‘సాహెబ్‌నగర్ కలాన్’ కేసులో సుప్రీం తీర్పు
గుర్రంగూడ అటవీ భూమిపై రాష్ట్రానికే హక్కు అని స్పష్టీకరణ
తెలంగాణ రాష్ట్ర వాదనను సమర్థించిన సుప్రీంకోర్టు
ఈ తీర్పుతో అటవీ శాఖకు అతిపెద్ద విజయం
రాష్ట్ర ప్రభుత్వానికి దక్కిన సుమారు 102 ఎకరాల విలువైన భూమి
ఈ భూమి విలువ దాదాపు రూ.15 వేల కోట్లు ఉంటుందని అంచనా
సుప్రీంకోర్టు తాజా తీర్పు పట్ల రెండు తెలుగు రాష్ట్రాల ప్రజల హర్షం
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం (Telangana State Government) గురువారం సుప్రీంకోర్టు(Supreme court)లో అతిపెద్ద విజయం సాధించింది. రంగారెడ్డి జిల్లా హయత్ నగర్ మండలం (Hayath Nagar Mandal) సాహెబ్‌నగర్ కలాన్ గ్రామ (Sahebnagar Kalan Village) పరిధిలోని సుమారు 102 ఎకరాల భూమి రాష్ట్ర ప్రభుత్వానిదేనని సుప్రీంకోర్టు తీర్పు (Judgement) చెప్పింది. సర్వే నంబర్ 201/1లో ఉన్న ఆ భూమి గుర్రంగూడ రిజర్వ్ ఫారెస్ట్(Gurranguda Reserve Forest)లో భాగమని, ప్రైవేట్ ల్యాండ్ (Private Land) కాదని దేశ అత్యున్నత న్యాయస్థానం స్పష్టం చేసింది. ఆ భూమికి తామే చట్టబద్ధ వారసులమంటూ కొంత మంది దాఖలు చేసిన పిటిషన్లను తోసిపుచ్చింది.
దీంతో కీలకమైన ఈ కేసులో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి (Telangana State Govenment) భారీ ఊరట లభించినట్లయింది. ఈ భూమి విషయంలో రాష్ట్ర ప్రభుత్వం అనుసరించిన వైఖరినే సుప్రీంకోర్టు సమర్థించింది. దీంతో గతంలో కింది కోర్టులు ఇచ్చిన ఉత్తర్వులను సుప్రీంకోర్టు రద్దు చేసినట్లు రంగారెడ్డి జిల్లా డీఎఫ్ఓ రోహిత్ గోపిడి ఒక ప్రకటనలో తెలిపారు.
ఈ కేసుపై సుప్రీంకోర్టులో మూడు రోజుల పాటు విచారణ జరిగింది. నోటిఫై చేసిన అటవీ భూములపై చాలా ఆలస్యంగా ప్రైవేట్ హక్కుల పేరిట దాఖలు చేసే దావాలు చట్టబద్ధంగా లేవని కూడా కోర్టు తేల్చిచెప్పింది. అటవీ భూములు జాతీయ సంపద అని మరోసారి గుర్తు చేసింది. రాజ్యాంగంలోని ఆర్టికల్స్ 48ఏ, 51ఏ(జి) ప్రకారం అటవీ భూములను పరిరక్షించడం రాష్ట్ర ప్రభుత్వ బాధ్యత అని కోర్టు పేర్కొంది. అటవీ శాఖ చేపట్టిన చర్యలు చట్టానికి, పర్యావరణ పరిరక్షణ సూత్రాలకు అనుగుణంగానే ఉన్నాయని వివరించింది.
ఈ తీర్పుతో రిజర్వ్ ఫారెస్ట్ భూముల అక్రమ ఆక్రమణలు, చట్టవిరుద్ధ హక్కుల నుంచి కాపాడే విషయంలో అటవీ శాఖకు మరింత బలం చేకూరింది. అటవీ సంరక్షణ, పర్యావరణ సమతుల్యత, సుస్థిర అభివృద్ధి పట్ల తెలంగాణ ప్రభుత్వం చూపుతున్న నిబద్ధతకు ఇది బలమైన మద్దతుగా నిలిచింది.
ఈ కేసులో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తరఫున సీనియర్ న్యాయవాది సి.ఎస్.వైద్యనాథన్, జస్టిస్(రిటైర్డ్) చల్ల కోదండరాం, అదనపు సొలిసిటర్ జనరల్ ఐశ్వర్య భాటి, అడ్వకేట్ ఆన్ రికార్డ్ కర్ణం శ్రావణ్ కుమార్ సమర్థంగా వాదనలు వినిపించారు. ఈ మేరకు వారికి అటవీ శాఖ కృతజ్ఞతలు తెలిపింది. జిల్లా అటవీ శాఖ అధికారులు, డివిజనల్ ఫారెస్ట్ ఆఫీసర్స్, ఫారెస్ట్ రేంజ్ అధికారులు, క్షేత్రస్థాయి సిబ్బంది కొన్నేళ్లుగా చేసిన నిరంతర కృషి వల్లే ఈ కీలక తీర్పు సాధ్యమైందని పేర్కొన్నారు.
గుర్రంగూడ అటవీ భూమిపై పూర్తి హక్కులు రాష్ట్ర ప్రభుత్వానికే చెందుతాయంటూ సుప్రీంకోర్టు తీర్పు ఇవ్వటం పట్ల తెలంగాణ రాష్ట్ర ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. దాదాపు 15 వేల కోట్ల రూపాయల విలువైన ప్రభుత్వ భూములను అడ్డదారిలో దక్కించుకోవటానికి ప్రయత్నించిన అక్రమార్కులకు న్యాయస్థానం చెక్ పెట్టిందని పేర్కొంటున్నారు. ఇకపై ఎవరూ కూడా ఇలా ఫేక్ డాక్యుమెంట్లతో సర్కారు భూములను కాజేయాలని చూస్తే సుప్రీంకోర్టూ చూస్తూ ఊరుకోదని, ఆలస్యంగానైనా వారికి బుద్ధి చెబుతుందని పరిశీలకులు హెచ్చరించారు.
గుర్రంగూడ అటవీ భూములపై సుప్రీంకోర్టు ఇచ్చిన ఈ తీర్పు రెండు తెలుగు రాష్ట్ర ప్రభుత్వాలకు కొండంత నైతిక బలం చేకూర్చిందని, కబ్జాకోరులపై ఉక్కుపాదం మోపటానికి ఉత్సాహాన్నిచ్చిందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. తెలంగాణలో ముఖ్యంగా హైదరాబాద్‌లో కోట్ల విలువైన గవర్నమెంట్ ల్యాండ్స్‌ని ఆక్రమణల బారి నుంచి కాపాడేందుకు రేవంత్ రెడ్డి సర్కార్ తీసుకొచ్చిన హైడ్రాకు కూడా ఈ జడ్జిమెంట్ మరింత స్ఫూర్తినిస్తుందని చెబుతున్నారు. ఏపీ, తెలంగాణల్లో ఎన్నో వందల ఎకరాల ప్రభుత్వ భూములను దొడ్డిదారిన సొంతం చేసుకున్నవారి నుంచి వాటిని రక్షించేందుకు ఇదే రీతిలో రాష్ట్ర ప్రభుత్వాలు కోర్టుల్లో సమర్థవంతంగా వాదనలు వినిపించాలని ప్రజలు కోరుకుంటున్నారు.
కింది కోర్టుల్లో ప్రతికూల తీర్పులు వచ్చినా నిరుత్సాహపడకుండా పట్టు వదలని విక్రమార్కుల్లా న్యాయవాదులు ప్రభుత్వం తరఫున పోరాడాలని పలువురు సూచిస్తున్నారు. ప్రభుత్వ ఆస్తులు పరుల పరం కాకుండా సీఎంలు రేవంత్ రెడ్డి, చంద్రబాబు మరింత కఠిన చర్యలు తీసుకోవాలని ఇరు రాష్ట్రాల ప్రజలు విజ్ఞప్తి చేస్తున్నారు. కోర్టుల్లో విచారణలకు సుదీర్ఘ కాలం పట్టినప్పటికీ చివరికి వక్రమార్గంలో వెళ్లినవారికి చుక్కెదురు కాక తప్పదని ఈ తీర్పు చెబుతున్నట్లు న్యాయ నిపుణులు తెలిపారు. ప్రభుత్వ భూములను భూబకాసురుల వశం కాకుండా అడ్డుకొని ప్రభుత్వాలు ప్రజాభిమానం చూరగొనాలని నిజాయితీపరులు సూచిస్తున్నారు.
