- రౌడీ షీట్ ఓపెన్ చేసిన పోలీసులు
కరీంనగర్:- పలు కేసుల్లో నిందితుడైన రౌడీ షీటర్ పోలీసులకు చిక్కకుండా తప్పించుకుని తిరుగుతున్నాడు. అతని కోసం గాలించిన పోలీసులు అదుపులోకి తీసుకోని కోర్టులో హాజరు పరిచారు. కరీంనగర్ రూరల్ సీఐ ఏ నిరంజన్ రెడ్డి కథనం ప్రకారం… కరీంనగర్ కు చెందిన నితిన్ వర్దన్ అనే వ్యక్తి గత కొంతకాలంగా పోలీసులకు చిక్కకుండా తప్పించుకుంటున్నాడు. కరీంనగర్ 2, 3, రూరల్ పోలీస్ స్టేషన్ లలో పలు కేసులు నమోదయినప్పటికీ నితిన్ వర్దన్ మోసాలు చేయడమే పనిగా పెట్టుకున్నాడు. కరీంనగర్ రూరల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని తీగలగుట్టపల్లికి చెందిన పంబాల శ్రీనివాస్ కు కార్తికేయ నగర్ లో కొంత భూమి ఉంది.
నకిలీ వారసత్వ సర్టిఫికెట్ తయారు చేసుకున్న నితిన్ వర్దన్ పంబాల శ్రీనివాస్ కు చెందిన భూమిని కబ్జా చేయడం కానీ లేక బెదిరింపులకు పాల్పడి యజమాని నుండి డబ్బులు వసూలు చేయాలని భావించాడు. భూమి యజమాని ఇచ్చిన ఫిర్యాదు మేరకు నితిన్ వర్దన్ తో పాటు మరో ముగ్గురిపై క్రిమినల్ కేసు నమోదు అయింది. మరో కేసులో ఫిర్యాదిదారుని వద్ద నుండి డబ్బులు తీసుకుని భూమి రిజిస్ట్రేషన్ చేస్తానని మోసం చేశాడు. ఇప్పటికే రౌడీషీట్ ఓపెన్ చేసిన నితిన్ వర్దన్ పై 2024 సంవత్సరంలో గొడవలకు సంబంధించిన రెండు కేసులు నమోదయ్యాయి. ఆయా కేసుల్లో పోలీసులకు చిక్కకుండా తప్పించుకుని తిరుగుతున్న నితిన్ వర్దన్ ను శుక్రవారం కరీంనగర్ రూరల్ పోలీసులు చాకచక్యంగా పట్టుకున్నారు. సదరు నిందితున్ని కోర్టులో హాజరు పరిచామని, అతనికి జ్యుడిషియల్ రిమాండ్ విధిస్తూ కోర్టు ఆదేశాలు ఇచ్చిందని సీఐ నిరంజన్ రెడ్డి తెలిపారు.
