- నామాలగుండు శ్రీ వీరాంజనేయ స్వామి దేవస్థానంలో కార్యక్రమం..
- నూతన చైర్మన్‌గా ప్రమాణం చేసిన కాచం రాము
- దేవాదాయ శాఖ ఆధ్వర్యంలో వేడుకగా ప్రమాణస్వీకారోత్సవ కార్యక్రమం
సికింద్రాబాద్ పరిధిలో అతిపెద్ద హనుమాన్ దేవాలయంగా గుర్తింపు పొందిన నామాలగుండు శ్రీ వీరాంజనేయ స్వామి దేవస్థానంలో నూతన చైర్మన్ మరియు ధర్మకర్తల మండలి ప్రమాణ స్వీకార మహోత్సవం సోమవారం ఆలయ ప్రాంగణంలో ఘనంగా నిర్వహించారు.భక్తుల నడుమ ఆధ్యాత్మిక వాతావరణంలో ఈ కార్యక్రమం అత్యంత వైభవంగా జరిగింది.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా సికింద్రాబాద్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ ఆదం సంతోష్ కుమార్ హాజరై నూతన కమిటీ సభ్యులకు శుభాకాంక్షలు తెలియజేశారు.
ఆలయ అభివృద్ధికి సమన్వయంతో కృషి చేయాలని,భక్తులకు మరింత మెరుగైన సౌకర్యాలు కల్పించాలని సూచించారు.దేవాదాయ శాఖ ఇన్స్పెక్టర్ శ్రీమతి ఆండాలు,ఈవో శ్రీనివాస్ ఆధ్వర్యంలో నూతన చైర్మన్‌గా కాచం రామును ధర్మకర్తల మండలి ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.అనంతరం ఆయన ప్రమాణ స్వీకారం చేసి బాధ్యతలు స్వీకరించారు.
ఈ సందర్భంగా కాచం రాము మాట్లాడుతూ,ఆలయాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి పరచడంతో పాటు భక్తులకు తగిన సౌకర్యాలు,పారిశుద్ధ్యం,భద్రత కల్పించేందుకు కట్టుబడి పనిచేస్తానని హామీ ఇచ్చారు.ధర్మకర్తల మండలి సభ్యులుగా కైలాస్ అరుణ్ కుమార్,మున్నూరు చందు,బి.నరేష్,కె.సాయి కుమార్,అర్.ప్రతాప్,పి.పవన్ కుమార్,షామాల్ రమణి ప్రమాణ స్వీకారం చేశారు.ఆలయాన్ని మరింత అభివృద్ధి దిశగా తీసుకెళ్లడం,భక్తులకు సౌకర్యవంతమైన వాతావరణం కల్పించడం తమ ముఖ్య లక్ష్యమని వారు పేర్కొన్నారు.
ఇటీవలి కాలంలో ఆలయ నిర్వహణపై భక్తుల్లో నెలకొన్న ఆశలు, ఆందోళనల నేపథ్యంలో తిరిగి కాచం రాము చైర్మన్‌గా బాధ్యతలు స్వీకరించడంతో భక్తులు,ముఖ్యంగా మహిళలు మరియు వృద్ధులు హర్షం వ్యక్తం చేశారు.నిత్యం ఆలయానికి వచ్చే భక్తులతో మమేకమై,వారి అవసరాలను తెలుసుకుని స్పందించే నాయకత్వం కొనసాగుతుందనే విశ్వాసాన్ని వారు వ్యక్తం చేశారు.
కార్యక్రమానికి స్థానిక పెద్దలు, మహిళలు,యువకులు,భక్తులు పెద్ద సంఖ్యలో హాజరై నూతన కమిటీకి శుభాకాంక్షలు తెలిపారు.కార్యక్రమం అనంతరం ప్రత్యేక పూజలు నిర్వహించి భక్తులకు తీర్థప్రసాదాలు పంపిణీ చేశారు.ఆలయ ప్రాంగణం అంతా భక్తుల జైజయధ్వానాలతో ఆలయ ప్రాంగణం మారు మోగింది.
