Tuesday, March 3, 2026
Homeఆదాబ్ ప్రత్యేకంSuryapet | రోడ్డు విస్తరణతో కుప్పకూలిన పేట వ్యాపారం

Suryapet | రోడ్డు విస్తరణతో కుప్పకూలిన పేట వ్యాపారం

  • పాత జాతీయ రహదారిపై మూతపడుతున్న షాపులు.
  • మార్కెట్‌ తరలింపు, హైవే పనులతో కోట్ల నష్టాలు.
  • ఒకప్పుడు కళకళలాడిన పేట, నేడు వెలవెల.
  • ప్రభుత్వం స్పందించాలంటూ వ్యాపారుల ఆవేదన.

ఒకప్పుడు దక్షిణ తెలంగాణ ఆర్థిక రాజధానిగా పేరొందిన సూర్యాపేట పట్టణం నేడు వ్యాపార సంక్షోభంలో కూరుకుపోతోంది. జిల్లా కేంద్రంగా నల్గొండ ఉన్నప్పటికీ రాజకీయ, ఆర్థిక కార్యకలాపాలకు సూర్యాపేటే కేంద్రంగా ఉండేది. హైదరాబాద్‌, విజయవాడ, వరంగల్‌, సిద్దిపేట వంటి ప్రధాన నగరాలకు సమాన దూరంలో ఉండటంతో ఇక్కడ వ్యాపార అవకాశాలు విస్తృతంగా ఉండేవి.ప్రధానంగా వ్యవసాయ మార్కెట్‌, రైస్‌మిల్లులు, ధాన్యం వ్యాపారం ఆధారంగా పాత జాతీయ రహదారి (ఎన్‌హెచ్‌`9) వెంట ఉన్న వాణిజ్య కేంద్రాలు కళకళలాడేవి. హోటళ్లు, బట్టల షాపులు, నగల దుకాణాలు, కిరాణా షాప్‌ లు, సినిమా హాళ్లు, వైన్స్‌లు ఇలా అనేక వ్యాపారాలు పేటకు ప్రాణంగా ఉండేవి. అయితే ప్రస్తుతం ఆ పరిస్థితి పూర్తిగా మారిపోయింది.

రోడ్డు విస్తరణే మొదటి శరాఘాతం :

పొట్టి శ్రీరాములు సెంటర్‌ నుంచి కోర్టు చౌరస్తా వరకు చేపట్టిన రోడ్డు విస్తరణ పనులు సూర్యాపేట వ్యాపారానికి మొదటి పెద్ద అడ్డంకిగా మారాయి. దశాబ్దాల చరిత్ర కలిగిన పేట మార్కెట్‌ వ్యాపారాలు ఈ విస్తరణతో నెమ్మదిగా కనుమరుగయ్యాయి. సగం కూల్చిన షాపులు, న్యాయ వివాదాల్లో చిక్కుకున్న భవనాల మధ్య వ్యాపారం కుదేలైంది. అనేక మంది వ్యాపారులు షాపులు మూసివేయగా, కొందరు వలస వెళ్లారు. మరికొందరు ఉన్న ఆస్తులను అమ్ముకుని జీవనం సాగిస్తున్నారు.

- Advertisement -

మార్కెట్‌ తరలింపుతో మరింత దెబ్బ :

గత ప్రభుత్వ పాలనలో చేపట్టిన అభివృద్ధి పనులు ప్రశంసనీయం అన్న విషయాన్ని వ్యాపారులు కూడా ఒప్పుకుంటున్నారు. అయితే పేటకు ఆయువుపట్టు అయిన వ్యవసాయ మార్కెట్‌ను తరలించడం సూర్యాపేట వ్యాపారానికి తీరని నష్టం తెచ్చిపెట్టింది.
కొండ నాలుక్కి మందేస్తే ఉన్న నాలుక ఊడిరది అన్న చందంగా మార్కెట్‌ తరలింపుతో పేట పూర్తిగా వెలవెలబోయింది. మార్కెట్‌ను నమ్ముకుని నడిచిన హోటళ్లు, బట్టల దుకాణాలు, నగల షాపులు, కూరగాయల మార్కెట్‌, అడ్తి వ్యాపారులు, సినిమా హాళ్లు, వైన్స్‌ షాపులు ఒక్కొక్కటిగా మూతపడ్డాయి. రైతులు మార్కెట్‌కు వచ్చి అక్కడే సరుకు అమ్ముకుని తిరిగి వెళ్లిపోవడంతో పట్టణంలో కొనుగోలుదారుల సంఖ్య గణనీయంగా తగ్గిపోయింది. ప్రస్తుతం వ్యాపారులు దారిన పోయే వారిని పిలిచి అమ్ముకోవాల్సిన దుస్థితి నెలకొంది.

హైవే పనులతో మరోసారి చీకటి :

ఇక జాతీయ రహదారి అభివృద్ధి పనులు పేట మార్కెట్‌ను మరింత కుంగదీస్తున్నాయి. ఈనాడు కార్యాలయం సవిూపంలో జరుగుతున్న విస్తరణపై అభ్యంతరం లేకపోయినా, పాత లక్ష్మి టాకీస్‌ సెంటర్‌ నుంచి పాత బస్టాండ్‌ వరకు ఉన్న ప్రధాన వ్యాపార ప్రాంతం పూర్తిగా ప్రభావితమైంది. సూర్యాపేట వ్యాపారం ప్రధానంగా ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 6 గంటల మధ్యే సాగుతుందన్నది అందరికీ తెలిసిన విషయమే. సవిూప గ్రామాల ప్రజలు ఆ సమయాల్లోనే పట్టణానికి వచ్చి కొనుగోళ్లు చేసి వెళ్లిపోతారు. కానీ హైవే పనుల కారణంగా ఏర్పాటు చేసిన కందకాలు, అడ్డుగోడలు, రాకపోకల నియంత్రణ వ్యాపారాన్ని పూర్తిగా నిలిచిపోయేలా చేశాయి. పండగల వేళ కళకళలాడాల్సిన షాపులు ఇప్పుడు వెలవెలబోతున్నాయి.

వాహనాల దారి మళ్లింపుతో నష్టం :

పట్టణంలో పలుచోట్ల యూ`టర్న్‌లు ఏర్పాటు చేసిన అధికారులు, ప్రధాన మార్కెట్‌కు వెళ్లే ఈ ఒక్క దారిపై మాత్రం ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయలేదని వ్యాపారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. టౌన్‌ నుంచి హైవే ఎక్కే వాహనాలను మాత్రమే నియంత్రించాల్సి ఉండగా, పూర్తిగా రోడ్డు మూసివేయడంతో పాత జాతీయ రహదారిపై వ్యాపారం స్తంభించింది.కోదాడ, విజయవాడ, గడ్డిపల్లి, నేరేడుచర్ల, మిర్యాలగూడ వెళ్లే వాహనాలు పాత బస్టాండ్‌ నుంచే వెళ్లాల్సి ఉన్నా, ప్రస్తుతం కొత్త బస్టాండ్‌ పరిసరాల్లోనే ప్రయాణికులను దింపేస్తుండటంతో వారు అక్కడే కొనుగోళ్లు ముగించుకుని వెళ్తున్నారు. దీని వల్ల పాత మార్కెట్‌ వ్యాపారులు కోట్ల రూపాయల నష్టాలను ఎదుర్కొంటున్నారు.

ప్రభుత్వం స్పందించాలని వ్యాపారుల విజ్ఞప్తి :

ఇప్పటికైనా ప్రభుత్వం, జిల్లా అధికారులు స్పందించి బస్సులు, ఆటోలు, ఇతర వాహనాలు పాత జాతీయ రహదారి విూదుగా వెళ్లేలా చర్యలు తీసుకుంటే పాత మార్కెట్‌, బొడ్రాయి పరిసర వ్యాపారాలకు కొంతైనా ఊరట లభిస్తుందని వ్యాపారులు కోరుతున్నారు.వ్యాపారులు, అధికారుల నుంచి స్పష్టమైన చర్యలు వస్తాయేమోనని పట్టణ ప్రజలు ఆశగా ఎదురు చూస్తున్నారు.

- Advertisement -
RELATED ARTICLES

Latest News