- ఐదు కోట్ల ఆంధ్రుల ఆకాక్షను నెరవేర్చిన రాష్ట్రపతి..
- ముర్మును మర్యాదపూర్వకంగా కలిసిన లోకేష్ బృందం..
ఆంధ్రప్రదేశ్ ఏకైక రాజధానిగా అమరావతికి శాశ్వత చట్టబద్ధత కల్పిస్తూ రాష్ట్రపతి ద్రౌపది ముర్ము రాజముద్ర వేయడం చరిత్రాత్మకమని రాష్ట్ర ఐటీ, విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్ అన్నారు. ఐదు కోట్ల ఆంధ్రుల ఆకాంక్షను నెరవేర్చిన రాష్ట్రపతికి కృతజ్ఞతలు తెలిపేందుకు, మంత్రి లోకేశ్ నేతృత్వంలోని ఎన్డీఏ ఎంపీల బృందం సోమవారం ఢిల్లీలోని రాష్ట్రపతి భవన్‌లో ఆమెను మర్యాదపూర్వకంగా కలిసింది. ఈ చారిత్రక నిర్ణయంతో “మా రాష్ట్రం ఆంధ్రప్రదేశ్-మా రాజధాని అమరావతి” అని ప్రతి ఆంధ్రుడు గర్వంగా చెప్పుకునేలా చేశారని వారు హర్షం వ్యక్తం చేశారు.
ఈ సందర్భంగా మంత్రి లోకేశ్ మాట్లాడుతూ.. రాష్ట్ర విభజన తర్వాత రాజధాని లేని రాష్ట్రంగా ఏపీ తీవ్రంగా నష్టపోయిందని రాష్ట్రపతికి వివరించారు. ఐదు కోట్ల ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా రూపుదిద్దుకున్న అమరావతికి చట్టబద్ధత కల్పించడంపై ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు ప్రజల తరఫున ధన్యవాదాలు తెలిపారు. అమరావతికి శంకుస్థాపన చేసింది ప్రధాని నరేంద్ర మోదీయేనని, 2024లో ఎన్డీఏ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఆయన నాయకత్వంలోనే పనులు తిరిగి ప్రారంభమయ్యాయని గుర్తుచేశారు. అనంతరం, అమరావతి చరిత్ర, సంస్కృతి, రైతుల ఉద్యమం, మాస్టర్ ప్లాన్, పర్యావరణ హిత నిర్మాణాల విశేషాలతో కూడిన పుస్తకాన్ని రాష్ట్రపతికి అందజేశారు.
రాజధాని నిర్మాణం కోసం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇచ్చిన పిలుపుతో రైతులు కేవలం 58 రోజుల్లో 34 వేల ఎకరాల భూములను స్వచ్ఛందంగా త్యాగం చేశారని లోకేష్ రాష్ట్రపతికి తెలిపారు. గత ప్రభుత్వ హయాంలో వారిపై దాడులు జరిగినా, అక్రమ కేసులు బనాయించినా వెనకడుగు వేయకుండా శాంతియుతంగా ఉద్యమం కొనసాగించారని వివరించారు.
మంత్రి లోకేశ్, ఎంపీల బృందం చెప్పిన విషయాలను సావధానంగా విన్న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, అమరావతి చట్టం తన హయాంలో రావడం సంతోషంగా ఉందన్నారు. రాష్ట్రంపై ప్రేమతో రైతులు తమ భూములను త్యాగం చేయడాన్ని ఆమె ప్రశంసించారు. “పోరాడి సాధించుకున్నది చిరస్థాయిగా గుర్తుండిపోతుంది” అని ఆమె వ్యాఖ్యానించారు.
ముఖ్యమంత్రి చంద్రబాబు ఒక విజనరీ లీడర్ అని, ఆయన దూరదృష్టితో రాష్ట్రాన్ని, రాజధానిని అద్భుతంగా అభివృద్ధి చేస్తారన్న విశ్వాసం తనకుందని అభిప్రాయపడ్డారు. ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి పథంలో పయనించాలని, రాజధాని నిర్మాణ పనులు ఎలాంటి ఆటంకాలు లేకుండా కొనసాగాలని రాష్ట్రపతి ఆకాంక్షించారు.
