్టం తెచ్చిన తొలి రాష్ట్రంగా తెలంగాణ అవతరిస్తుంది.
ఇకపై గిగ్ వర్కర్లను రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక శ్రామిక వర్గంగా గుర్తిస్తుంది. ప్రస్తుతం రాష్ట్రంలో దాదాపు 3 లక్షల నుంచి 4 లక్షల వరకు గిగ్, ప్లాట్‌ఫామ్ వర్కర్లు ఉన్నారు. వీరిలో ఎక్కువ శాతం రవాణా (మొబిలిటీ), డెలివరీ, లాజిస్టిక్స్ రంగాల్లో పనిచేస్తున్నారు. వీరు సాధారణంగా వారానికి 7 రోజుల పాటు రోజుకు 10 నుంచి12 గంటల చొప్పున వర్క్ చేస్తున్నారు. వీరి ఆదాయంలో ప్లాట్‌ఫామ్‌లు 20 నుంచి 30శాతం వరకు కమిషన్‌గా వసూలు చేస్తున్నాయి. ఈ క్రమంలో వారికి స్థిరమైన ఆదాయం, సామాజిక భద్రత లేకుండాపోవడం ప్రధాన సమస్యగా ఉంది.
తాజా బిల్లులో గిగ్ వర్కర్ల సంక్షేమానికి రాష్ట్ర ప్రభుత్వం హైదరాబాద్ కేంద్రంగా ’తెలంగాణ ప్లాట్‌ఫామ్‌ఆధారిత గిగ్ వర్కర్ల సామాజిక భద్రత, సంక్షేమ బోర్డు’ పేరుతో ప్రత్యేక బోర్డు ఏర్పాటు చేయనుంది. ఈ బోర్డు గిగ్ వర్కర్ల రిజిస్టేష్రన్, సంక్షేమ పథకాల అమలు, నిధుల పర్యవేక్షణ బాధ్యతలు చేపడుతుంది. అగ్రిగేటర్లకు చెల్లించే సొమ్ములో 12 శాతం వాటాను గిగ్ వర్కర్ల సంక్షేమ నిధికి మళ్లించనున్నారు. దీనికి తోడు ప్రభుత్వం తరఫున సీఎస్‌ఆర్ ఫండ్స్, విరాళాలు, గ్రాంట్లను ఈ నిధికి అందజేస్తుంది. ప్లాట్‌ఫామ్‌ల చెల్లింపులు సక్రమంగా జరుగుతున్నాయా? లేదా? అనేది పర్యవేక్షించేందుకు రియల్‌టైమ్ ’వెల్ఫేర్ ఫండ్ ఫీ వెరిఫికేషన్ సిస్టమ్ అందుబాటులోకి తేనున్నారు.
స్విగ్గీ, జొమాటో, జెప్టో, ఉబర్, ఓలా వంటి ప్లాట్ ఫామ్‌లు, కార్మికుల మధ్య తలెత్తే వివాదాలను ఇన్‌టైంలో పరిష్కరించేందుకు వీలుగా ప్రభుత్వం ప్రత్యేక గ్రీవెన్స్ రిడ్రెసల్ వ్యవస్థను ఏర్పాటు చేయాలని ముసాయిదాలో పొందుపరిచింది. ఇందులో భాగంగా గిగ్ కార్మికుల జీతాల చెల్లింపులో ఆలస్యం, మోసాలు, అకారణంగా అకౌంట్లు సస్పెండ్? చేయడం.. లాంటి సమస్యల పరిష్కారానికి గ్రీవెన్స్ రిడ్రెసల్ అధికారులను నియమిస్తారు. 100 మందికి పైగా కార్మికులు ఉండే ప్రతి పెద్ద ప్లాట్‌ఫామ్‌లో ’అంతర్గత వివాద పరిష్కార కమిటీ’ని తప్పనిసరిగా ఏర్పాటుచేయాల్సి ఉంటుంది. ఈ కమిటీల ద్వారా పరిష్కారం లభించకపోతే, పైస్థాయిలో అప్పీలేట్ అథారిటీకి వెళ్లే అవకాశం ఉంటుంది.
ఇందుకోసం బిల్లులో ప్రత్యేక నిబంధనలు పొందుపరిచారు. కార్మికులు లేదా ఎª`లాట్‌ఫామ్‌లు గ్రీవెన్స్ అధికారులు ఇచ్చిన నిర్ణయంపై సంతృప్తిచెందకపోతే వారు అప్పీలేట్ అథారిటీని ఆశ్రయించే అవకాశం ఉంది. ఈ అథారిటీ స్వతంత్రంగా విచారణ జరిపి తుది నిర్ణయం తీసుకోనుంది. తద్వారా కార్మికులకు న్యాయపరమైన భరోసా దక్కుతుంది. చట్టం అమల్లోకి వస్తే ఆయా ప్లాట్‌ఫామ్‌లు ఇకపై ఉద్యోగులను అకారణంగా తొలగించలేవు. ఎవరైనా ఉద్యోగిని తొలగించాలంటే కనీసం ఏడు రోజుల ముందు నోటీసు ఇవ్వడం తప్పనిసరి. గతంలో ప్లాట్‌ఫామ్‌లు గిగ్ వర్కర్ల అకౌంట్లను ఒక్కసారిగా నిలిపివేసేవి. దీనివల్ల కార్మికులు ఉన్నఫళంగా రోడ్డునపడేవారు.
తాజా బిల్లులో కస్టమర్ భద్రతకు ముప్పు కాని సందర్భాల్లో.. ఏ వర్కర్‌నైనా తొలగించాలంటే కనీసం ఏడు రోజుల ముందుగా నోటీసు ఇవ్వాలనే నిబంధన పెట్టారు. పని కేటాయింపు, తొలగింపు.. తదితర అంశాల్లో వివక్ష లేకుండా ఉండేందుకు, ప్లాట్‌ఫామ్‌లు ఉపయోగిస్తున్న అల్గారిథమ్‌లు పారదర్శకంగా ఉండేలా చూడాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ప్రస్తుతం గిగ్ వర్కర్లకు పని కేటాయింపులు, బోనస్‌లు, రేటింగ్‌లు, అకౌంట్ సస్పెన్షన్‌లు పూర్తిగా సాప్ట్‌వేర్ అల్గారిథమ్‌పై ఆధారపడి నడుస్తున్నాయి. వీటిలో వివక్ష, అన్యాయానికి తావులేకుండా బిల్లులో ’అల్గారిథమ్ ట్రాన్సపరెన్సీ’ని తప్పనిసరి చేస్తున్నారు. దీని ద్వారా కార్మికులు తమ పనిపై ప్రభావం చూపే నిర్ణయాలు ఎలా తీసుకుంటున్నారో తెలుసుకునే హక్కు పొందుతారు.
గిగ్‌వర్కర్ల బిల్లు రూపకల్పన నుంచి ఆమోదం వరకు ప్రభుత్వం శాస్త్రీయంగా ముందుకు వెళ్తున్నది. ముందుగా రాష్ట్రంలో 1,300 మంది గిగ్ వర్కర్లపై సర్వే నిర్వహించి, వారు ఎదుర్కొంటున్న సమస్యల ఆధారంగా బిల్లులో పలు అంశాలు పొందుపరిచింది. 2024 జనవరి నుంచి 2025 జూన్ వరకు అగ్రిగేటర్లు, గిగ్ వర్కర్ల సంఘాలు, నిపుణులు, న్యాయవేత్తలతో ఆరుసార్లు సంప్రదింపులు చేపట్టి.. పలు మార్పులు చేర్పులు చేసింది. న్యాయశాఖ పరిశీలన అనంతరం ఈ ఏడాది ఏప్రిల్ 14 నుంచి మే 19 వరకు బిల్లుపై ప్రజాభిప్రాయ సేకరణ చేపట్టింది. 66 సూచనలు, అభ్యంతరాలు అందగా.. వీటిలో చాలా అంశాలను బిల్లులో పొందుపరిచారు.
