- యువత ఆత్మవిశ్వాసంతో అన్ని రంగాల్లో అద్భుతాలు సృష్టిస్తున్నారు : పీఎం నరేంద్ర మోడీ
- సాహస బాలలకు బాల పురస్కార్ అవార్డులు
- ‘ప్రధాన మంత్రి రాష్ట్రీయ బాల్ పురస్కార్’ అవార్డులను అందచేసిన రాష్ట్రపతి ముర్ము
- స్నేహితుడిని కాపాడబోయి ప్రాణాలు విడిచిన 8ఏళ్ల చిన్నారికి పురస్కారం
- భారత యువ క్రికెటర్ వైభవ్ సూర్యవంశీకి ప్రతిష్టాత్మక అవార్డు
- క్రికెట్‌లో అద్భుత ప్రతిభ కనబరిచినందుకు గాను ఈ అరుదైన గౌరవం
న్యూఢిల్లీ వేదికగా ‘ప్రధాన మంత్రి రాష్ట్రీయ బాల్ పురస్కార్’ కార్యక్రమం అంగరంగ వైభవంగా జరిగింది. ఢిల్లీలో నిర్వహించిన ఈ ప్రత్యేక కార్యక్రమంలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చిన్నారులకు అవార్డులను ప్రదానం చేశారు. ఈ పురస్కారాలు ధైర్య సాహసాలు, కళలు, సంస్కృతి, పర్యావరణం, ఇన్నోవేషన్స్, సైన్స్ అండ్ టెక్నాలజీ, క్రీడలు అనే ఆరు విభాగాల్లో సృజనాత్మకత చూపించిన వారికి అందించారు. అవార్డు గెలుచుకున్న పిల్లలు, వారి తల్లిదండ్రులకు రాష్ట్రపతి అభినందనలు తెలిపారు. వారి సాహసాలు, విజ్ఞానం దేశానికి గర్వకారణం ఆమె ప్రశంసించారు. వయసుకు మించి ధైర్యసాహసాలు, ప్రతిభను ప్రదర్శించే చిన్నారులకు ’వీర్ బాల్ దివస్’ సందర్భంగా ఏటా పురస్కారాలు అందిస్తారు. ఈ ఏడాది రాష్ట్రపతి భవన్‌లో ఈ కార్యక్రమం నిర్వహించారు.
రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము చేతుల విూదుగా బిహార్ చిన్నోడు వైభవ్ సూర్యవంశీ సహా పలువురు చిన్నారులు ’ప్రధానమంత్రి రాష్ట్రీయ బాల్ పురస్కార్’ను అందుకున్నారు. పురస్కార గ్రహీతల్లో ఒక్కొక్కరిదీ ఒక్కో కథ. వీరిలో వ్యోమప్రియ ప్రదర్శించిన సాహసం, శ్వాన్ సింగ్ ఉదారత పలువురి హృదయాలను కదిలించింది.కరెంట్ షాక్ నుంచి ఓ బాలుడిని కాపాడబోయి ప్రాణాలు కోల్పోయిన 8 ఏళ్ల చిన్నారి వ్యోమ ప్రియ తరఫున ఆమె తల్లి అర్చనా శివరామకృష్ణన్ రాష్ట్రపతి నుంచి పురస్కారం స్వీకరించారు. ఈ సందర్భంగా కుమార్తెను గుర్తుచేసుకుంటూ భావోద్వేగానికి గురయ్యారు. ‘నా కుమార్తె తరఫున ఈ అవార్డు తీసుకుంటున్నా.

అప్పుడు మా అమ్మాయికి ఎనిమిదేళ్లు. మా అపార్ట్‌మెంట్ కాంప్లెక్స్‌లో ఉన్న పిల్లల పార్క్‌లో మిగతా చిన్నారులతో కలిసి ఆడుకుంటోంది. అక్కడ అండర్‌గ్రౌండ్ కేబుల్‌పై ఏర్పాటు చేసిన స్లైడ్‌పై ఆడుకుంటున్న ఆరేళ్ల పిల్లాడు అకస్మాత్తుగా పడిపోయాడు. ఆ చిన్నారిని కాపాడదామని వెళ్లిన నా కూతురుకు కరెంట్ షాక్ తగిలింది. ఆ ఘటనలో మా ప్రియతో పాటు ఆ బాలుడు కూడా ప్రాణాలు కోల్పోయాడు. కేబుల్ దెబ్బతిని ఉండటంతో స్లైడ్‌కు షాక్ రావడమే అందుకు కారణమైంది. అంత చిన్న వయసులోనే ధైర్యం ప్రదర్శించిన నా బిడ్డ ఇప్పుడు నేరుగా వచ్చి ఈ అవార్డు తీసుకొని ఉంటే ఎంతో సంతోషించేవాళ్లం అంటూ అర్చనా ఉద్వేగభరితంగా చెప్పారు. 2024 మేలో తమిళనాడులోని కొయంబత్తూరులో ఈ విషాద ఘటన చోటుచేసుకుంది.’ఆపరేషన్ సిందూర్ సమయంలో ఓ పదేళ్ల బాలుడు మన సైనికులకు బాసటగా నిలిచాడు.
అడగకముందే వారికి మంచినీరు, పాలు, టీ, లస్సీ.. వంటివి అందిస్తూ తనవంతు సాయం చేశాడు. అతడే శ్వాన్ సింగ్. పంజాబ్‌లోని ఫిరోజ్‌పుర్ జిల్లాకు చెందిన ఆ బాలుడి ధైర్యసాహసాలు, ఉత్సాహానికి ప్రశంసించిన సైన్యం అతడి చదువుకయ్యే ఖర్చులు పూర్తిగా భరించేందుకు ముందుకొచ్చింది. ఈ క్రమంలో తాజాగా శ్వాన్ సింగ్‌ను ఇప్పుడు బాలల పురస్కారం వరించింది. ఈ అవార్డును తాను కలలో కూడా ఊహించలేదని చిన్నారి సంతోషం వ్యక్తంచేశాడు. ఏటా డిసెంబర్ 26న వీర్ బాల్ దివస్ నిర్వహిస్తారు.

భారత క్రికెట్ వైభవ్ సూర్యవంశీకి బాల పురస్కార్ స్వీకరణ
భారత క్రికెట్ యువ సంచలనం వైభవ్ సూర్యవంశీకి ప్రతిష్టాత్మక అవార్డు లభించింది. 14 ఏళ్లకే వరల్డ్ రికార్డ్స్ క్రియేట్ చేస్తున్న ఈ చిచ్చరపిడుగును.. ప్రధాన్ మంత్రి రాష్ట్రీయ బాల్ పురస్కార్ వరించింది. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేతుల విూదుగా అతడు శుక్రవారం ఈ ప్రతిష్టాత్మక అవార్డు అందుకున్నాడు. క్రికెట్‌లో అద్భుత ప్రతిభ కనబరిచినందుకు గాను ఈ అరుదైన గౌరవం లభించింది. విజయ్ హజారే ట్రోఫీలో ఇటీవల ఎంట్రీ ఇచ్చిన వైభవ్ సూర్యవంశీ కేవలం 36 బంతుల్లోనే సెంచరీ, 84 బంతుల్లో 190 పరుగులతో చరిత్ర సృష్టించిన సంగతి తెలిసిందే. బిహార్‌కు చెందిన వైభవ్ సూర్యవంశీ దేశవాళీ క్రికెట్లో సత్తా చాటి.. రంజీల్లో అరంగేట్రం చేసిన అత్యంత పిన్న వయస్కుడి (12)గా రికార్డు సాధించాడు. అలానే ఐపీఎల్`2025లో రాజస్తాన్ రాయల్స్ తరఫు వేగవంతమైన సెంచరీ నమోదు చేయడం ద్వారా మరోసారి వార్తల్లో నిలిచాడు.
గుజరాత్ టైటాన్స్ వంటి పటిష్ట బౌలింగ్ విభాగం ఉన్న జట్టుపై కేవలం 35 బంతుల్లోనే సెంచరీ చేసి.. ఐపీఎల్ చరిత్రలోనే చిన్న వయసులో ఈ ఘనత సాధించిన భారత తొలి బ్యాటర్‌గా నిలిచాడు. ప్రస్తుతం భారత అండర్19 జట్టు తరఫున వైభవ్ ఆడుతున్నాడు. ఆస్టేల్రియా, ఇంగ్లాండ్‌లలోనూ అండర్19 వన్డేల్లో ఫాస్టెస్ట్ సెంచరీలు నమోదు చేశాడు. ఇటీవల అండర్19 ఆసియా కప్2025లోనూ, అలానే తాజాగా దేశీ వన్డే టోర్నీ విజయ్ హజారే ట్రోఫీ 2025`26లోనూ వైభవ్ దుమ్ములేపాడు. బుధవారం అరుణాచల్ ప్రదేశ్‌తో జరిగిన మ్యాచ్‌లో కేవలం 36 బంతుల్లోనే సెంచరీ చేసిన వైభవ్.. 84 బంతుల్లో 190 పరుగులు సాధించాడు.
తద్వారా లిస్ట్‌ఎ క్రికెట్‌లో అత్యంత వేగంగా 150 పరుగుల మార్కు దాటిన బ్యాటర్‌గా వరల్డ్ రికార్డును క్రియేట్ చేశాడు.ఇలా చిన్న వయసులోనే క్రికెట్‌లో సంచలనాలు సృష్టిస్తున్న వైభవ్ సూర్యవంశీని.. పిల్లలకు అందించే అత్యున్నత పురస్కారం ప్రధాన్ మంత్రి రాష్ట్రీయ బాల్ పురస్కార్‌తో భారత ప్రభుత్వం సత్కరించింది. రాష్ట్రపతి ముర్ము చేతుల విూదుగా అవార్డు అందుకున్న వైభవ్ ఆనందాన్ని వ్యక్తం చేశాడు. బాల్ పురస్కార్‌ను 518 ఏళ్ల మధ్య వయసు గల పిల్లలకు సాహసం, సంస్కృతి, వాతావరణం, నవకల్పనలు, సైన్స్ అండ్ టెక్నాలజీ, సామాజిక సేవ, క్రీడలు తదితర విభాగాల్లో అందజేస్తారు.
యువత ఆత్మవిశ్వాసంతో
అన్ని రంగాల్లో అద్భుతాలు సృష్టిస్తున్నారు
జెన్ జీ యువత ఆత్మవిశ్వాసంతో అన్ని రంగాల్లో అద్భుతాలు సృష్టిస్తున్నారని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. వారి సామర్థ్యాలు, క్రమశిక్షణ, కష్టపడే తత్వంతో వికసిత్ భారత్ లక్ష్యాన్ని నెరవేరుస్తారని విశ్వాసం వ్యక్తం చేశారు. ఎవరు చిన్న, ఎవరు పెద్ద అనే విషయాన్ని వయసు నిర్ణయించదని.. మనం చేసే పనులు, సాధించే విజయాలే నిర్ణయిస్తాయని అన్నారు. చిన్న వయసులో కూడా ఇతరులు మన నుంచి ప్రేరణ పొందేలా అనేక పనులు చేయవచ్చని ‘ప్రధానమంత్రి రాష్ట్రీయ బాల్ పురస్కార్’ కార్యక్రమానికి హాజరైన బాలలకు ప్రధాని సూచించారు.తాత్కాలికంగా వచ్చే ఆకర్షణలు, పాపులారిటీకి లొంగిపోకుండా.. దేశాభివృద్ధికి పాటుపడిన గొప్ప వ్యక్తుల జీవితం నుంచి మంచి విషయాలు నేర్చుకోవాలని ప్రధాని మోదీ సూచించారు.
ఏ విషయంలో అయినా అనుమానాలు, సందేహాలు వచ్చినప్పుడు పెద్దవారిని సంప్రదించాలని సూచించారు. యువతే దేశానికి చోదక శక్తి అని.. దేశాభివృద్ధిలో రానున్న 25 సంవత్సరాలు చాలా కీలకమని పునరుద్ఘాటించారు. వారి కలలు, ఆకాంక్షలే భారతదేశ దశ, దిశలను నిర్ణయిస్తాయని అన్నారు. వాళ్ల అభిరుచులే దేశాభివృద్ధికి మార్గం చూపిస్తాయని చెప్పారు. యువత తాము సాధించే విజయాన్ని తమ విజయంగా కాకుండా దేశం సాధించిన విజయంగా భావించాలన్నారు. అదే లక్ష్యంతో ముందుకు వెళ్లాలని సూచించారు. యువత అన్ని రంగాల్లో ముందుకు వెళ్లే విధంగా తమ ప్రభుత్వం అవకాశాలు కల్పిస్తోందని తెలిపారు.
