జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి
కరీంనగర్, నవంబర్ 15 (ఆదాబ్ హైదరాబాద్): కుక్క(Dog), కోతి (Monkey) కరిచినవారికి చికిత్స పట్ల ప్రత్యేక పర్యవేక్షణ అవసరమని కలెక్టర్ పమేలా సత్పతి (Pamela Satpathy) అన్నారు. హౌజింగ్ బోర్డ్ కాలనీలోని అర్బన్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని (UPHC) ఆమె శనివారం సందర్శించారు. చికిత్స (Treatment) కోసం వచ్చిన పలువురు వృద్ధులతో మాట్లాడి వైద్య సేవల (Medical Services) గురించి అడిగి తెలుసుకున్నారు. బీపీ(BP), షుగర్ (Sugar) వంటి వ్యాధులకు కావాల్సిన మందులను ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో ఉచితంగా ఇస్తారని వారికి చెప్పారు.
వృద్ధురాలికి అవసరమైన మాత్రలను స్వయంగా అందజేశారు. 40 ఏళ్లు దాటిన మహిళలకు విటమిన్, ఐరన్, క్యాల్షియం మాత్రలను పంపిణీ చేయాలని ఆరోగ్య సిబ్బందికి సూచించారు. కుక్క, కోతి కరిచినవారిపై ప్రత్యేక శ్రద్ధ పెట్టాలని, క్రమంతప్పకుండా చికిత్స అందిస్తూ కోర్సు పూర్తయ్యే దాక నిరంతరం పర్యవేక్షణ ఉంచాలని ఆదేశించారు. చిన్నారుల నెలవారీ టీకాలు, గర్భిణీల 4 ఆరోగ్య పరీక్షలు 100 శాతం పూర్తిచేయాలని అన్నారు. ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో మహిళలకు వైద్య పరీక్షలు, ఇతర వైద్య సేవలను సూచించే బోర్డులను ఏర్పాటుచేయాలని తెలిపారు.
