- ఎన్ ఐ టి మాజీ ప్రొఫెసర్, శాస్త్రవేత్త డా.రామచంద్రయ్య
పీరియాడిక్ టేబుల్ రసాయన శాస్త్రాన్ని అర్థం చేసుకునే పునాదిగా నిలుస్తుందని ఎన్ ఐ టి ప్రొఫెసర్, ప్రముఖ శాస్త్రవేత్త డా.రామచంద్రయ్య అన్నారు. డా.దిమిత్రి ఇవానోవిచ్ మెండలీవ్ జయంతి సందర్భంగా శనివారం జన విజ్ఞాన వేదిక ఆధ్వర్యంలో కీసర మండలం నాగారం ప్రభుత్వ పాఠశాలలో, బండ్లగూడ లోని వి ఎం ఆర్ పాఠశాలలో అవగాహన కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు.
పీరియాడిక్ టేబుల్ అనేది కేవలం మూలకాల జాబితా మాత్రమే కాదని, రసాయన శాస్త్రాన్ని అర్థం చేసుకునే పునాదిగా నిలుస్తుందని తెలిపారు. మూలకాల లక్షణాలు, వాటి పరస్పర సంబంధాలు తెలుసుకోవడంలో పీరియాడిక్ టేబుల్ కీలక పాత్ర పోషిస్తుందని వివరించారు. ఫిబ్రవరి నెలను సైన్స్ దినోత్సవాల నెలగా నిర్వహించడం ద్వారా విద్యార్థుల్లో శాస్త్రీయ దృక్పథం పెంపొందుతుందని, ఇలాంటి అవగాహన కార్యక్రమాలు భవిష్యత్తులో పరిశోధనల వైపు విద్యార్థులను ప్రోత్సహిస్తాయని ఆయన పేర్కొన్నారు.
ఈ సందర్భంగా జన విజ్ఞాన వేదిక రాష్ట్ర ఉపాధ్యక్షులు శ్రీనివాస్ మాట్లాడుతూ.. సమాజంలో శాస్త్రీయ ఆలోచనా విధానం పెంపొందించడమే జన విజ్ఞాన వేదిక ప్రధాన లక్ష్యమని అన్నారు. పాఠ్యపుస్తకాలకు పరిమితం కాకుండా, ప్రయోగాలు, అవగాహన కార్యక్రమాల ద్వారా విజ్ఞాన శాస్త్రం విద్యార్థులకు చేరువ చేయాల్సిన అవసరం ఉందని తెలిపారు. విద్యార్థుల్లో ఆసక్తి పెంచేందుకు జన విజ్ఞాన వేదిక నిరంతరం ఇలాంటి కార్యక్రమాలు నిర్వహిస్తుందని స్పష్టం చేశారు.
పాఠశాల ఉపాధ్యాయులు మాట్లాడుతూ.. నిపుణుల ద్వారా పీరియాడిక్ టేబుల్ వంటి మౌలిక శాస్త్రీయ అంశాలపై జన విజ్ఞాన వేదిక నిర్వహిస్తున్న శాస్త్రీయ అవగాహన కార్యక్రమాలు విద్యార్థుల్లో నేర్చుకునే ఉత్సాహాన్ని పెంచుతతూ, అవగాహన కల్పించడం ఎంతో ఉపయోగకరమన్నారు. ఇంకా ఈ కార్యక్రమంలో విఎంఆర్ పాఠశాల ప్రిన్సిపాల్ సుజాత రెడ్డి, నాగారం ప్రభుత్వ పాఠశాల ఉపాధ్యాయులు, కీసర మండలం జన వేదిక నాయకులు శేషగిరిరావు, శశిధర్ రెడ్డి, నరసింహ తదితరులు పాల్గొన్నారు.
