- ఆ పోస్టింగ్ అంటేనే ఐఏఎస్ అధికారుల్లో వణుకు ..?
- మరోసారి లీవ్ పొడిగించుకున్న కలెక్టర్ హరిత..
- సిరిసిల్ల అంటే గుర్తుకొచ్చేది కాంట్రవర్సీ కలెక్టర్ ఝా
- కేటీఆర్ నియోజకవర్గం కావడమే తలనొప్పిగా మారిందా?
- ఇద్దరి నేతల పొలిటికల్ వార్ అధికారులకు తలనొప్పిగా మారిందా ?
- ఇన్‌చార్జ్ కలెక్టర్‌తో కొనసాగుతున్న సిరిసిల్ల జిల్లా పాలన
- సిరిసిల్ల పాలనపై పెరుగుతున్న ప్రశ్నలు..తీర్చలేని సందేహాలు..
రాజన్న సిరిసిల్ల జిల్లా కలెక్టర్ పోస్టింగ్ ఇప్పుడు ఐఏఎస్ అధికారులకు సవాలుగా మారిందనే టాక్ నడుస్తుంది..? రాజకీయ ఒత్తిళ్లు, వివాదాలు, కోర్టు నోటీసులు, నేతల మధ్య సమతూకం… ఇవన్నీ కలిసి సిరిసిల్లలో విధులు నిర్వర్తించాలంటే అధికారులు వెనుకడుగు వేస్తున్నారన్న చర్చ మళ్లీ తెరపైకి వచ్చింది. తాజాగా జిల్లా కలెక్టర్ హరిత మరోసారి లీవ్ పొడిగించుకోవడంతో ఈ అంశం రాజకీయ, అధికార వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది.
మరోసారి లీవ్ పొడిగించుకున్న కలెక్టర్ హరిత?
ప్రస్తుతం లీవ్‌లో ఉన్న రాజన్న సిరిసిల్ల జిల్లా కలెక్టర్ హరిత ఈ నెల 24న విధుల్లో చేరాల్సి ఉంది. అయితే మరోసారి సెలవు పొడిగింపుకు దరఖాస్తు చేయడంతో ఆమెకు మరో 20 రోజుల ఎక్స్‌టెన్షన్ మంజూరైంది. దీంతో జిల్లాలో మరోసారి రెగ్యులర్ కలెక్టర్ లేకుండానే పాలన కొనసాగుతోంది.ప్రస్తుతం అదనపు కలెక్టర్ గరీమా అగర్వాల్ ఇన్‌చార్జ్ కలెక్టర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు.
కేటీఆర్ నియోజకవర్గమే తలనొప్పిగా మారిందా?
రాజన్న సిరిసిల్ల జిల్లా రాజకీయంగా అత్యంత సున్నితమైన ప్రాంతంగా మారింది.సిరిసిల్ల ఎమ్మెల్యేగా మాజీ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఉండగా, కాంగ్రెస్ తరఫున కేకే మహేందర్‌రెడ్డి ఇంచార్జ్‌గా వ్యవహరిస్తున్నారు. మరోవైపు వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ ప్రభుత్వ విప్‌గా కొనసాగుతున్నారు.ఈ ముగ్గురు కీలక నేతల మధ్య సమతూకం పాటించడం కలెక్టర్‌కు పెద్ద సవాలుగా మారిందన్న అభిప్రాయం అధికార వర్గాల్లో వినిపిస్తోంది.
రాజకీయాల మధ్య నలిగిపోయిన అధికారి?
సిరిసిల్ల కలెక్టర్ అనగానే ముందుగా గుర్తొచ్చే పేరు సందీప్ కుమార్ ఝా.ఆయన పనిచేసిన కాలమంతా జిల్లా.. ఏదో ఒక వివాదంతో వార్తల్లో నిలిచింది. చివరికి ఆయన ట్రాన్స్‌ఫర్ అయ్యారు.ఆ వివాదాల వెనుక స్థానిక రాజకీయాలే ప్రధాన కారణమని అప్పట్లో అధికార వర్గాలు పేర్కొన్నాయి.మొదట కేకే మహేందర్‌రెడ్డి సూచనల ప్రకారం పనిచేశారన్న ఆరోపణలతో ఆయన బీఆర్ఎస్ టార్గెట్ అయ్యారన్న ప్రచారం సాగింది. అనంతరం కేటీఆర్ ఫోటో ఉన్న టీ స్టాల్ తొలగింపు వ్యవహారం తీవ్ర రాజకీయ దుమారం రేపింది.ఆ సమయంలో కేటీఆర్ స్పందిస్తూ..ఆయన కలెక్టర్ కాదు… కాంగ్రెస్ కార్యకర్త. కాంగ్రెస్ కండువా వేసుకుని కూర్చోండని ఘాటు వ్యాఖ్యలు చేశారు.చివరికి ఎవరి ఒత్తిడికీ లోనుకాకుండా పనిచేశారనే కారణంతోనే సందీప్ కుమార్ను సిరిసిల్ల నుంచి ట్రాన్స్‌ఫర్ చేశారన్న వాదనలు అప్పట్లో వినిపించాయి.
ఐఏఎస్ అధికారుల్లో పెరుగుతున్న భయం?
గత అనుభవాల నేపథ్యంలోనే ఇప్పుడు సిరిసిల్ల కలెక్టర్ పోస్టింగ్ అంటే ఐఏఎస్ అధికారుల్లో భయం నెలకొందన్న టాక్ బలంగా వినిపిస్తోంది.అధికార పార్టీ నేతలు, ప్రధాన ప్రతిపక్ష నేత మధ్య సమన్వయం కష్టమవుతుందని, అదనంగా కోర్టు కేసులు, భూ పరిహార వివాదాలు తలనొప్పిగా మారతాయన్న అభిప్రాయం అధికారుల్లో వ్యక్తమవుతోంది.
వెళ్లిన నెల రోజులకే లీవ్‌లోకి వెళ్లిన హరిత
సిరిసిల్ల జిల్లా తొలి మహిళా కలెక్టర్‌గా హరిత సెప్టెంబర్ 29న బాధ్యతలు స్వీకరించారు. అయితే అక్టోబర్ 22న దీర్ఘకాలిక లీవ్‌లోకి వెళ్లారు.పేరుకు చైల్డ్ కేర్ లీవ్‌గా పేర్కొన్నప్పటికీ, అసలు కారణం వేరే ఉందన్న చర్చ అధికార వర్గాల్లో నడుస్తోంది. బాధ్యతలు చేపట్టిన నెల రోజుల్లోనే లీవ్‌లోకి వెళ్లడం అనేక అనుమానాలకు తావిస్తోంది.
సిరిసిల్ల పాలనపై పెరుగుతున్న ప్రశ్నలు
మొత్తానికి రాజకీయ ఒత్తిళ్లు .. అధికార వ్యవస్థ మధ్య సమతూకం కోల్పోతే జిల్లా పాలన ఎలా ప్రభావితమవుతుందన్న ప్రశ్నలు సిరిసిల్ల విషయంలో మరోసారి తెరపైకి వచ్చాయి.కలెక్టర్ పోస్టింగ్‌కే ఐఏఎస్ అధికారులు జంకే పరిస్థితి ఏర్పడటం రాష్ట్ర పాలనా వ్యవస్థకు శుభసూచకం కాదన్న అభిప్రాయం ఇప్పుడు బలంగా వ్యక్తమవుతోంది.
