క్షణానికోసారి కండువాలు మార్చే
రాజకీయ గోడ మీది పిల్లుల్ని చూసి..
ఊసరవెల్లి ‘ఛీ’ అంటూ సిగ్గుపడుతుంది !
పేదల రక్తాన్ని లంచాల రూపంలో..
టేబుల్ పై నుంచే పీల్చేస్తుంది అక్రమార్కుల..
నీచ ప్రవృత్తిని చూసి జలగ తలదించుతోంది !
నమ్మించి గొంతులు తెగ నరికే..
నరక రూప మనుషుల్ని చూసి..
కత్తులు సహితం గాబరా పడుతున్నాయి !
అబలను చూసి సొంగ కార్చే..
మృగాళ్ల రోత చేతలను చూసి..
వన్యమృగాలు ‘తూ తూ’ అంటున్నాయి !
కష్టపడి ఎదిగే మిత్రుడి కాళ్లను..
వెనక్కిలాగే హిత శత్రువులను చూసి..
ఎండ్రికిచ్చలు ఎగతాళి చేస్తున్నాయి !
గడ్డి తిని అమాయకంగా నటించే..
అమానవీయ నర పోకడల్ని చూసి..
మన్ను తినే మంజరగున్నల మతి పోతోంది !
ఆకులు నాకేటోని మూతులు నాకేటోడిని..
అడుక్కుతినే జన దుర్బుద్ధిని చూసి..
గుంట నక్కలు కూడా గుబులు పడుతున్నాయి !
దురాశ బురదలో బొర్లుతూ..
అశుద్ధాన్ని ఆస్వాదిస్తున్న మానవులను చూసి..
పందులు కూడా పరేషాన్ అవుతున్నాయి !
