- ప్రశ్నించిన కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ..
- ఏప్రిల్ 9న కేరళ అసెంబ్లీ ఎన్నికలు..
- బీజేపీతో ఎవరు పోరాడినా అటాక్ చేస్తుంది..
కేరళలో ఏప్రిల్ 9వ తేదీన అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో ఇవాళ పాతానమిట్టలో జరిగిన సభలో కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ మాట్లాడారు. కేరళ పర్యటన వేళ శబరిమల అంశంపై ప్రధాని మోదీ మౌనంగా ఉన్నారని ఆరోపించారు. దీని అర్థం బీజేపీ-ఎల్డీఎఫ్ కలిసి పనిచేస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు. అదూర్‌లో జరిగిన కాంగ్రెస్ మీటింగ్‌లో ప్రసంగిస్తూ.. రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో సీపీఐఎం, బీజేపీ పార్టీలను సంయుక్తంగా ఎదుర్కోబోతున్నట్లు తెలిపారు. తమ పార్టీ ఎల్డీఎఫ్ తో పోటీపడుతోందని, కానీ ఆ పార్టీకి బీజేపీ పూర్తి మద్దతు ఇస్తున్నట్లు రాహుల్ పేర్కొన్నారు.
బీజేపీతో ఎవరు పోరాడినా, వారిపై బీజేపీ అటాక్ చేస్తుందని, తనపై అటాక్ జరిగిందని, నాపై 36 కేసులు ఉన్నాయని, 55 గంటల పాటు నిర్విరామంగా తనను ప్రశ్నించారన్నారు. అయితే కేరళ సీఎం పినరయి విజయన్‌పై ఎటువంటి చర్యలు లేవన్నారు. ఎల్డీఎఫ్ నాయకత్వం చాలా భ్రష్టుపట్టిందని, ఆ పార్టీ నేతలపై కేసులు ఉన్నాయని, కానీ బీజేపీ నుంచి వారిపై వత్తిడి లేదని, దర్యాప్తులు జరగడం లేదని, వాళ్లకు బెదిరింపులు కూడా లేవని రాహుల్ గాంధీ అన్నారు.
ప్రధాని మోదీ ఎక్కడకు వెళ్లినా.. ఆలయాల గురించి మతం గురించి మాట్లాడుతారని, కానీ పాలక్కాడ్ పర్యటనలో ప్రధాని మోదీ శబరిమల అంశాన్ని లేవనెత్తలేదన్నారు. అయ్యప్ప స్వామి ఆలయం నుంచి లెఫ్ట్ ఫ్రంట్ నేతలు బంగారాన్ని దోచుకెళ్లిన విషయాన్ని ప్రధాని మరిచిపోయారని రాహుల్ అన్నారు. బంగారాన్ని ఎత్తుకెళ్లిన లెఫ్ట్ ఫ్రంట్ నేతలు.. దాన్ని ఇత్తడితో నింపేశారని ఆరోపించారు. శబరిమల అంశంపై ప్రధాని మౌనంగా ఉండి బీజేపీకి నష్టం జరగకుండా చూసే ప్రయత్నం చేశారన్నారు. దీని వల్ల బీజేపీ, ఎల్డీఎఫ్ కలిసి పనిచేస్తున్నట్లు స్పష్టమైందని, ఇక ప్రధాని మోదీ మతాన్ని పట్టించుకోరని, హిందూ మతాన్ని కానీ ఆలయాలను కానీ పట్టించుకోవడం లేదని ఆరోపించారు.
