యాదాద్రి భువనగిరి జిల్లా పెంచికల్ పహాడ్ లో నాలుగేళ్ల చిన్నారి బాలికపై జరిగిన అత్యాచార ఘటన సభ్య సమాజాన్ని తలదించుకునేలా ఉందని ప్రజా సంఘాలు తీవ్రంగా ఖండించాయి. ఐదు రోజుల కిందట జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి రావడంతో మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా జవహర్ నగర్ జిహెచ్ఎంసి పరిధి బాలాజీ నగర్ లో ప్రజా సంఘాల సమావేశం నిర్వహించారు.
ఈ సమావేశంలో ఇఫ్టూ జాతీయ కన్వీనర్ షేక్ షావలి, పిఓడభ్ల్యూ విముక్తి రాష్ట్ర కన్వీనర్ పెర్క సునీత, తెలంగాణ కళాకారుల వేదిక రాష్ట్ర నాయకులు తుమ్మ రాణి, టియుజేఏసి మహిళా విభాగం రాష్ట్ర నాయకులు సన్వాల సుచరిత సంయుక్తంగా పత్రిక ప్రకటన విడుదల చేశారు. పెంచికల్ పహాడ్ కు చెందిన గ్రామ పెద్దమనిషిగా స్థానికంగా పేరున్న 60 సంవత్సరాల వ్యక్తి ఇలాంటి అమానుష ఘాతుకానికి పాల్పడటం ప్రజలను కలచివేసిందని పేర్కొన్నారు. ఇలాంటి నేరాలపై ప్రభుత్వం, పోలీసులు కఠినంగా వ్యవహరించాలని డిమాండ్ చేశారు.
బాధిత చిన్నారి కుటుంబాన్ని ఆదుకునేందుకు జిల్లా ప్రభుత్వ అధికారులు యుద్ధ ప్రాతిపదికన చర్యలు తీసుకోవాలని కోరారు. ఆర్థిక సహాయం, విద్యా సహాయం, వైద్య సదుపాయాలు, డబుల్ బెడ్ రూం ఇల్లు, మూడెకరాల ప్రభుత్వ భూమి వంటి చేయూతలు అందేలా చూడాలని విజ్ఞప్తి చేశారు. చాక్లెట్స్, బిస్కెట్లు, ఆట వస్తువుల ఆశ చూపి ముక్కుపచ్చలారని పసిపిల్లలపై జరుగుతున్న దురాగతాలు మానవత్వానికి మాయని మచ్చలని వ్యాఖ్యానించారు.
చావు బ్రతుకుల మధ్య ఉన్న చిన్నారి పరిస్థితిని వెలుగులోకి తీసుకువచ్చి సకాలంలో వైద్యం అందేలా బాధిత కుటుంబానికి మనోధైర్యం కల్పించిన తెలంగాణ ఉద్యమ మహిళా విభాగం నాయకురాలు బాకారం లావణ్యకు ప్రత్యేక అభినందనలు తెలిపారు.

