ఆ సంస్థ ఇండియా సీఈఓ దీపక్ శర్మతో సీఎం రేవంత్ టీమ్ చర్చలు
ప్రఖ్యాత ష్నైడర్ ఎలక్ట్రిక్ ఇండియా(Schneider Electric IN) సంస్థ తెలంగాణలో తన కార్యకలాపాలను మరింతగా విస్తరించనుంది. దావోస్ ప్రపంచ ఆర్థిక వేదిక సదస్సు 2026(WEF2026)లో సీఎం రేవంత్ రెడ్డి నాయకత్వంలోని ‘తెలంగాణ రైజింగ్’ ప్రతినిధి బృందం, ష్నైడర్ ఎలక్ట్రిక్ ఇండియా సీఈఓ దీపక్ శర్మతో నిర్వహించిన చర్చల అనంతరం.. సంస్థ రూ.623 కోట్లతో విస్తరణ కార్యక్రమాలను ప్రకటించింది.
❇️ విద్యుత్ రంగంలో గణనీయ మార్పులు, ఇంధన మార్పిడి(ఎనర్జీ ట్రాన్సిషన్), విద్యుత్ నిల్వ ప్రాజెక్టులు, గ్రిడ్ ఆధునికీకరణ, విద్యుత్ సామర్థ్యం పెంపు, ఇండస్ట్రియల్ పార్కులు, పట్టణ మౌలిక వసతుల కోసం డిజిటల్ విద్యుత్ నిర్వహణ వంటి అంశాలపై సమావేశంలో చర్చించారు.
❇️ ష్నైడర్ ఎలక్ట్రిక్ ఇండియా, ప్రస్తుత గాగిల్లాపూర్, శంషాబాద్‌లోని యూనిట్ల విస్తరణ కోసం రూ. 623 కోట్లను పెట్టుబడిగా పెట్టనుంది. దీని ద్వారా ఎయిర్ సర్క్యూట్ బ్రేకర్లు(ACB), మోల్డెడ్ కేస్ సర్క్యూట్ బ్రేకర్లు(MCCB), కాంటాక్టర్లు, పుష్ బటన్లు వంటి ముఖ్యమైన ఎలక్ట్రికల్ భద్రతా ఉత్పత్తుల తయారీ సామర్థ్యం పెరగనుంది.
❇️ తెలంగాణ రాష్ట్రానికి పెట్టుబడులను ఆకర్షించడంలో పరిశ్రమలు, ఐటీ శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు కృషిని ఈ సందర్భంగా సీఎం అభినందించారు. 2047 నాటికి నెట్-జీరో అభివృద్ధి లక్ష్యాల సాధనలో సుస్థిరత(సస్టైనబిలిటీ) కీలక పాత్ర పోషిస్తుందని అన్నారు.
❇️ దీపక్ శర్మ మాట్లాడుతూ.. ష్నైడర్ ఎలక్ట్రిక్ తెలంగాణలో నైపుణ్యాభివృద్ధి కోసం 38 కేంద్రాలను నిర్వహిస్తోందని, ప్రత్యేకించి ఇంధన నిర్వహణ, పారిశ్రామిక ఆటోమేషన్, డిజిటల్ ట్రాన్స్‌ఫర్మేషన్ తదితర రంగాల్లో అందిస్తున్న సేవలను వివరించారు.
