71వ జాతీయ చలన చిత్ర అవార్డుల ప్రధానోత్సవం మంగళవారం ఢీల్లీలోని విజ్ఞాన్ భవన్‌లో అంగరంగ వైభవంగా జరిగింది. 2023 సంవత్సరానికి గాను కేంద్రప్రభుత్వం ఉత్తమ చిత్రాలు, నటులు, సాంకేతిక నిపుణులను ఎంపిక చేసిన విషయం తెలిసిందే. అవార్డు విజేతలకు భారత రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము పురస్కారాలతో పాటు జ్ఞాపికలు, ప్రశాంసపత్రాలను అందజేశారు. ఇందులో భాగంగా ‘గాంధీ తాత చెట్టు’ చిత్రంలో ఉత్తమ నటనను కనబరిచి ప్రేక్షకుల అభినందనలు, విమర్శకుల ప్రశంసలు సైతం అందుకున్న ప్రముఖ దర్శకుడు సుకుమార్ తనయురాలు సుకృతి వేణి బండ్రెడ్డి ఉత్తమ బాలనటిగా అవార్డును అందుకున్నారు. ఈ సందర్భంగా రాష్ట్రపతి ద్రౌపది ముర్ము గారి ప్రసంగంలో గాంధీ తాత చెట్టు సినిమా గురించి, ఆ చిత్రంలో అందరూ ప్రశంసించ దగ్గ నటనను కనబరిచిన సుకృతి వేణి గురించి ఆమె ప్రత్యేకంగా ప్రశంసించడం.. మాట్లాడటం విశేషంగా చెప్పుకోవాలి.