Wednesday, February 11, 2026
Homeఆదాబ్ ప్రత్యేకంSwargaseema | బోలెడన్ని వేషాలు.. బురిడీ కొట్టించి మోసాలు..

Swargaseema | బోలెడన్ని వేషాలు.. బురిడీ కొట్టించి మోసాలు..

  • దేవుళ్ళు, మత విశ్వాసాలే ఇతగాడికి పెట్టుబడులు..
  • ఆస్కార్‌ స్థాయిని మించి నటిస్తాడు..
  • తన హావభావాలతో, మాటల మాయతో కప్పేస్తాడు..
  • స్వర్గసీమ గ్రూప్‌ అమేయ లే అవుట్‌ పేరుతో భారీ ప్రచారం..
  • డీసీసీటీ పర్మిషన్‌, రేరా రిజిస్ట్రేషన్‌ అంటూ దొంగ నెంబర్లతో మోసం..
  • 42 ఎకరాల్లో వేస్తున్న లేఅవుట్‌ కి ఎలాంటి చట్టబద్దమైన అనుమతులు లేవు..
  • పెట్టుబడులు ఆకర్షించడానికి చేస్తున్న ప్రయత్నమే ఇది..
  • వేదాంతాలు వల్లిస్తూ అమాయకులను నిలువునా ముంచుతున్న చంద్ర చంద్రశేఖర్‌..
  • ఇతగాడిపై చర్యలు తీసుకుని వారిని రక్షంచాలని డిమాండ్‌ చేస్తున్న ట్రెసా..
  • ఈ మేరకు సంబంధిత అధికారులకు ఫిర్యాదు చేసిన కొల్లూరి శ్రీనివాస రావు..

రియల్‌ ఎస్టేట్‌ రంగంలో 20 సంవత్సరాలకు పైగా అనుభవం.. ఓపెన్‌ ప్లాట్‌ డెవలప్‌మెంట్‌లో ఒక విశ్వసనీయ బ్రాండ్‌గా తీర్చిదిద్దాం.. విజయవంతమైన బిల్డర్‌గా ప్రారంభమై, దూరదృష్టి కలిగిన భూ అభివృద్ధిదారుడిగా ఎదిగిన నాకు ప్రకృతి, పచ్చదనం, సంప్రదాయ జీవన విధానం, స్థిరమైన పర్యావరణం పట్ల అపారమైన ఆసక్తి ఉంది. ఈ విలువలే నా ప్రతి ప్రాజెక్ట్‌లో స్పష్టంగా కనిపిస్తాయి. వినియోగదారుడే కేంద్రంగా ఉండే నా ఆలోచన విధానం, నిబద్ధత, నాకున్న అనుభవం మా సంస్థ విజయానికి బలంగా నిలుస్తున్నాయి… ఈ విధంగా చెప్పే అయన మాటలు వింటుంటే యిట్టే పడిపోతాం..

స్వర్గంలో విహరింజేసేలా మాయమాటలు చెబుతాడు.. మాటలకు తగ్గట్టు వేషాలు మారుస్తాడు.. షోషల్‌ మీడియాలో ఊదరగొడతాడు.. ప్రజలను మభ్యపెడతాడు.. ఒక్కసారి అతడి మాటలు విని, అతని వేషధారణలు చూసి వలలో పడిపోయామా ఇక అంతే సంగతులు.. మీ కష్టార్జితం బూడిదలో పోసిన పన్నీరు అవుతుంది.. ఆయన చెప్పేది శ్రీరంగ నీతులు.. చేసేవి అవినీతి పనులు.. ఆయనే స్వర్గసీమ గ్రూప్స్‌ అధినేత చంద్ర చంద్రశేఖర్‌.. స్వర్గసీమ గ్రూప్‌ అమేయ లే అవుట్‌ పేరుతో ప్రచారం సాగిస్తూ తన రియల్‌ ఎస్టేట్‌ ప్రాజెక్ట్‌ విషయంలో అమాయకుల నెత్తిన కుచ్చుటోపీ పెడుతున్న ఈయన చేస్తున్న మహా మాయాజాలం మీకోసం..

- Advertisement -

రంగారెడ్డి జిల్లా, షాద్‌ నగర్‌ పరిధిలోని బుర్గుల గ్రామం.. ఇక్కడ ‘‘స్వర్గసీమ గ్రూప్‌ అమేయ లే అవుట్‌’’ పేరుతో భారీగా ప్రచారం చేసుకుంటూ తన రియల్‌ ఎస్టేట్‌ ప్రాజెక్ట్‌ విషయంలో ప్రజలను మభ్యపెట్టే విధంగా తప్పుడు ప్రకటనలు ఇస్తున్నారు చంద్ర చంద్రశేఖర్‌.. ఈ లేఅవుట్‌ను 42 ఎకరాల డీటీసీపీ అప్రూవ్డ్‌, రేరా రిజిస్టర్డ్‌ ప్రాజెక్ట్‌గా ఆయన ప్రచారం చేసుకుంటున్నారు.. కానీ వాస్తవానికి ఈ ప్రాజెక్ట్‌ కి ఎలాంటి చట్టబద్ధ అనుమతులు లేవు.. డీటీసీపీ లేఅవుట్‌ పర్మిషన్‌ నంబర్‌ 12/2018/హెచ్‌, రేరా రిజిస్ట్రేషన్‌ నంబర్‌ పీ 02400000616 అంటూ ప్రజల్లో నమ్మకం కలిగించే ప్రయత్నం చేస్తున్నారు.. ఇవన్నీ పెట్టుబడులు ఆకర్షించేందుకే తప్పుడు విధంగా వినియోగిస్తున్నట్లు తెలంగాణ రియల్‌ ఎస్టేట్‌ సఫరర్స్‌ అసోషియేషన్‌ ఆరోపిస్తోంది.. భూసంబంధ చట్టాలు, అభివృద్ధి నిబంధనలను ఉల్లంఘిస్తూ ఈ ప్రాజెక్ట్‌ను కొనసాగిస్తున్నారని వారు సంబంధిత అధికారులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నారు..

అంతే కాకుండా, అక్రమ లేఅవుట్‌ డెవలప్‌మెంట్‌, ప్రభుత్వ అనుమతులు ఉన్నట్లు చూపించడం.. మోసపూరిత ప్రకటనలు చేయడం.. ఆ ప్రకటనల్లో సదరు చంద్రశేఖర్‌ పోలీస్‌ యూనిఫాం ధరించడం, రైతుగా నటించడం, పోర్టర్‌ మేకర్‌గా వ్యవహరించడం, మత భావాలను దెబ్బతీసేలా ప్రవర్తిస్తున్నాడు.. ఇలాంటి అంశాలను తీవ్రంగా పరిగణించాలని వారు కోరారు.. ఈ వ్యవహారంపై సమగ్ర విచారణ చేపట్టి, బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని ట్రెసా విజ్ఞప్తి చేసింది. కాగా వ్యవసాయ భూములను ప్రభుత్వ అనుమతులు లేకుండానే నివాస/ వాణిజ్య ప్లాట్లుగా చూపిస్తూ విక్రయాలు చేపట్టినట్లు చంద్ర చంద్రశేఖర్‌ పై తీవ్ర ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. సంబంధిత ప్రాజెక్ట్‌లోని భూములు పూర్తిగా వ్యవసాయ భూములేనని, వాటిని నాన్‌`అగ్రికల్చరల్‌ లేదా రెసిడెన్షియల్‌ ప్రయోజనాలకు మార్చేందుకు అవసరమైన చట్టబద్ధ అనుమతులు ఏవీ పొందలేదని ఫిర్యాదులో పేర్కొన్నారు.

లేఅవుట్‌ అనుమతులు ఉన్నట్లు ప్రచారం చేసినా, అవి తప్పనిసరి చట్టపరమైన విధానాలను అనుసరించి పొందలేదని, భూమిపై స్పష్టమైన మార్కెటబుల్‌ టైటిల్‌ కూడా లేదని ఆరోపించారు. అవసరమైన ప్రభుత్వ అనుమతులు లేకుండానే భూములను ప్లాట్లుగా విభజించి ‘లేఅవుట్‌’ పేరుతో ప్రజలకు విక్రయించడం ద్వారా అమాయక కొనుగోలుదారులను మోసం చేశారని పేర్కొన్నారు. దీని వల్ల బాధితులకు తీవ్ర ఆర్థిక నష్టం, మానసిక వేదన కలిగినట్లు ఫిర్యాదులో వివరించారు.అలాగే, ఈ అక్రమ కార్యకలాపాలు భూసంబంధిత చట్టాలు, డీటీసీపీ నిబంధనలు, రేరా నియమావళికి పూర్తిగా విరుద్ధం.. స్టాంప్‌ డ్యూటీ, రిజిస్ట్రేషన్‌ చార్జీలు, డెవలప్‌మెంట్‌ ఛార్జీలు, కన్వర్షన్‌ ఫీజులు తదితర ప్రభుత్వానికి చెందవలసిన ఆదాయాలను ఎగ్గొట్టడం ద్వారా ప్రభుత్వ ఖజానాకు భారీ నష్టం వాటిల్లుతోంది.. ఈ చర్యలు ప్రజా ఆదాయానికి నష్టం కలిగించడమే కాకుండా న్యాయ పాలనను కూడా నిర్లక్ష్యం చేస్తున్నాయి..

ఇదిలా ఉండగా, సోషల్‌ విూడియా, టెలివిజన్‌ ఛానెల్స్‌, మెట్రో రైల్వే ప్రకటనల ద్వారా ఈ ప్రాజెక్ట్‌ను పూర్తిగా చట్టబద్ధమైనదిగా, ప్రభుత్వ ఆమోదం పొందినదిగా, భద్రమైన పెట్టుబడిగా చూపిస్తూ… విస్తృత ప్రచారం నిర్వహి స్తున్నారని ఆరోపణలు వెల్లువెత్తు తున్నాయి.. ఈ ప్రకటనలు ముఖ్యంగా మధ్యతరగతి కుటుంబాలు, తొలిసారి పెట్టుబడి పెట్టేవారు, వృద్ధులను లక్ష్యంగా చేసుకుని మోసపూరితంగా రూపొందించబడ్డాయని స్పష్టంగా అర్ధం అవుతోంది.. తప్పుడు ప్రకటనల ద్వారా ప్రజల్లో నమ్మకం కలిగించి, ప్రాజెక్ట్‌కు సంబంధించిన అసలు వ్యవహారాన్ని దాచిపెట్టి, పెట్టుబడులు రాబడుతున్నారని తెలుస్తోంది.. ఈ అంశాలపై సంబంధిత అధికారులు విచారణ చేపట్టి తగిన చర్యలు తీసుకోవాలని బాధితులు డిమాండ్‌ చేస్తున్నారు.

ఇక మత విశ్వాసాలను ఆసరాగా చేసుకుని వాణిజ్య మోసాలకు పాల్పడుతున్నారన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.. ఇప్పుడు ఈ వ్యవహారాలు తీవ్ర చర్చనీయాంశంగా మారాయి. ప్రజల నమ్మకాన్ని దుర్వినియోగం చేస్తూ ప్రజా శాంతి, గౌరవం, సామరస్యాన్ని భంగం కలిగించే చర్యలకు పాల్పడుతున్నారన్న ఆరోపణల నేపథ్యంలో ఈ అంశంపై లోతైన న్యాయ విచారణ అవసరమని డిమాండ్‌ చేస్తోంది ట్రెసా.. .కాగా ఈ ప్రాజెక్టుకు లేఅవుట్‌ అనుమతులు జారీ చేసే క్రమంలో డీటీసీపీ శాఖకు చెందిన కొందరు అధికా రులు కూడా భాగస్వాములు అయ్యారనే అనుమానాలు తలెత్తు తున్నాయి..

భూమి యాజమాన్య హక్కులు, చట్టపరమైన స్థితి, నిషేధిత లేదా అసైన్‌ భూముల వివరాలు, ప్రభుత్వ భూములపై హక్కులు, ఎన్‌కంబ్రెన్స్‌లపై తప్పనిసరి పరిశీలనలు చేయాల్సి ఉండగా, అవి పూర్తిగా చేయకపోవడం లేదా అత్యంత అలసత్వంగా నిర్వహించారన్న ఆరోపణలు ఉన్నాయి. ఈ లోపాలు తీవ్రమైన విధివిధానాల ఉల్లంఘనలకు, అధికార దుర్వినియోగానికి, అనుమానాస్పద అక్రమాలకు దారి తీసినట్టు ఫిర్యాదుదారులు పేర్కొన్నారు. కాగా ఇలాంటి చర్యల వల్ల ప్రభుత్వ వ్యవస్థలపై ప్రజల్లో నమ్మకం దెబ్బతింటోందని, అందువల్ల ఈ వ్యవహారంపై స్వతంత్ర, ఉన్నతస్థాయి విచారణ జరిపి అవినీతి లేదా అధికార దుర్వినియోగం జరిగిందా లేదా..? అనే విషయంపై స్పష్టత తీసుకురావాలని వారు కోరుతు న్నారు. అయితే చంద్ర చంద్రశేఖర్‌ చేసిన చర్యలు పలు చట్టాల కింద నేరాలకు దారి తీస్తాయని ఫిర్యాదులో పేర్కొన్నారు.

అందులో ముఖ్యంగా :

మోసం, మభ్యపెట్టడం, నమ్మకద్రోహం, ప్రభుత్వ ఉద్యోగిగా నటించడం, అధికార యూనిఫాంని దుర్వినియోగం చేయడం, అక్రమ భూ అభివృద్ధి నేరాలు, రేరా నిబంధనల ఉల్లంఘన, మత భావాలను దెబ్బతీసే చర్యలు, ప్రభుత్వానికి ఆర్థిక నష్టం కలిగించడం వంటివి ఉన్నాయి.. వీటన్నింటినీ పరిగణలోకి తీసుకుని చంద్ర చంద్రశేఖర్‌తో పాటు సంబంధిత వ్యక్తులపై తగిన క్రిమినల్‌ కేసులు నమోదు చేయాలని సంబంధిత అధికారులను ఫిర్యాదుదారులు కోరారు. ఈ వ్యవహారం రాజకీయ, పరిపాలనా వర్గాల్లో తీవ్ర చర్చకు దారి తీసే అవకాశం ఉందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.కాగా శాండల్‌వుడ్‌ ఫార్మ్స్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ సంస్థ అక్రమంగా డీటీసీపీ, రెరా అనుమతులు పొందిందని ఆరోపిస్తూ తెలంగాణ రియల్‌ ఎస్టేట్‌ సఫరర్స్‌ అసోసియేషన్‌ అధ్యక్షుడు అధికారులకు ఫిర్యాదు చేశారు. ఈ వ్యవహారంపై ఉన్నత స్థాయి దర్యాప్తు జరిపి, అక్రమ అనుమతులను తక్షణమే సస్పెండ్‌ చేసి రద్దు చేయాలని ఆయన కోరారు.

ప్రజలను మభ్యపెట్టే ప్రకటనలను స్వాధీనం చేసుకుని, నిరపరాధ పెట్టుబడిదారులను కాపాడేందుకు కఠిన న్యాయ చర్యలు తీసుకోవాలని ఫిర్యాదులో డిమాండ్‌ చేశారు. ప్రజాహితాన్ని దృష్టిలో పెట్టుకుని ఈ ఫిర్యాదు చేస్తున్నట్లు, భవిష్యత్తులో ఇలాంటి అక్రమ కార్యకలాపాలు జరగకుండా అడ్డుకోవడమే లక్ష్యమని పేర్కొన్నారు. ఫిర్యాదులో పేర్కొన్న అన్ని అంశాలు తనకు తెలిసిన మేరకు నిజమని ఆయన స్పష్టం చేశారు.ఈ ఫిర్యాదును సైబరాబాద్‌ పోలీస్‌ కమిషనర్‌, తెలంగాణ డీజీపీ, ఈఓడబ్ల్యూ, సీఐడీ, డీటీసీపీ, తెలంగాణ రాష్ట్ర రెరా, రంగారెడ్డి జిల్లా కలెక్టర్‌, షాద్‌నగర్‌ ఆర్డీఓ, తహసీల్దార్‌, హైదరాబాద్‌ మెట్రో రైల్‌ ఎండీ, అడ్వర్టైజింగ్‌ స్టాండర్డ్స్‌ కౌన్సిల్‌ ఆఫ్‌ ఇండియా, జిల్లా వినియోగదారుల వివాదాల పరిష్కార కమిషన్‌, హోం శాఖ, ఏసీబీ తదితర ఉన్నతాధికారులకు పంపించారు.

- Advertisement -
RELATED ARTICLES

Latest News