పంచాయతీ కార్యదర్శులకు వరంగల్ జిల్లా పంచాయతీ అధికారి కల్పన ఆదేశం
వరంగల్ జిల్లా పర్వతగిరి మండల పరిషత్(Parvatagiri Mandal Parishad) సమావేశ మందిరంలో స్థానిక ఎంపీవో శేషు ఆధ్వర్యంలో పంచాయతీ కార్యదర్శుల(Panchayat Secretaries)తో సమీక్షా సమావేశం(Review Meeting) నిర్వహించారు. ఈ సమావేశంలో జిల్లా పంచాయతీ అధికారి కల్పన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. గ్రామ పంచాయతీల ప్రధాన ఆదాయ వనరులు, ప్రాథమిక విధి అయిన ఇంటి పన్నులు, నల్లా పన్నుల వసూలులో పంచాయతీ కార్యదర్శులు అలసత్వం వహించొద్దని సూచించారు.
ఫిబ్రవరి 15 లోపు 100% పన్నులు వసూలు చేయాలని ఆదేశించారు. గ్రామాల్లో పారిశుధ్యం, నీటి సరఫరా, వీధి లైట్ల నిర్వహణ సక్రమంగా చేయాలని, నూతనంగా ఎన్నికైన సర్పంచ్, వార్డ్ సభ్యులకు చట్ట పరిధికి లోబడి తగు సలహాలు ఇస్తూ గ్రామాభివృద్ధికి కృషి చేయాలని చెప్పారు. పంచాయతీ కార్యదర్శులకు విధుల నిర్వహణలో, పన్నుల వసూలులో స్నేహపూర్వక పోటీతత్వం ఉండాలని చిన్న, పెద్ద గ్రామ పంచాయతీ అనే తేడా లేకుండా సకాలంలో వసూలు చేయాలని సూచించారు.
ముగ్గురికి సన్మానం
ఎంపీవో ఇచ్చిన 85% ఇంటి పన్నులు, నల్లా పన్నుల వసూలు టార్గెట్‌ను పూర్తి చేసిన అనంతారం, సీకే తండా, గుగులోత్ తండా గ్రామాల పంచాయతీ కార్యదర్శులను సన్మానించారు. ఎంపీవో శేషు సొంతగా బహుమతులు తెచ్చి డీపీవో చేతుల మీదుగా ఇప్పించి సత్కరించారు. ఈ సందర్బంగా అందరు తమ అధికారిక పనుల్లో ఎవరికివారు పోటీపడుతూ గుర్తింపు తెచ్చుకోవాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో మండల పరిధిలోని అన్ని గ్రామాల పంచాయతీ కార్యదర్శులు పాల్గొన్నారు.
