తెలంగాణ రాష్ట్రాన్ని 2034 నాటికి ఒక ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా తీర్చిదిద్దటంలో తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ (Telangana Rising Global Summit) కీలక భూమిక పోషిస్తుందని కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ నాయకురాలు (Congress Parliamentary Party leader), రాజ్యసభ ఎంపీ (Rajya Sabha MP) సోనియా గాంధీ ఆశాభావం వ్యక్తం చేశారు.
ఈ నెల 8, 9 తేదీల్లో నిర్వహించనున్న ఈ సదస్సు విజయవంతం కావాలని ఆకాంక్షించారు. అంతర్జాతీయ స్థాయి సదస్సు నిర్వహిస్తున్నందుకు సీఎం రేవంత్ రెడ్డి(CM Revanth Reddy)కి అభినందనలు తెలిపారు. తెలంగాణ అభివృద్ధి (Telangana Development) కోసం పలు కీలక ప్రాజెక్టులు, ప్రణాళికల్లో భాగస్వాములు కావాలసినవారికి ఈ సదస్సు ఒక వేదికగా దోహదపడుతుందని సీఎం రేవంత్ రెడ్డికి పంపిన సందేశంలో పేర్కొన్నారు.
అర్బన్, సెమీ అర్బన్, గ్రామీణ, వ్యవసాయాభివృద్ధి ప్రాజెక్టులకు సమ ప్రాధాన్యం ఇస్తూ మూడంచెల వ్యూహంతో తెలంగాణ ముందుకు సాగుతోందని ఆ లేఖలో ప్రస్తావించారు. తెలంగాణలోని మానవ వనరులు, సహజ వనరులు, ప్రజల వ్యాపార నైపుణ్యం, అంతర్జాతీయ ప్రతిభ, సాంకేతిక నైపుణ్యాల అభివృద్ధికి సదస్సు మరింత తోడ్పడుతుందని అన్నారు. సదస్సులో పాల్గొంటున్నవారందరికీ సోనియాగాంధీ అభినందనలు తెలిపారు.
