Tuesday, October 28, 2025
ePaper
Homeఆరోగ్యంBrain Stroke | పక్షవాతం.. సత్వర వైద్యం కీలకం..

Brain Stroke | పక్షవాతం.. సత్వర వైద్యం కీలకం..

గుండే (Heart) కాదు.. మెదడు (Brain) కూడా పోటుకు గురవుతుంది. మారుతున్న జీవనశైలి(Life Style), ఒత్తిడి(Stress), జన్యుపరమైన (Genetic) కారణాలతో చిన్న వయసులో బ్రెయిన్ స్ట్రోక్ అనేది చాలా తీవ్రమైన అనారోగ్య సమస్యగా పరిణమించింది. ప్రపంచ ఆరోగ్య సంస్థ(World Health Organisation) ప్రకారం ప్రతి నలుగురిలో ఒక్కరు తమ జీవిత కాలంలో స్ట్రోక్ బారిన పడుతున్నారు. సకాలంలో గుర్తించి, చికిత్స చేయడం ద్వారా స్ట్రోక్‌ను నివారించవచ్చు. అయితే, దీనిపై ప్రజలకు అవగాహన లేకపోవడంతో.. అనేక మంది బ్రెయిన్ స్ట్రోక్‌కు గురై ప్రాణాలు సైతం కోల్పోతున్నారు. ఒకప్పుడు 60-70 ఏళ్ల వయసులో ఈ సమస్య కనిపించేది.. బాధితుల్లో 30-45 ఏళ్ల మధ్య వయసున్నవారు 15 శాతం వరకు ఉంటున్నారని అధ్యయనాలు చెబుతున్నాయి.

అక్టోబరు 29న ప్రపంచ బ్రెయిన్ స్ట్రోక్ డే (World Brain Stroke Day) సందర్బంగా బ్రెయిన్ స్ట్రోక్‌ రాకుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? బ్రెయిన్ స్ట్రోక్ లక్షణాలను ఎలా గుర్తించాలి? ఒకవేళ స్ట్రోక్ వస్తే ఎలాంటి చర్యలు తీసుకోవాలి? అనే కీలక వివరాలను రెనోవా సెంచరీ హాస్పిటల్స్, సీనియర్ కన్సల్టెంట్ & హెడ్, డిపార్ట్‌మెంట్ ఆఫ్ న్యూరాలజీ, డా. వై.మురళీధర్ రెడ్డి మాటల్లో…

బ్రెయిన్ స్ట్రోక్ అంటే ఏమిటి?

మస్తిష్క రక్తనాళాల్లో ఏర్పడే వైఫల్యం కారణంగా బ్రెయిన్ స్ట్రోక్ సంభవిస్తుంది. రక్తం గడ్డకట్టడం ద్వారా రక్తనాళాలు పూర్తిగా లేదా పాక్షికంగా మూసుకుపోయి, మెదడుకు రక్త సరఫరా సక్రమంగా జరగకపోవడం స్ట్రోక్ కు కారణమవుతోంది. దీనివల్ల మెదడు కణాలు మరణించి, శాశ్వత వైకల్యం లేదా మరణం సంభవించవచ్చు.

స్ట్రోక్‌కు ప్రధాన కారణాలు:

  • అధిక రక్తపోటు (హైపర్‌టెన్షన్)
  • మధుమేహం (రక్తంలో అధిక చక్కెర స్థాయిలు)
  • పొగ తాగడం, మద్యం సేవించడం
  • స్థూలకాయం, అనారోగ్యకరమైన జీవన విధానం

స్ట్రోక్ లక్షణాలను గుర్తించడం

BE FAST:
B – Balance (పట్టు): ఒక్కసారిగా మైకం రావడం లేదా పట్టు తప్పి పోవడం
E – Eyes (కళ్లు) : అకస్మాత్తుగా చూపు పోవడం లేదా మసకబారడం
F – Face (ముఖం): ముఖం ఒకవైపునకు జారిపోవడం
A – Arm (చెయ్యి) : అవయవాలు బలహీనపడటం లేదా మొద్దుబారిపోవడం
S – Speech (మాట): మాట్లాడేందుకు కష్టపడటం లేదా మాట అస్పష్టంగా ఉండటం
T – Time (సమయం): తక్షణం ఆసుపత్రికి వెళ్లాలి – తొలి 4.5 గంటలు చాలా కీలకం

నిర్ధారణ:

బ్రెయిన్ స్ట్రోక్‌ను నిర్ధారించడానికి, వైద్యులు మీ ఆరోగ్య చరిత్ర, శారీరక పరీక్ష తో పాటు CT స్కాన్, MRI, రక్త పరీక్షలు, ఎలక్ట్రోకార్డియోగ్రామ్ (EKG), కరోటిడ్ అల్ట్రాసౌండ్, మరియు సెరెబ్రల్ యాంజియోగ్రామ్ వంటి అనేక పరీక్షలు చేస్తారు. ముఖ్యంగా CT స్కాన్ లేదా MRI స్కాన్ వంటి ఇమేజింగ్ పరీక్షలను ఉపయోగిస్తారు. ఈ పరీక్షలు మెదడులో రక్తస్రావం జరిగిందా లేదా మెదడు కణజాలానికి నష్టం జరిగిందా అని తెలుపుతాయి.

రకాలు:

రక్తనాళంలో అడ్డంకి ఏర్పడితే ‘ఇస్ఖిమిక్‌ స్ట్రోక్‌’, రక్తనాళం చిట్లిపోతే ‘హెమరేజిక్‌ స్ట్రోక్‌’… ఇలా రెండు రకాల బ్రెయిన్‌ స్ట్రోక్స్‌ ఉంటాయి. అయితే రెండు స్ట్రోక్స్‌ లక్షణాలు ఒకేలా ఉంటాయి. కొన్ని సందర్భాల్లో హెమరేజిక్‌ స్ట్రోక్‌లో మూర్ఛలు కూడా రావచ్చు. తలనొప్పి, వాంతులు కూడా ఉండవచ్చు.

ఎవరికి, ఎందుకు?

రెండు రకాల బ్రెయిన్‌ స్ట్రోక్స్‌కు వయసుతో సంబంధం లేదు. అయితే 50 ఏళ్లు పైబడిన వాళ్లలో మధుమేహం, అధిక రక్తపోటు సమస్యల ఉంటాయి కాబట్టి వాళ్లు బ్రెయిన్‌ స్ట్రోక్‌కు గురయ్యే అవకాశాలు ఎక్కువ. అలాగే పెద్ద వయసులో రక్తనాళాల పటుత్వం తగ్గడం, ధూమపానం, మద్యపానం అలవాట్ల తోడవడం వల్ల కూడా ఈ సమస్య తలెత్తే అవకాశాలుంటాయి. ఇక పిల్లల్లో సికిల్‌ సెల్‌ అనీమియా, పుట్టుకతో రక్తనాళాలు బలహీనండా ఉండడం వల్ల, తలకు దెబ్బలు తగలడం వల్ల అరుదుగా కొందరు పిల్లలు కూడా బ్రెయిన్‌ స్ట్రోక్‌కు గురవుతూ ఉంటారు. ఇటీవలి కాలంలో మద్యపానం, ధూమపానం, డ్రగ్స్‌, సెడెంటరీ లైఫ్‌ స్టైల్‌, వ్యక్తిగత, వృత్తిగత ఒత్తిడులు, ఒబేసిటీల కారణంగా, మధ్య వయస్కుల్లో (32 నుంచి 50) కూడా బ్రెయిన్‌ స్ట్రోక్స్‌ పెరుగుతున్నాయి.

సమయమే కీలకం

చికిత్స ఒక సెకను పాటు వృధా అయినా, మెదడులో 19 లక్షల న్యూరాన్లు డ్యామేజ్‌ అయిపోతూ ఉంటాయి. కాబట్టి సమస్యను ఎంత త్వరగా నిర్ధారించి, చికిత్స అందిస్తే, మరింత నష్టం జరగకుండా అక్కడితే నియంత్రించ గలుగుతాం. ఇస్ఖిమిక్‌ స్ట్రోక్‌ విషయంలో తక్షణ చికిత్స ఎంతో కీలకం. లక్షణాలు తలెత్తిన నాలుగున్నర గంటల్లోగా బ్రెయిన్‌ స్కాన్‌ చేసి, రక్తపు గడ్డను గుర్తిస్తే, థ్రాంబోలైటిక్‌ ఇంజెక్షన్‌ ఇచ్చి, అంతటితో నష్టానికి అడ్డుకట్ట వేయవచ్చు. కొన్ని రక్తనాళాల్లో ఏర్పడే రక్తపు గడ్డలను థ్రోంబెక్టమీ చికిత్స ద్వారా ఆరు గంటల్లోపు తొలగించవచ్చు. కొన్ని ప్రత్యేకమైన సందర్భాల్లో 24 గంటల్లోగా చికిత్స అందించి పరిస్థితిని అదుపులోకి తీసుకురావచ్చు. అయితే ఈ చికిత్సలన్నీ స్ట్రోక్‌ వల్ల మెదడుకు జరిగిన నష్టాన్ని నివారించడానికి కాకుండా, మరింత నష్టం జరగకుండా నిలువరించడానికి మాత్రమే పనికొస్తాయి. థ్రోంబెక్టమీ చికిత్సలో గుండెకు యాంజియోగ్రామ్‌ చేసిన విధానాన్నే అనుసరిస్తారు. ఇక హెమరేజిక్‌ స్ట్రోక్‌కు ప్రధానంగా అధిక రక్తపోటే కారణమవుతూ ఉంటుంది. ఇలాంటి సందర్భాల్లో సూక్ష్మ రక్తనాళాలు చిట్లిపోతూ ఉంటాయి. ఇలాంటి సందర్భాల్లో మెదడు లో వాపు పెరగకుండా జాగ్రత్తలు తీసుకోవడంతో పాటు, రక్తపోటు ను అదుపు చేయవలసి ఉంటుంది. అయితే బ్రెయిన్‌ స్ట్రోక్‌ విషయంలో సమయం కీలకం.

తదనంతర చికిత్స ఇలా…

స్ట్రోక్‌ వచ్చిన కారణం మీద చికిత్స తదనంతర మందులు ఆధారపడి ఉంటాయి. ఫిజియోథెరపీతో పాటు, యాంటీ ప్లేట్‌లెట్లు, యాంటీ కాగ్యులెంట్లు, స్టాటిన్లు తీసుకోవాల్సి ఉంటుంది. ఒకసారి బ్రెయిన్‌ స్ట్రోక్‌ గురైన వాళ్లు మరొక స్ట్రోక్‌ను నివారించడం కోసం జీవితాంతం మందులు వాడక తప్పదు. అయితే మందుల మోతాదు ను వైద్యులు క్రమేపీ మారుస్తూ ఉంటారు. ఈ మందులతో పాటు మధుమేహం, అధిక రక్తపోటులను కూడా అదుపులో ఉంచుకోవాలి. గుండె సమస్యలను అదుపులో ఉంచుకోవడం, దురలవాట్లకు దూరంగా ఉండడం చేయాలి. పిండిపదార్థాలకు బదులుగా, పీచు, ప్రొటీన్‌ ఎక్కువగా ఉండే ఆహారం ఎక్కువగా తీసుకోవాలి.

సాధారణంగా మందులతో సమస్య సరిదిద్దుకోవచ్చు అనుకుంటారు. కానీ బ్రెయిన్‌ స్ట్రోక్‌లో ఇది అసాధ్యం. బ్రెయిన్‌ స్ట్రోక్‌ మూలంగా పక్షవాతం, మాటల్లో తేడా, అవయవాల్లో బలహీనతలు మందులతో మెరుగు పడవు. మందులతో రెండోసారి స్ట్రోక్‌ రాకుండా మాత్రమే నియంత్రించవచ్చు. అప్పటికే తలెత్తిన లక్షణాలను మెరుగు పరుచుకోవడం కోసం, ఫిజియోథెరపీ, స్పీచ్‌ థెరపీలను అనుసరించాలి.

నివారణ:

90% బ్రెయిన్‌ స్ట్రోక్స్‌ నివారించదగినవే! క్రమం తప్పకుండా రక్తపోటు, మధుమేహాలను పరీక్షించుకుంటూ, వాటిని మందులతో అదుపులో ఉంచుకోవడం, సమతులాహారం తీసుకోవడం, రోజుకు 30 నిమిషాల చొప్పున వారంలో ఐదు రోజుల పాటు వ్యాయామం చేయడం, మద్యపానం, ధూమపానం లాంటి దురలవాట్లకు దూరంగా ఉండడం, ఒత్తిడికి దూరంగా ఉండడం ద్వారా బ్రెయిన్‌ స్ట్రోక్‌ను నివారించుకోవచ్చు.

డా. వై.మురళీధర్ రెడ్డి
సీనియర్ కన్సల్టెంట్ & హెడ్, డిపార్ట్‌మెంట్ ఆఫ్ న్యూరాలజీ
రెనోవా సెంచరీ హాస్పిటల్స్
బంజారా హిల్స్, హైదరాబాద్

RELATED ARTICLES
- Advertisment -

Latest News