• తెలంగాణలో నడుస్తున్నది కాంగ్రెస్, బీజేపీది జాయింట్ వెంచర్ ప్రభుత్వం
• స్థానిక సంస్థల ఎన్నికల్లో రెండు పార్టీలను బొంద పెట్టాలి..
• ఆల్మట్టి ఎత్తుతో పాలమూరును ఎడారిగా మార్చేందుకు కర్నాటక కాంగ్రెస్ కుట్ర
• కర్నాటక కాంగ్రెస్ కుట్రలపై రేవంత్ రెడ్డి ఎందుకు మౌనంగా ఉన్నారు..
• హామీలు మరిచిన కాంగ్రెస్‌కు బాకీ కార్డులతో బుద్ధి చెప్పాలి
• ఓట్లు అడగడానికి వచ్చే కాంగ్రెస్ నేతలను ప్రజలు ఈ బాకీ కార్డు చూపించి నిలదీయాలి
• అచ్చంపేట ‘జన గర్జన’ సభలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ నిప్పులు చెరిగారు. నాగర్ కర్నూల్ జిల్లా అచ్చంపేట నియోజకవర్గంలో ఏర్పాటు చేసిన బీఆర్ఎస్ పార్టీ జనగర్జన సభలో పాల్గొన్న కేటీఆర్.. ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ.. 70 వేల కోట్ల రూపాయాలతో ఆల్మట్టి డ్యాం ఎత్తును మరో ఐదు మీటర్లు పెంచే కర్నాటక కాంగ్రెస్ కుట్ర ఫలిస్తే తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ కు చుక్క కృష్ణా నీరు కూడా రాదని కేటీఆర్ ఆందోళన వ్యక్తం చేశారు. ఆల్మట్టి డ్యాం ఎత్తు పెంచి పాలమూరును ఎడారిగా మార్చే కర్నాటక కాంగ్రెస్ కుట్రలను అడ్డుకోకుండా నల్లమల్ల పులి అని చెప్పుకొనే రేవంత్ రెడ్డి, పిల్లిలాగా ఇంట్లో కూర్చున్నారని కేటీఆర్ మండిపడ్డారు. ఆల్మట్టి నిర్మాణాన్నే ఉమ్మడి రాష్ట్ర ప్రభుత్వాలు వ్యతిరేకించిన విషయాన్ని గుర్తుచేశారు. కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలను, మోసపూరిత విధానాలను ఆయన ఎండగట్టారు. ఆల్మట్టి ఎత్తు పెరిగితే కొడంగల్ లిఫ్ట్, పాలమూరు ఎత్తిపోతలు, శ్రీశైలం డ్యాం నిరుపయోగంగా మారతాయని కేటీఆర్ హెచ్చరించారు. రాజోలిబండ కోసం 2001లో కేసీఆర్ పాదయాత్ర చేసినప్పుడు సుంకేసుల తూములను బాంబులతో పేలుస్తామన్న రాయలసీమ ఎమ్మెల్యేకు, వెయ్యి బాంబులతో మొత్తం బరాజ్‌ను తునాతునకలు చేస్తామని కేసీఆర్ ధీటుగా బదులిచ్చారని గుర్తుచేశారు. అలాంటి దమ్ము, తెగువ రేవంత్ రెడ్డికి లేవా అని ప్రశ్నించారు. దక్షిణ తెలంగాణను ఎండబెట్టే కుట్రలపై ఢిల్లీలో ఉన్న రాహుల్ గాంధీ, ఇక్కడ ఉన్న రేవంత్ రెడ్డి ఎందుకు నోరు మెదపడం లేదని నిలదీశారు. ముఖ్యమంత్రి పదవి కాపాడుకునేందుకే రేవంత్ మౌనంగా ఉన్నారని చెప్పారు. ఏ రోజుకైనా తెలంగాణ ప్రయోజనాల కోసం కొట్లాడేది ఒక్క కేసీఆర్ మాత్రమేనని స్పష్టం చేశారు. రేవంత్ రెడ్డికి దమ్ముంటే కర్ణాటక ముఖ్యమంత్రిని ఢిల్లీకి పిలిపించి రాహుల్ గాంధీతో మాట్లాడించి, ఆల్మట్టి ఎత్తు పెంపును ఆపించాలని సవాల్ విసిరారు. లేదంటే గులాబీ దండే స్వయంగా వెళ్లి అడ్డుకుంటుందని హెచ్చరించారు. రేవంత్ రెడ్డి నల్లమల్ల పులి కాదని, ఆయనో నల్లమల్ల నక్క అని ఎద్దేవా చేసిన కేటీఆర్, కేసీఆర్‌కు పేరు వస్తుందన్న అక్కసుతో బీఆర్ఎస్ హయాంలో 90 శాతం పూర్తైన పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకాన్ని పక్కనపెట్టిండన్నారు. మిగిలిన 10శాతం పనులను పూర్తి చేయడం లేదని విమర్శించారు. ఆ ప్రాజెక్టుతో ఏ సంబంధం లేని జైపాల్ రెడ్డి పేరు పెట్టడం విడ్డూరంగా ఉందన్నారు. కల్వకుర్తి లిఫ్ట్ ఇరిగేషన్ తో అచ్చంపేట నియోజకవర్గంలోని 90 వేల ఎకరాలకు బీఆర్ఎస్ ప్రభుత్వం సాగు నీళ్లిచ్చిందన్న కేటీఆర్, మరో 70 వేల ఎకరాలకు నీళ్లిచ్చేందుకు 1350 కోట్లతో అచ్చంపేట లిఫ్ట్ ఇరిగేషన్ పథకాన్ని కూడా మంజూరు చేసిందన్నారు. అచ్చంపేట బిడ్డ అని చెప్పుకునే రేవంత్ రెడ్డి ఆ పథకాన్ని పూర్తి చేయకుండా పక్కన పెట్టారని కేటీఆర్ ఆరోపించారు. ఆరు గ్యారెంటీలను అమలు చేయకుండా కాంగ్రెస్, రేవంత్ రెడ్డి తెలంగాణలోని ప్రతి వర్గాన్ని దారుణంగా మోసం చేశారని కేటీఆర్ విమర్శించారు. అత్తకు రూ.4000, కోడలికి రూ.2,500 ఇస్తానని చెప్పి కుటుంబాల్లో చిచ్చుపెట్టారని, వృద్ధులకు రూ.4000 పెన్షన్ ఇవ్వకుండా రెండు నెలలు ఎగ్గొట్టారని మండిపడ్డారు. కాంగ్రెస్ దోఖాను ప్రజలకు గుర్తుచేయడానికే ‘కాంగ్రెస్ బకాయి కార్డు’ ఉద్యమాన్ని ప్రారంభించామన్నారు. కల్యాణలక్ష్మి కింద 8 లక్షల మంది ఆడబిడ్డలకు రేవంత్ రెడ్డి 8 లక్షల తులాల బంగారం బాకీ పడ్డారని చెప్పారు. దివ్యాంగులకు ఒక్కొక్కరికి రూ.44 వేలు బాకీ ఉన్నారని తెలిపారు. ఓట్లు అడగడానికి వచ్చే కాంగ్రెస్ నేతలను ప్రజలు ఈ బాకీ కార్డు చూపించి నిలదీయాలని, ఇదే ప్రజల చేతిలోని బ్రహ్మాస్త్రమని అన్నారు. రియల్ ఎస్టేట్ దందాలతో వందల కోట్లు సంపాదిస్తున్న కాంగ్రెస్ నేతలు ఓటుకు రూ.5000 ఇచ్చినా, బాకీ డబ్బులు ఎప్పుడు ఇస్తారని నిలదీయాలని సూచించారు. కాంగ్రెస్ నేతలు డబ్బులిచ్చి ప్రమాణాలు చేయించినా, ఉత్తుత్తి ప్రమాణాలు చేసి కారు గుర్తుకే ఓటు వేయాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. కాంగ్రెస్‌కు ఓటేసి మోసపోయిన తెలంగాణ ప్రజలు నేడు గోస పడుతున్నారని కేటీఆర్ ఆవేదన వ్యక్తం చేశారు. కేసీఆర్ పాలనలో కనుమరుగైన యూరియా బస్తాల క్యూ లైన్లు మళ్లీ వచ్చాయని, లైన్లలో నిలబడి రైతులు ప్రాణాలు కోల్పోతున్నారని అన్నారు. యూరియా ఇవ్వకుండా, రైతుబంధు వేయకుండా, వడ్లకు బోనస్ ప్రకటించకుండా రేవంత్ రెడ్డి రైతులను అరిగోస పెడుతున్నారని విమర్శించారు. తెలంగాణలో నడుస్తున్నది కాంగ్రెస్-బీజేపీ జాయింట్ వెంచర్ ప్రభుత్వమని కేటీఆర్ సంచలన ఆరోపణలు చేశారు. గతేడాది సెప్టెంబర్ 27న పొంగులేటి శ్రీనివాస్ రెడ్డిపై ఈడీ దాడులు చేసి, నోట్ల కట్టలు దొరికాయని ప్రచారం చేశారని, కానీ ఆయన కాంగ్రెస్‌లో చేరాక ఏడాది గడిచినా ఈడీ నోరు మెదపడం లేదని, ఇదే వారి అవగాహనకు నిదర్శనమని అన్నారు. ఈ రెండు పార్టీలను స్థానిక సంస్థల ఎన్నికల్లో బొంద పెట్టాలని పిలుపునిచ్చారు. రాష్ట్ర ప్రయోజనాలను కాపాడాలంటే మళ్లీ కేసిఆర్ రావాలి” అని కేటీఆర్ అన్నారు.