సీఎం రేవంత్ రెడ్డి(CM Revanth Reddy)ని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గవర్నర్ (RBI Governor) సంజయ్ మల్హోత్రా మర్యాద పూర్వకంగా కలిశారు. బోర్డు సమావేశంలో పాల్గొనేందుకు హైదరాబాద్‌కు వచ్చిన ఆయన జూబ్లీహిల్స్‌లోని సీఎం నివాసంలో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం పలు విభాగాల్లో అమలుచేస్తున్న సంస్కరణలను రేవంత్.. ఆర్బీఐ గవర్నర్‌కు వివరించారు. విద్యుత్ రంగంలో చేపట్టిన సంస్కరణలు, మూడో డిస్కం ఏర్పాటు వంటి అంశాలను ప్రస్తావించారు. రాష్ట్రంలో సోలార్ విద్యుత్ వినియోగం (Solar Power Consumption) పెంచే దిశగా తీసుకుంటున్న చర్యలను వివరించారు.
రాష్ట్ర ప్రభుత్వం అనుసరిస్తున్న ఆర్థిక విధానాలను ఆర్బీఐ గవర్నర్ సంజయ్ మల్హోత్రా ప్రశంసించారు. మరిన్ని సంస్కరణలు, ప్రణాళికలతో ముందుకు సాగాలని ఆకాంక్షించారు. తెలంగాణలో BUDS (Banning of Unregulated Deposit Schemes) యాక్ట్‌ను నోటిఫై చేయాలని ఆర్బీఐ గవర్నర్.. సీఎం రేవంత్‌ను కోరారు. యూనిఫైడ్ లెండింగ్ ఇంటర్‌ఫేస్ (ULI) విషయంలో ఆర్బీఐ తీసుకుంటున్న చొరవతోపాటు ప్రభుత్వ, ప్రైవేట్ డిపాజిట్ల క్లెయిమ్ క్యాంపెయినింగ్ తదితర అంశాలను వివరించారు. ఈ సమావేశంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావుతోపాటు ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
