సిర్పూర్లో అత్యంత కనిష్టంగా 7.1 డిగ్రీలు.. 8.5 డిగ్రీల వరకు పడిపోయే అవకాశం ఉందని హెచ్చరికలు.. అప్రమత్తంగా ఉండాలని వైద్యుల హెచ్చరిక
రాష్ట్రంలో చలి తీవ్రత రోజురోజుకు పెరిగిపోతున్నది. రాత్రి వేళల్లో ఉష్ణోగ్రతలు పడిపోతుండటంతో చలిలో ప్రజలు వణికిపోతున్నారు. ఏజెన్సీ గ్రామాల్లో సింగిల్ డిజిట్కు ఉష్ణోగ్రతలు పడిపోయాయి. గురువారం ఉదయం ఆసిఫాబాద్ జిల్లా సిర్పూర్ రాష్ట్రంలోనే అత్యంత కనిష్ఠంగా 7.1 డిగ్రీలుగా నమోదయింది. ఇక తిర్యాణిలో 8.2 డిగ్రీలు నమోదయింది. దీంతో ప్రజలు ఇండ్ల నుంచి బయటకు రావాలంటేనే భయపడుతున్నారు. ఉదయం 8 గంటలు దాటినప్పటికీ చలి తీవ్రత తగ్గకపోవడంతో స్కూళ్లు, కార్యాలయాలు, రోజువారీ పనుల నిమిత్తం బయటకు వెళ్లేవారు ఇబ్బంది పడుతున్నారు. ఇక హైదరాబాద్ లో అతితక్కువగా హెచ్సీయూలో 11.8 డిగ్రీలు రికార్డయింది.
రాజేంద్రనగర్ లో 12.9, మారేడుపల్లిలో 13.6 డిగ్రీల రికార్డయింది. ఉదయం 6 గంటల సమయంలో నగర శివార్లలోని ఇబ్రహీంపట్నలో 11.5 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. కాగా, మరో నాలుగు ఐదు రోజుల్లో చలి తీవ్రత మరింత పరిగే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. రాష్ట్రంలో ఎన్నడూ లేనట్టుగా చలి తీవ్రత బాగా పెరిగింది. ఒక్కసారిగా కనిష్ట ఉష్ణోగ్రతలు పడిపోయాయి. మరికొన్ని రోజులూ ఇదే పరిస్థితి ఉంటుందని, చలి మరింత పెరుగుతుందని వాతావరణ శాఖ హెచ్చరించింది. తెలంగాణ రాష్ట్రం తీవ్ర చలి ప్రభావిత జోన్లో ఉందని ఈసారి కూడా అదే పరిస్థితి ఉంటుందని వాతావరణ నిపుణులు తెలిపారు. కనిష్ట ఉష్ణోగ్రతలు 8.5 డిగ్రీల వరకు పడిపోయే అవకాశం ఉందని హెచ్చరించారు.
ఇక చలి వాతావరణంలో జాగ్రత్తగా ఉండాలని, లేకుంటే ఆరోగ్య సమస్యలు తలెత్తుతాయని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. మూడు, నాలుగు రోజులుగా శ్వాసకోశ సమస్యలు, జలుబు, దగ్గు, జ్వరాలతో ఆస్పత్రులకు వస్తున్న రోగుల సంఖ్య పెరుగుతోందని చెబుతున్నారు. రాష్ట్రంలో మరో మూడు నాలుగు రోజుల పాటు చలి తీవ్రత మరింతగా పెరుగుతుందని వాతావరణ కేంద్రం ప్రకటించింది. రాత్రిపూట కనిష్ట ఉష్ణోగ్రతలు 8.5 డిగ్రీల నుంచి 12.5 డిగ్రీల మధ్య నమోదవుతాయని పేర్కొంది. చలి తీవ్రతకు సంబంధించి మంచిర్యాల, జయశంకర్ భూపాలపల్లి, ఆదిలాబాద్, ఆసిఫాబాద్ జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. ఈ జిల్లాల్లో కనిష్ట ఉష్ణోగ్రతలు 10 డిగ్రీల లోపునకు పడిపోవచ్చని హెచ్చరించింది. మిగతా అన్ని జిల్లాల్లో 10-12.5 డిగ్రీల మధ్య కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతాయంటూ ఎల్లో అలర్ట్ జారీ చేసింది. కాగా, చలి తీవ్రతతో ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ఏజెన్సీ గ్రామాలు వణికిపోతున్నాయి. ఉదయం 9 గంటల వరకు కూడా పొగ మంచు కమ్ముకుంటోంది.
రాష్ట్రంలో చలి తీవ్రత పెరిగే అవకాశం ఉండటంతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వైద్యారోగ్యశాఖ హెచ్చరించింది. రెస్పిరేటరీ ఇన్ఫెక్షన్లు, సీజనల్ ఫ్లూ పెరిగే అవకాశం ఉండటంతో అలర్ట్ ఉండాలని సూచించారు. జ్వరం, దగ్గు, గొంతు తడి ఆరిపోవడం, నొప్పులు ఉంటే నిర్లక్ష్యం చేయవద్దని తెలిపారు. గర్భిణులు, ఐదేండ్లలోపు చిన్నారులు, వృద్ధుల్లో సీజనల్ ఫ్లూ లక్షణాలు ఉంటే వెంటనే సమీపంలోని దవాఖానలను సందర్శించాలని కోరారు. అధిక జ్వరం, శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు ఉంటే తక్షణమే దగ్గరలోని ప్రభుత్వాసుపత్రిలో చికిత్స పొందాలని సూచించారు.
