దేశ రాజధాని ఢిల్లీలో వాయు కాలుష్యం తీవ్ర స్థాయికి చేరింది. వరుసగా నాలుగో రోజు (అక్టోబర్ 18న) కూడా ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ (ఏక్యూఐ) 300 పైనే నమోదు కావటం గమనార్హం. గాలి నాణ్యత పడిపోవడంతో ఢిల్లీ-ఎన్సీఆర్ ప్రాంతంలో విజిబిలిటీ తగ్గింది. దీంతో.. దగ్గు, గొంతు నొప్పి, కళ్ల మంటలతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. సెంట్రల్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ గణాంకాల ప్రకారం ఘజియాబాద్‌లో ఏక్యూఐ 306, నోయిడాలో 278, గురుగ్రామ్‌లో 266, ఫరీదాబాద్‌లో 105గా నమోదైంది.
ఎయిర్ క్వాలిటీ అండ్ వెదర్ ఫోర్‌కాస్టింగ్ అండ్ రిసెర్చ్ నివేదిక ప్రకారం గాలి నాణ్యత 447కి పడిపోవడాన్ని తీవ్ర వాయు కాలుష్యంగా పరిగణిస్తారు. ఏక్యూఐ 0-100 మధ్య ఉంటే గాలి నాణ్యత బాగా ఉండి, కాలుష్యం లేదని అర్థం. ఏక్యూఐ 100-200 మధ్య ఉంటే గాలి నాణ్యత మధ్యస్తంగా ఉందని భావిస్తారు. ఏక్యూఐ 200-300 మధ్య ఉంటే గాలి నాణ్యత అధ్వాన్నంగా ఉందని చెప్పొచ్చు. ఏక్యూఐ 300-400 మధ్య ఉంటే గాలి నాణ్యత మరింత అధ్వాన్నంగా ఉందని, ఏక్యూఐ 400-500 మధ్య ఉంటే కాలుష్యం తీవ్ర స్థాయిలో ఉందని తేల్చేయొచ్చు
