Sunday, March 22, 2026
Homeఆదాబ్ ప్రత్యేకంPanchayat Elections | ఓట్ల కోసం అప్పులు.. గెలిచాక తప్పులు..

Panchayat Elections | ఓట్ల కోసం అప్పులు.. గెలిచాక తప్పులు..

పంచాయతీ ఎన్నికల్లో విచ్చలవిడిగా ఖర్చులు
పొద్దున్నే టిఫిన్లు మొదలుకొని రాత్రి విందుల వరకు
ఓట్ల కోసం బీరు, బిర్యానీలు, డబ్బులు తదితరాల పంపిణీ
దీనికోసం బంగారం, ఆస్తులు తాకట్టు పెట్టాల్సిన అత్యవసర పరిస్థితి
ఎన్నికల్లో గెలిచాక ఈ రుణాల ఊబి నుంచి బయటపడేందుకు వక్ర మార్గాలు
గ్రామ పంచాయతీ నిధులను వ్యక్తిగత ప్రయోజనాలకు మళ్లించాల్సిన అగత్యం
ఈ నేపథ్యంలో పారదర్శక పాలనకు పాతర వేస్తున్న పలువురు సర్పంచ్‌లు

రాష్ట్రవ్యాప్తంగా తొలి విడత పంచాయతీ ఎన్నికల నామినేషన్ల ఉపసంహరణ(Nominations Withdraw)తో పోటీలో ఉన్న అభ్యర్థుల జాబితా ఖరారైంది. అదే సమయంలో.. ఓట్ల కోసం క్యాండేట్ల వేట మొదలైంది. ఎన్నికల పోరు కాస్తా ఖర్చుల (expenses) పోరుగా మారింది. దీంతో.. గ్రామాల్లో ప్రత్యేక క్యాంప్‌ల(Special Camps)ను ఏర్పాటుచేయాల్సి వస్తోంది. ఉదయం టీలు, టిఫిన్ల దగ్గర నుంచి మొదలుపెడితే.. అర్ధరాత్రి బీరు, బిర్యానీల వరకు ఖర్చు తడిసి మోపెడవుతోంది. విందులు(dinners), మందు (Liquor) పార్టీలతో ఎన్నికల ఖర్చు క్షణక్షణం పెరుగుతోంది. ప్రారంభంలో తక్కువ ఖర్చే అవుతున్నా.. అవతలి అభ్యర్థిపై పైచేయి సాధించేందుకు ఇరుపక్షాలూ ఇబ్బందులను కోరితెచ్చుకుంటున్నారు. ఒక్క అభ్యర్థి విందులు పెడితే మిగతావాళ్లూ అదే రీతిలో వ్యవహరించక తప్పదని భావించడం వల్లే అసలు సమస్య మొదలవుతోంది.

- Advertisement -

తగ్గేదేలా..

గ్రామాల్లో ఓటుకు నోటు, మందు విందు సంస్కృతి బలంగా పెరుగుతోంది. తాము వెనకపడితే ఓటరు మరో వైపు వెళ్లిపోతాడనే భయం అభ్యర్థుల్లో నెలకొంటోంది. ఇలాంటి పరిస్థితుల్లో ఖర్చులు రెట్టింపవుతున్నాయి. ఈ ట్రెండ్ గ్రామ స్థాయిలో ఆందోళనకరంగా మారనుంది. అభ్యర్థులపై భారీ ఆర్థిక ఒత్తిడి పడుతోంది. చాలా మంది క్యాండేట్లు.. బంగారం తాకట్టు పెట్టడం, కుటుంబ పొదుపులు ఖర్చు చేయడం, స్థానికుల వద్ద అప్పులు తీసుకోవడం వంటివి చేస్తున్నారు. ఎన్నికల్లో గెలిచిన తర్వాత ఆ అప్పులు తీర్చుకోవాలనే ఒత్తిడితో వాళ్లు పంచాయతీ నిధులను పారదర్శకంగా వినియోగించలేని పరిణామాలు తలెత్తుతాయి.

ప్రజా పాలనకు ప్రమాదకరం

ప్రభుత్వ నిధులను వ్యక్తిగత ప్రయోజనాలకు వాడుకోవాల్సిన అత్యవసరం ఏర్పడుతుంది. ఇది ప్రజాపాలనకు ప్రమాదకరంగా మారుతుంది. ఓటర్లలో ఏర్పడుతున్న ఈ తప్పుడు, దారుణ భావన ప్రజాస్వామ్యానికి చేటు తెస్తుంది. అభ్యర్థి విందు పెడితేనే మద్దతు ఇవ్వాలి, ఎవరైతే ఎక్కువ ఖర్చు పెడతారో వారికే ఓటు వేయాలన్న అభిప్రాయం గ్రామ స్థాయిలో పెరుగుతోంది. ఇది ప్రజాస్వామ్యాన్ని కొనుగోలు శక్తిపై ఆధారపడే వ్యవస్థగా మార్చేస్తోంది. అభివృద్ధి ప్రణాళికలు, స్థానిక సమస్యలు, పంచాయతీ పనితీరు గురించి ఓటర్లు చర్చించాల్సిన అవసరమే కనిపించకపోవడం ఈ పరిస్థితిని మరింత దిగజారుస్తోంది.

విభేదాలకు దారి

ఎన్నికల్లో అడ్డూఅదుపులేని ఖర్చులు గ్రామాల్లో వర్గ విభజనకు దారితీస్తోంది. మందు, విందు క్యాంపుల్లో పాల్గొన్నవారిలో ఒక గ్రూప్‌, పాల్గొననివారిలో మరో గ్రూప్‌ అని సామాజిక భేదాలు పెరుగుతున్నాయి. అభ్యర్థులకు దగ్గరగా ఉన్నవారికి తక్షణ ప్రయోజనాలు, దూరంగా ఉన్నవారిలో అసంతృప్తి.. ఇలా గ్రామాల్లో చిన్న చిన్న విభేదాలు పెద్ద గొడవలకి దారితీయొచ్చు.

పాలనా సమస్యలపై పట్టింపేదీ?

ఎన్నికల తర్వాత వచ్చే పరిపాలనా సమస్యలను ఎవరూ పట్టించుకున్న పాపానపోవట్లేదు. ఇప్పుడు భారీగా ఖర్చు చేస్తున్న అభ్యర్థులు పంచాయతీ నిధులను అభివృద్ధి కోసం వినియోగించకుండా ముందుగా తమ ఖర్చులను రికవరీ చేసుకోవాలనే ప్రయత్నం చేస్తారు. దీని వల్ల పంచాయతీ పథకాల అమలు ఆలస్యం అవడం, పనుల నాణ్యత తగ్గిపోవడం, గ్రామంలో అభివృద్ధి నిలిచిపోవడం వంటి సమస్యలు ఏర్పడతాయి. దీనికితోడు గ్రామస్తుల ఆకాంక్షలు నెరవేరకపోవడంతో ఎంపీటీసీలు, సర్పంచ్‌ల మీద ఒత్తిడి పెరుగుతుంది.

పారదర్శకతకు పాతర

స్థానిక సుపరిపాలనలో పారదర్శకత కోల్పోవడం వల్ల దుష్పరిణామాలు చాలా ఉంటాయి. ఎన్నికల సమయంలో ఎంత ఖర్చు అయ్యిందో ఎవరూ బయటపెట్టరు. కానీ.. ఆ ఖర్చులను తిరిగి సంపాదించుకోవడానికి పంచాయతీ నిధులను పణంగా పెడతారు. ప్రభుత్వ పనుల్లో అవినీతికి తెర తీస్తారు. కాంట్రాక్టర్లతో చేసిన డీల్స్, గ్రామ స్థాయిలోని నిర్ణయాల్లో పాక్షికత, ఇవన్నీ సర్వసాధారణమైపోతాయి. ఫలితంగా పంచాయతీ కార్యవర్గం కలిసి పనిచేయకుండా ప్రతి ఒక్కరు తమ ప్రయోజనాలకే లోబడే పరిస్థితి వస్తుంది.

సామాజిక ఉద్రిక్తతలు

ఎన్నికలు పూర్తయ్యాక గ్రామాల్లో ఏర్పడే సామాజిక ఉద్రిక్తతలను కూడా పరిగణనలోకి తీసుకోవాలి. ఎన్నికల సమయంలో మందు, విందుల కోసం గ్రూపులుగా విడిపోయినవారు తర్వాత కూడా అలా వేర్వేరుగానే ఉండిపోయే ప్రమాదం ఉంటుంది. ఇది స్థానిక శాంతి భద్రతలపైన, పంచాయతీ సమావేశాలపైన ప్రభావం చూపుతుంది. చిన్న నిర్ణయాలైనా పెద్ద గొడవలకు దారితీయొచ్చు.

పరిపాలన బలహీనం

మొత్తానికి.. పంచాయతీ ఎన్నికలు ప్రజాస్వామ్యానికి ప్రతికూలంగా పరిణమిస్తున్నాయి. గ్రామాభివృద్ధికి పునాది కావాల్సిన ఎన్నికలు ప్రజలను గ్రూపులుగా విడదీస్తున్నాయి. అయితే.. ఇలా మందు, విందుల పోటీ, అవసరంలేని ఖర్చుల ఉధృతి, గ్రామాల్లో పెరుగుతున్న వర్గీయ విభేదాలు, అభ్యర్థుల్లో అప్పుల భారం, ఎన్నికల తర్వాత పెరిగే అవినీతి.. ఇవన్నీ కలిసి పంచాయతీ పరిపాలనను బలహీనపరిచే ప్రమాదం ఎక్కువగా కనిపిస్తోంది.

- Advertisement -
RELATED ARTICLES

Latest News