- 14 గుంటల ‘నాలా’తో 2 ఎకరాల 19 గుంటల్లో వెంచర్?
- సుచిరిండియా, వాసవి గ్రూప్పై రైతుల తీవ్ర ఆరోపణలు
- అడ్డుకుంటే ‘చంపేస్తాం’ అంటూ బెదిరింపులు..
- ఆర్టీఐ సాక్ష్యాలతో వెలుగులోకి వచ్చిన అక్రమాలు
- రికార్డుల్లో రైతుల పేర్లు.. క్షేత్రస్థాయిలో ప్లాట్ల విక్రయం
- సాగునీటి కాలువలు సైతం కబ్జా చేశారని ఆరోపణ
- సమగ్ర విచారణ జరిపి న్యాయం చేయాలని రైతుల డిమాండ్
మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా, శామీర్పేట్ మండలం, తూముకుంట మున్సిపాలిటీ పరిధిలో భారీ భూ కబ్జా జరిగినట్లు తీవ్ర ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. దేవరయాంజాల్ రెవెన్యూ పరిధిలోని సర్వే నంబర్ 360లో, కేవలం 14 గుంటల భూమికి మాత్రమే వ్యవసాయేతర (నాలా) మార్పిడి అనుమతులు పొంది, ఏకంగా 2 ఎకరాల 19 గుంటలు పూర్తి సర్వే నంబర్ను కబ్జా చేశారని పలువురు రైతులు ఆరోపిస్తున్నారు. ఈ అక్రమ వెంచర్ను బడా రియల్ ఎస్టేట్ సంస్థలైన సుచిరిండియా, వాసవి గ్రూప్ సంయుక్తంగా నిర్వహిస్తున్నాయని బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

రైతుల వాదన.. ఆర్టీఐ సాక్ష్యం
బాధిత రైతుల కథనం ప్రకారం… దేవరయాంజాల్ రెవెన్యూ రికార్డుల్లో సర్వే నంబర్ 360లో ఇప్పటికీ ఏడుగురు రైతుల పేర్లు ఉన్నాయని వారు స్పష్టం చేస్తున్నారు. అయితే, ఈ మొత్తం భూమిలో రియల్ ఎస్టేట్ సంస్థలు కేవలం 14 గుంటలకు మాత్రమే ‘నాలా’ కన్వర్షన్ పొందాయని ఆరోపిస్తున్నారు. ఇందుకు సంబంధించిన ధ్రువపత్రాలను సైతం వారు సమాచార హక్కు చట్టం ద్వారా సంపాదించారు. కానీ, క్షేత్రస్థాయిలో మాత్రం సదరు సంస్థలు కేవలం ఆ 14 గుంటలకే పరిమితం కాకుండా, రైతుల పేర్లపై ఉన్న మిగిలిన భూమితో సహా మొత్తం 2 ఎకరాల 19 గుంటల భూమిని చదును చేసి, వెంచర్ గా మార్చి ప్లాట్లను విక్రయిస్తున్నారని రైతులు మండిపడుతున్నారు.

అడ్డుకుంటే ‘చంపేస్తాం’ అని బెదిరింపులు
తమ భూమిని అక్రమంగా కబ్జా చేశారని గుర్తించిన ఓ రైతు ఇటీవల ధైర్యం చేసి, వెంచర్లోని తన భూమిని గుర్తించి, దాన్ని తిరిగి స్వాధీనం (పొజిషన్) చేసుకున్నారు. ఇదే స్ఫూర్తితో మిగిలిన బాధితులు కూడా తమ భూముల్లోకి వెళ్లేందుకు ప్రయత్నించగా, వెంచర్ నిర్వాహకుల నుంచి తీవ్ర ప్రతిఘటన ఎదురవుతోందని వాపోతున్నారు. “మా పొలాల్లోకి మమ్మల్నేవెళ్లనీయకుండా అడ్డుకుంటున్నారు. అక్రమాలను ప్రశ్నిస్తే ‘చంపేస్తాం’ అంటూ బెదిరిస్తున్నారు,” అని పలువురు రైతులు భయాందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ బెదిరింపుల కారణంగా తమ ఆస్తుల వద్దకు వెళ్లాలంటేనే ప్రాణభయంతో ఉన్నామని వారు తెలిపారు.

కాలువలు సైతం కబ్జా
కేవలం రైతుల భూములే కాకుండా, మూడు గ్రామాలకు నీరందించే సాగునీటి కాలువలను సైతం కబ్జా చేసి, యథేచ్ఛగా వెంచర్ను విస్తరించారని రైతులు ఆరోపిస్తున్నారు. ఈ అక్రమాలకు ఇరిగేషన్, మున్సిపల్, హెచ్ఎండీఏ అధికారుల పూర్తి సహకారం ఉందని వారు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.
అధికారులు స్పందించి న్యాయం చేయాలి
చట్టబద్ధంగా కొద్దిపాటి భూమికి అనుమతులు పొంది, రికార్డుల్లో రైతుల పేర్లు ఉన్నప్పటికీ మొత్తం సర్వే నంబర్ను కబ్జా చేయడం దారుణమని బాధితులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ భారీ భూ దందాపై రెవెన్యూ, మున్సిపల్ శాఖల ఉన్నతాధికారులు తక్షణమే స్పందించాలని డిమాండ్ చేస్తున్నారు. సర్వే నంబర్ 360లో జరిగిన అక్రమాలపై సమగ్ర విచారణ జరిపి, నిబంధనలకు విరుద్ధంగా వేసిన లేఅవుట్ అనుమతులను రద్దు చేయాలని కోరుతున్నారు. రికార్డుల ప్రకారం తమ భూములను తమకు అప్పగించి న్యాయం చేయాలని బాధిత రైతులు అధికారులను వేడుకుంటున్నారు. ఈ అక్రమ వెంచర్లో ప్లాట్లు కొనుగోలు చేసిన సామాన్యులు కూడా మోసపోతున్నారని, వారిని కూడా ప్రభుత్వం ఆదుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నారు. కాలువల కబ్జాపై, ఇరిగేషన్ శాఖ అధికారుల నిర్లక్ష్యం తదితర అంశాలపై పూర్తి ఆధారాలతో మరో కథనం ద్వారా వెలుగులోకి తీసుకురానుంది ఆదాబ్ హైదరాబాద్.. మా అక్షరం.. అవినీతిపై అస్త్రం..
