Thursday, September 11, 2025
ePaper
spot_img
Homeతెలంగాణఫెర్టిలిటీ అవగాహనపై ప్రత్యేక కార్యక్రమం

ఫెర్టిలిటీ అవగాహనపై ప్రత్యేక కార్యక్రమం

తల్లితనం, కుటుంబ నిర్మాణంపై సమాజ చైతన్యం లక్ష్యం

ప్రపంచ ఐవీఎప్ దినోత్సవాన్ని పురస్కరించుకుని హన్మకొండ గవర్నమెంట్ మేటర్నిటీ హాస్పిటల్ సహకారంతో, “I Value Family for India’s Vibrant Future” థీమ్‌పై నిర్వహించిన ప్రత్యేక ఫెర్టిలిటీ అవగాహన కార్యక్రమం వైద్యవర్గం, యువత, మహిళా సంఘాలు, సమాజ ప్రతినిధుల సమక్షంలో విజయవంతంగా ముగిసింది.

ఈ కార్యక్రమంలో రీజినల్ మెడికల్ హెడ్ డాక్టర్ జలగం కావ్యరావు, డాక్టర్ సంధ్యారాణి, డ‌బ్ల్యూఓజీఎస్ ప్రెసిడెంట్ డాక్టర్ శ్రీలక్ష్మి, డ‌బ్ల్యూఓజీఎస్ జనరల్ సెక్రటరీ డాక్టర్ కూరపాటి రాధిక, ఆర్ఎంఓ డాక్టర్ అంబరీష్ తదితరలు పాల్గొని కార్యక్రమాన్ని ప్రారంభించారు. జయ నర్సింగ్ కాలేజ్ విద్యార్థులు కార్యక్రమానికి సహకరించడంతోపాటు, స్పాట్ అవగాహన డెమోస్, ఇన్ఫోగ్రాఫిక్ ప్రదర్శనలు, ఇంటరాక్టివ్ చర్చలు నిర్వహించబడ్డాయి.

భారతదేశంలో క్రమంగా జననాల రేటు తగ్గడం, దీర్ఘకాలంలో సమాజానికి సవాలుగా మారుతుందని వైద్య నిపుణులు హెచ్చరించారు. సమాజంలో యువత, మహిళలకు ఫెర్టిలిటీ ఆరోగ్యం, సమయానుకూల వైద్య సలహా మీద అవగాహన పెరగడం అత్యంత అవసరమని స్పష్టంచేశారు. మహిళలు తల్లితనం విషయంలో త్వరగా నిర్ణయాలు తీసుకునేలా, భయాలు, అపోహలు తొలగించే ప్రయత్నంగా ఈ కార్యక్రమాన్ని రూపొందించారు.

ఈ సంద‌ర్భంగా డాక్టర్ జలగం కావ్యరావు మాట్లాడుతూ.. “ఫెర్టిలిటీ అనేది కేవలం వైద్య అంశం కాదు.. ఇది కుటుంబాల భవిష్యత్తుకు సంబంధించినది. మహిళలు, యువత ఫెర్టిలిటీ ఆరోగ్యంపై మాట్లాడేందుకు, సమయానుకూల సలహా పొందేందుకు ఈ వేదిక ఉపయోగపడింద‌ని తెలిపారు. డాక్టర్ దుర్గ జి రావు మాట్లాడుతూ.. “ప్రతి కుటుంబం ఆరోగ్యంగా ఉండడం సమాజ అభివృద్ధికి పునాది. సమయానికి సరైన సమాచారాన్ని పొందడం ద్వారా తల్లితనం దిశగా మహిళలు ధైర్యంగా ముందుకు సాగాల‌న్నారు.

ఐవీఎప్ పై చర్చలు.. అపోహల నివృత్తి
ఐవీఎఫ్‌, ఐయుఐ వంటి ఆధునిక చికిత్సలపై ఉన్న అపోహలను తొలగిస్తూ, ఈ చికిత్సల సాంకేతికత, విజయ శాతం, తల్లితనం కలగడానికి సమయపాలన అవసరమని వైద్యులు వివరించారు. కొన్ని సందర్భాల్లో వయసు పెరుగుదల, జీవనశైలి సమస్యలు, వైద్య సమస్యలు ఫెర్టిలిటీని ప్రభావితం చేస్తాయని వివరించగా, సమయానుకూల వైద్య సలహా తీసుకోవడం ద్వారా పరిష్కారాలు సాధ్యమని వివరించారు.

కాగా, ఈ కార్యక్రమంలో భాగంగా మొక్క‌లు నాటారు. ఇది పర్యావరణ పరిరక్షణకు తోడ్పడడమే కాక, కుటుంబ నిర్మాణం.. పర్యావరణ సంరక్షణ రెండూ భవిష్యత్ తరాల కోసం అవసరం అనే సంకేతాన్ని సమాజానికి అందిస్తుంద‌ని తెలిపారు.

ఈ కార్యక్రమం పూర్తిగా సామాజిక ప్రయోజనాల కోసం నిర్వహించబడిందని నిర్వాహకులు తెలిపారు. భవిష్యత్‌లో రాష్ట్రవ్యాప్తంగా గ్రామస్థాయిలో, పట్టణాల్లో ఇలాంటి ఫెర్టిలిటీ అవగాహన కార్యక్రమాలను కొనసాగించడానికి ప్రత్యేక ప్రణాళిక సిద్ధం చేయనున్నట్లు వెల్ల‌డించారు.

RELATED ARTICLES
- Advertisment -

Latest News