- ఏకగ్రీవంగా తమీమ్ ని ఎన్నుకున్న ప్రభుత్వ కమిటీ..
- అమినుల్ ఇస్లాం బృందాన్ని తొలగించిన ప్రభుత్వం..
బంగ్లాదేశ్ మాజీ క్రికెటర్ తమీమ్ ఇక్బాల్ ఆ దేశ క్రికెట్ బోర్డు అధ్యక్షుడిగా ఎంపికయ్యాడు. అవినీతి ఆరోపణలతో నిత్యం వార్తల్లో నిలుస్తున్న బీసీబీకి కొత్త చీఫ్‌గా తమీమ్‌ను నియమించింది ప్రభుత్వం. అమినుల్ ఇస్లాం నేతృత్వంలోని బోర్డును రద్దు చేసిన ప్రభుత్వం మంగళవారం ఈ మాజీ ఓపెనర్‌కు పగ్గాలు అప్పగించింది. ఇటీవల భారత్‌లో టీ20 ప్రపంచకప్‌ను బాయ్‌కాట్ చేయాలనే నిర్ణయాన్ని వ్యతిరేకించిన తమీమ్ బీసీబీ అధ్యక్షుడు కావడంతో బీసీసీఐతో సంబంధాలు మరింత మెరుగయ్యే అవకాశముంది.
నిరుడు అక్టోబర్‌లో జరిగిన బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు ఎన్నికల్లో అవకతవకల నేపథ్యంలో కొత్త అధ్యక్షుడి ఎంపిక అనివార్యమైంది. ఎన్నికల్లో అవినీతిపై నిజాలు నిగ్గు తేల్చేందుకు ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఐదుగురు సభ్యుల కమిటీ తదుపరి బోర్డు అధ్యక్షుడిగా మాజీ కెప్టెన్ తమీమ్ ఇక్బాల్ పేరును ప్రతిపాదించింది. దాంతో, అమినుల్ ఇస్లాం బృందాన్ని తొలగించిన ప్రభుత్వం తమీమ్‌కు అధికారాలు కట్టబెట్టింది.
