- రెసిడెన్షియల్ బిల్డింగ్ కి స్కూల్ పర్మిషన్ వెనుక ‘లాబింగ్’ ప్రభావం..
- ఐదంతస్తుల భారీ భవనం టాక్స్ మాత్రం జి ప్లస్ వన్ కే..?
- వారి అడుగుజాడల్లోనే మున్సిపల్ కమిషనర్ ఇందులో కమిషనర్ వాట ఎంతనో మరి..?
- 100 పీట్ల హైవే రోడ్డు, ఆ పక్కనే పెద్ద బావి, అయినా సరే పర్మిషన్..?
- విద్యాశాఖ అధికారుల ‘ప్రభావ’ లాబీకి గుడ్డి మద్దతు..!
- సిద్దిపేట విద్యాశాఖలో చట్టం కాదు, అవినీతి రాజ్యమేలుతుంది..?
- విద్యార్థుల ప్రాణాలతో చెలగాటమాడుతున్న విద్యాశాఖ..!
- బిల్డింగ్ యజమాని పలుకుబడి ముందు సాగిలపడ్డ ఎంఈఓ డీఈఓ..!
సిద్దిపేట జిల్లా విద్యాశాఖలో నిబంధనలు ‘బానిస’లుగా మారాయి. అధికారం, పలుకుబడి ముందు చట్టాలు తలవంచుతున్నాయని నిరూపిస్తూ, నివాస భవనం (రెసిడెన్షియల్) అనుమతి ఉన్న ఐదంతస్తుల భారీ కట్టడంలో ఏకంగా కార్పొరేట్ స్కూల్ (శ్రీ చైతన్య) ప్రారంభించడానికి విద్యాశాఖ పర్మిషన్ ఇవ్వడం సంచలనం రేపుతోంది. ఈ అక్రమం వెనుక ‘లాబింగ్’ ప్రభావం ఎంత ఉందో మున్సిపల్ వ్యవహారాలు, విద్యాశాఖ అధికారుల తీరు స్పష్టం చేస్తున్నాయి.



ఐదంతస్తుల భవనం..టాక్స్ మాత్రం జి ప్లస్ వన్ మాత్రమే..!
నివాస భవనం అనుమతి తీసుకుని, దాదాపు ఐదంతస్తుల భారీ బిల్డింగ్ను నిర్మించారు. కానీ ఆశ్చర్యకరంగా, దీనికి మున్సిపల్ శాఖలో చెల్లిస్తున్న ఆస్తి పన్ను వివరాలు మరింత షాకిస్తున్నాయి. ఇంత పెద్ద భవనానికి కేవలం జి ప్లస్ వన్ కు మాత్రమే పన్ను చెల్లిస్తున్నట్టుగా రికార్డులు చూపిస్తున్నాయని సమాచారం. పన్ను ఎగవేతకు పాల్పడటమే కాకుండా, మున్సిపాలిటీకి భారీ నష్టం కలిగిస్తున్న ఈ వ్యవహారంలో మున్సిపల్ కమిషనర్ పాత్రపై తీవ్ర అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఐదంతస్తుల నిర్మాణానికి కేవలం ఒకే ఫ్లోర్కు టాక్స్ పరిమితం కావడానికి గల కారణాలేమిటి? ‘వారి అడుగుజాడల్లోనే’ అంటూ స్థానికంగా వినిపిస్తున్న గుసగుసల్లో కమిషనర్ వాటా ఎంతనో తేల్చాలని ప్రజా సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి.
100 పీట్ల హైవే రోడ్డు… పక్కనే పెద్ద బావి: భద్రతా ప్రమాణాలకు తిలోదకాలు!
నియమాల ప్రకారం స్కూల్ భవనం హైవే రోడ్డుకు దూరంగా ఉండాలి, కనీస భద్రతా ప్రమాణాలు పాటించాలి. కానీ ఈ బిల్డింగ్… 100 పీట్ల హైవే రోడ్డుకు పక్కనే ఉంది. అంతేకాక, ఆనుకునే పెద్ద బావి కూడా ఉంది. పిల్లల భద్రతకు ఏ మాత్రం గ్యారెంటీ లేని ఈ ప్రమాదకర లొకేషన్లో పర్మిషన్ ఇవ్వడం వెనుక విద్యాశాఖ అధికారుల నిస్సిగ్గు నిర్లక్ష్యానికి, ‘ప్రభావశాలి వర్గం’ లాబీయింగ్కు గుడ్డి మద్దతు స్పష్టమవుతోంది. విద్యార్థుల ప్రాణాలతో చెలగాటమాడుతున్న ఈ వ్యవహారంలో ఎంఈఓ, డీఈఓ లు బిల్డింగ్ యజమాని పలుకుబడి ముందు సాగిలపడ్డారని తల్లిదండ్రులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
మౌనం వెనుక ‘ప్రభావం’
: సిద్దిపేట విద్యాశాఖలో అవినీతి రాజ్యమేలుతోంది!
నివాస అనుమతి ఉన్న భవనానికి కార్పొరేట్ స్కూల్ పర్మిషన్ ఇవ్వడం, ఐదంతస్తుల భవనం టాక్స్ కేవలం జి ప్లస్ వన్ కు మాత్రమే పరిమితం కావడం, ఆశ్చర్యానికి గురిచేస్తుంది. ఇవన్నీ సిద్దిపేట మున్సిపల్ ఎంత, నీచనికి దిగారిందోనని ప్రజలు అసహ్యించుకుంటున్నారు ఇది సిద్దిపేట విద్యాశాఖ, మున్సిపల్ శాఖలలో చట్టం కాదు, అవినీతి రాజ్యమేలుతుందని నిరూపిస్తున్నాయి. ఫైలు క్లియర్ చేసిన డీఈఓ, పర్మిషన్ ఇచ్చిన ఎంఈఓ, పన్ను వ్యవహారంలో మౌనం వహించిన మున్సిపల్ అధికారులు… ఈ ముగ్గురూ ‘మనమంతా ఒకటే’ అన్న భావజాలంతోనే వ్యవహరించారని, నిబంధనలు కేవలం సామాన్య ప్రజల కోసమేనని తేల్చేశారు. విద్యార్థి సంఘాలు, ప్రజా సంఘాలు ఈ అక్రమాలపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. నిబంధనలు ఉల్లంఘించిన బిల్డింగ్ ఓనర్, పర్మిషన్ ఇచ్చిన అధికారులపై వెంటనే క్రిమినల్ కేసులు నమోదు చేయాలని, కఠిన చర్యలు తీసుకోవాలని హెచ్చరించాయి. లేదంటే సిద్దిపేటలో పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేపడతామని డిమాండ్ చేశాయి. “పలుకుబడి ఉంటే చట్టం వంగిపోతుందా?” అనే ప్రశ్నకు జవాబు దొరికే వరకు పోరాటం – ఆగదని హెచ్చరించాయి.

