ఏలినవారు.. ఓడిన వారిని ఆరాధించిన ఘనమైన చరిత్ర
“చరిత్ర”లోనే …చారిత్రక నేపథ్యం!
ఇవాళ అడవి మల్లంపల్లిలో “అడవి” అంతరించవచ్చు!.
“జంగిల్”పల్లి ఉత్తి నామవాచకమే కావచ్చు!.
చిలుకల గుట్టమీద ఒక్క “చిలుకా” లేకపోవచ్చు!.
వేలం వెర్రి తిరణాలలో “కోయ”తనమే బలి కావచ్చు!.
“దురాక్రమణ”కు ఇదొక సాంస్కృతిక రహదారి కావచ్చు!.
“జంపన్న”వాగు లో “సంపెంగ”లు మొలవచ్చు కాక!….
అదే సంపెంగ వాగుపై “జన వనం” వన్ వే ట్రాఫిక్కే ఇకపై కొనసాగవచ్చు కాక!.
“సమ్మక్క- సారక్క”ల “బలి”దానాలు చరిత్రలో మారుపేర్లతో కొనసాగుతూనే ఉండవచ్చు కాక! .
అయినప్పటికీ……ఇది ముమ్మాటికీ.. (అ)పరాజితులు రాసుకున్న కనీ వినీ ఎరుగని వీరచరిత్ర సమ్మక్క-సారక్క ది. ఓడిపోయి కూడా “ఏలిన”వారి మనస్సు ను గెలిచిన జనగాధ సమ్మక్క చరిత ది.

వేదం దూరని కారడవికి కాపలా సమ్మక్క!..సారక్క!!
అడవి మీద మైదానం ఆధిపత్యాన్ని, ఆదివాసీ సంస్కృతి మీద నాగరికత పెత్తనాన్ని ప్రశ్నించిన వీరవనితలు సమ్మక్క!..సారక్క!!
ముక్కోటి దైవాలకు మొక్కిన పాపాన్నంతా కడిగివేసే పసుపు- కుంకుమ భరిణ సమ్మక్క!..సారక్క!!
కష్ట కాలంలో “కప్పం” కట్టను పొమ్మని “కాక”లు తీరిన కాకతీయుల ను ధిక్కరించిన గుండెలు మండిన “అడవిబిడ్డలు”
అన్యాయాన్ని ధిక్కరించే ఎవరికైనా ‘కత్తిలాంటి జ్ఞాపకం’దీర,వీర వనితలు సమ్మక్క! సారక్క!!
