- ప్రముఖ నవలా రచయితగా అంపశయ్య నవీన్ ప్రసిద్ది
- కళాకారిణి, ప్రజా గాయనిగా పేరొందిన అంతడుపుల రమాదేవీ
- ఈ నెల 13న రవీంద్ర భారతిలో ప్రధానం
ప్రముఖ రచయిత అంపశయ్య నవీన్, అంతడుపుల రమాదేవీ పొన్నం సత్తయ్య జీవిత సాఫల్య పురస్కారానికి ఎంపికయ్యారు. మంత్రి పొన్నం ప్రభాకర్, ఆయన సోదరులు అశోక్, రవిచంద్రల తండ్రి పొన్నం సత్తయ్య గౌడ్ చారిటబుల్ ట్రస్టు ద్వారా ప్రతి ఏడాది రచయితలకు, కళాకారులకు పొన్నం సత్తయ్య జీవిత సాఫల్య పురస్కారాలు అందిస్తోన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే 2025 సంవత్సరానికి గానూ ప్రముఖ నవలా రచయిత అంపశయ్య నవీన్, కళారంగంలో అంతడుపుల రమాదేవీలు ఈ అవార్డ్ కు ఎంపికయ్యారు. ఎంపిక కమిటీ కన్వీనర్ డా.పొన్నం రవిచంద్ర సారధ్యంలో జ్యూరీ కమిటీలో సీనియర్ పాత్రికేయులు కేంద్ర సమాచార శాఖ మాజీ కమిషనర్ మాడభూషి శ్రీధర్ ,సీనియర్ జర్నలిస్ట్ దిలీప్ రెడ్డి , తెలంగాణ రాష్ట్ర భాషా సాంస్కృతిక శాఖ సంచాలకులు మామిడి హరికృష్ణ , రచయిత్రి అయినంపూడి శ్రీ లక్ష్మీ సభ్యులుగా ఉన్న కమిటీ ఈ వార్డులను ఎంపిక చేసి చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ రాష్ట్ర మంత్రి పొన్నం ప్రభాకర్‌కు ఎంపిక పత్రాన్ని అందచేసారు. గత మూడు సంవత్సరాలు ఈ అవార్డులను సాహిత్య విభాగంలో నాళేశ్వరం శంకరం, నలిమెలా భాస్కర్, చంద్రబోస్‌లు అందుకోగా కళాకారుల విభాగంలో ఒగ్గు ధర్మయ్య, కామ్రేడ్ విమలక్క, బలగం ఫేమ్ కొమురమ్మ అందుకున్నారు. ఈ సంవత్సరం కమిటీ పలువురు రచయితలు, కళాకారుల పేర్లను పరిశీలించి అంపశయ్య నవీన్, అంతడుపుల రమాదేవీల పేర్లను ఎంపిక చేశారు. పొన్నం సత్తయ్య 15వ వర్ధంతి సందర్భంగా ఈనెల 13వ తేదీ సాయంత్రం 6 గంటలకు రవీంద్రభారతిలో ఈ అవార్డులను ప్రధానం చేయనున్నారు. అవార్డు గ్రహీతలకు రూ.51 వేల నగదుతో పాటు మెమెంటో, ప్రశంసా పత్రాన్ని అందించడం జరుగుతుంది.
ప్రముఖ నవలా రచయిత అంపశయ్య నవీన్
అంపశయ్య నవీన్‌గా పేరొందిన దొంగరి మల్లయ్య ప్రముఖ తెలుగు రచయితల్లో ఒకరు. ఆయన రచనలు నిజాయితీ, సామాజిక చైతన్యం ,వ్యక్తిగత మానసిక స్థితులకు ప్రతిబింబంగా నిలుస్తాయి. వీరి రచనలు ఎక్కువగా వస్తూ ఆధారిత , విప్లవాత్మక మనో వైజ్ఞానిక కోణంలో ఉంటాయి. తెలుగు నవలా జానర్‌లో సైకలాజికల్ రియలిజం తీసుకొచ్చిన రచయితల్లో అగ్రగణ్యుడు.
అంతడుపుల రమాదేవి
రమాదేవి తెలంగాణ ఉద్యమంలో బతుకమ్మ పాటలు, తెలంగాణ అస్తిత్వ గానాలతో తనదైన స్వరాలతో దశాబ్దల కాలం నుండి ఎన్నో భక్తిగీతాలు తెలంగాణ జానపద పాటలతో ఉత్తేజపరుస్తున్న కళాకారిణి ప్రజా గాయని అంతడుపుల రమాదేవి.