గణతంత్ర దినోత్సవాల నేపథ్యంలో సాధారణ ప్రజల ఎంట్రీకి నో
ఈ నెల 21 నుంచి 29 వరకు 9 రోజుల పాటు సాధారణ ప్రజలను రాష్ట్రపతిభవన్‌లోకి అనుమతించరు. రిపబ్లిక్ డే పరేడ్(Republic Day Parade), బీటింగ్ రిట్రీట్ సెరెమొనీ(Beating Retreat Ceremony) నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. రాష్ట్రపతిభవన్ మెయిన్ బిల్డింగ్‌లోకి తీసుకెళ్లే సర్క్యూట్-1ను గణతంత్ర దినోత్సవాల సందర్భంగా మూసి ఉంచుతామని రాష్ట్రపతి సచివాలయం ఒక ప్రకటనలో పేర్కొంది. ఏటా జరిగే రిపబ్లిక్ డే పరేడ్‌ను కర్తవ్య పథ్(Kartavya Path)లో నిర్వహిస్తారు. గణతంత్ర దినోత్సవాల ముగింపునకు సంకేతంగా బీటింగ్ రిట్రీట్ ఏర్పాటుచేస్తారు. ఈ కార్యక్రమం ఈ నెల 29న రాష్ట్రపతిభవన్‌కి సమీపంలోని కర్తవ్య పథ్‌కి పశ్చిమ దిశ చివర ఉన్న విజయ్ చౌక్(Vijay Chowk)లో జరుగుతుంది.
సాధారణంగా రాష్ట్రపతిభవన్‌లోకి విజిటర్స్‌ను మంగళవారం నుంచి శనివారం వరకు ఆరు రోజులు (సోమవారం, గెజిటెడ్ హాలిడేస్ మినహా) అనుమతిస్తారు. మామూలుగా.. ఏడు విజిటింగ్ స్లాట్లను, ఏడు విజిటింగ్ డేట్లను ఏడు రోజులు ముందుగా అందుబాటులో ఉంచుతారు. విజిటింగ్ స్లాట్లు.. ఉదయం తొమ్మిదిన్నర నుంచి పదిన్నర, ఉదయం పదిన్నర నుంచి పదకొండున్నర, ఉదయం పదకొండున్నర నుంచి మధ్యాహ్నం పన్నెండున్నర, పన్నెండున్నర నుంచి ఒకటిన్నర, ఒకటిన్నర నుంచి రెండున్నర, రెండున్నర నుంచి మూడున్నర, మూడున్నర నుంచి నాలుగున్నర. సాయంత్రం నాలుగు గంటల తర్వాత ఎంట్రీ ఉండదు.
