- గాయత్రీదేవిగా దర్శనమిచ్చిన కనకదుర్గమ్మ
- భారీగా తరలివచ్చి అమ్మవారిని దర్శించుకున్న భక్తులు
శరన్నవరాత్రి మహోత్సవాల్లో రెండో రోజున విజయవాడలో ఇంద్రకీలాద్రిపై వెలసిన కనకదుర్గమ్మ వారు గాయత్రీ దేవిగా దర్శనమిచ్చారు. సమస్త దేవతా మంత్రాలకు గాయత్రీ మంత్రంలో అనుబంధం ఉంది. అందుకే ఆయా దేవతల మూల మంత్రాలతో గాయత్రిని చేర్చి ’రుద్రగాయత్రి’, ’లక్ష్మీగాయత్రి’, ’విష్ణుగాయత్రి’ అని గాయత్రీ మంత్రంతో సంప్రోక్షణ చేసిన తర్వాతే ఆయా దేవతలకు నివేదన చేస్తారు. సకల మంత్రాలకి మూలమైన శక్తిగా, వేదమాతగా ప్రసిద్ధి పొందిన గాయత్రీదేవి ముక్తా, విద్రుమ, హేమ, నీల, ధవళ వర్ణాలతో ప్రకాశిస్తూ, పంచముఖాలతో దర్శనమిచ్చే సంధ్యావందన అధిష్టానదేవత. ఆ తల్లి అధిష్టాన దేవత సూర్యభగవానుడు. కాబట్టి గాయత్రీ అమ్మవారిని దర్శించుకోవడం వల్ల సూర్యుడు అనుగ్రహంతో ఆరోగ్యం లభిస్తుందని నమ్మిక. ప్రాతఃకాలంలో గాయత్రి గాను, మధ్యాహ్న కాలంలో సావిత్రి గాను, సాయంసంధ్యలో సరస్వతి గాను ఆమె భక్తుల పూజలు అందుకుంటుంది. గాయత్రీ ఉపాసనతో బుద్ధి తేజోవంతం అవుతుందనీ, గాయత్రీ మంత్ర జపం చతుర్వేద పారాయణ ఫలితాన్ని ఇస్తుందనీ పురాణాలు చెబుతున్నాయి. వరదాభయహస్తాలతో సకల వేద స్వరూపమైన గాయత్రీదేవిని ఆదిశంకరులు అనంతశక్తి స్వరూపంగా అర్చించారు. గాయత్రీ మంత్రాన్ని జపిస్తూ దుర్గమ్మను ధ్యానిస్తే సకల మంత్ర సిద్ధి, బ్రహ్మజ్ఞానం కలుగుతాయని, పూజించిన వారికి సద్భుద్ధులు కలుగుతాయని,. పాపాలు నశిస్తాయని, అజ్ఞానం తొలగిపోతుందని పురాణాలు చెబుతున్నాయి. ఈ క్రమంలో మంగళవారం రోజున ఇంద్రకీలాద్రిపై కొలువైన కనక దుర్గమ్మ శ్రీ గాయత్రీ దేవి అలంకారంలో భక్తులకు దర్శనం ఇస్తోంది.
దేవీ నవరాత్రులలో రెండవ రోజు ఆశ్వయుజ శుక్ల తదియ నాడు కదంబవనవాసిని అయిన ఆ పరమేశ్వరి శ్రీ గాయత్రీ దేవి అలంకారంలో భక్తులతో పూజలను అందుకుంటుంది. విజయవాడ ఇంద్రకీలాద్రిపై కొలువైన అమ్మలగన్న అమ్మ ముగ్గురమ్మల మూలపుటమ్మ కనక దుర్గమ్మ నవరాత్రులలో రెండో రోజున చతుర్వేద స్వరూపమైన శ్రీ గాయత్రీ దేవి అలంకారంలో కాషాయం రంగు లేదా కనకాంబరం చీర ధరించి అత్యంత సుందరంగా భక్తులకు దర్శనం ఇస్తుంది. ఇంద్రకీలాద్రిపై గాయత్రి దేవిగా దర్శనం ఇస్తున్న దుర్గమ్మ దర్శించుకునేందుకు భక్తులు బారులు తీరారు. తెల్లవారు జామున 3 గంటల నుంచే దర్శనాలు ప్రారంభం అయ్యాయి. కాగా దసరా నవరాత్రులలో మొదటి రోజు భక్తజనం విశేషం గా తరలివచ్చారు. 60 వేల మందికి పైగా భక్తులు బాల త్రిపురసుందరి దేవి అలంకారంలో ఉన్న అమ్మవారిని దర్శించుకున్నారు. తొలిరోజు పలు రకాల సేవల, దర్శన టికెట్ల రూపేణా రూ. 22 లక్షల 72 వేల 214 రూపాయల ఆదాయం లభించినట్లు ఆలయ సిబ్బంది చెప్పారు.
