Saturday, March 21, 2026
Homeక్రైమ్ వార్తలుFraud | స్టాఫ్ నర్స్ ఉద్యోగాల పేరిట మోసం..

Fraud | స్టాఫ్ నర్స్ ఉద్యోగాల పేరిట మోసం..

  • 60 మంది నుంచి రూ. 1.85 కోట్లు వసూలు..
  • సూర్యాపేటలో వెలుగు చూసిన ఘటన..

ప్రభుత్వ ఆసుపత్రుల్లో స్టాఫ్ నర్సులుగా ఉద్యోగాలు ఇప్పిస్తానంటూ 60 మంది నిరుద్యోగుల నుంచి రూ.1.85 కోట్లు వసూలు చేసిన కేటుగాడిని శుక్రవారం సూర్యాపేటలో అరెస్టు చేశారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. సూర్యాపేట జిల్లా మద్దిరాల మండలం రెడ్డిగూడెం గ్రామానికి చెందిన దుగ్యాల రఘురాం తనకు హైదరాబాద్ డీఎంఈ (డిపార్ట్మెంట్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్)లోని అధికారులతోపాటు పెద్ద పెద్ద రాజకీయ నాయకులు తెలుసని బాధితులను పరిచయం చేసుకున్నాడు.

ప్రస్తుతం తుంగతుర్తిలో స్టాఫ్ నర్సుగా పనిచేస్తున్న నాగమణి అనే బాధితురాలు హైదరాబాద్ నుంచి సూర్యాపేటకు బదిలీ కోసం మూడేళ్ల క్రితం నిందితుడు రఘురాంను ఆశ్రయించారు. అదే సమయంలో 2024 జూన్లో నర్సింగ్ ఆఫీసర్ (స్టాఫ్ నర్సు) ఉద్యోగాలను భర్తీ చేసేందుకు ప్రభుత్వం నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ క్రమంలో నాగమణి గతంలో పనిచేసిన నర్సింగ్ కళాశాలకు చెందిన కొందరిని రఘురాంకు పరిచయం చేశారు.

- Advertisement -

హైదరాబాద్ డీఎంఈలో ఉద్యోగం చేస్తున్న వాణి అనే మహిళతో కలిసి స్టాఫ్ నర్సు ఉద్యోగాలు ఇప్పిస్తానంటూ నమ్మించిన రఘురాం.. నకిలీ నియామక పత్రాలను చూపి ఒక్కొక్కరి వద్ద రూ.3 లక్షల నుంచి రూ.5 లక్షలు వసూలు చేశాడు. అయితే, ఇటీవల వచ్చిన ఫలితాల్లో ఉద్యోగాలు రాకపోవడంతో బాధితులు రఘురాంను డబ్బులు తిరిగి ఇవ్వాలని డిమాండ్ చేసినా ఫలితం లేకుండా పోయింది.

నాగమణితోపాటు పలువురు బాధితులు సూర్యాపేట పట్టణ పోలీసులను ఆశ్రయించారు. నిందితులు రఘురాం, వాణిలపై కేసు నమోదు చేసిన సూర్యాపేట పట్టణ ఎస్సై మహేంద్రనాథ్.. శుక్రవారం రఘురాంను అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు.

- Advertisement -
RELATED ARTICLES

Latest News