తిరుచానూరు(Tiruchanur)లోని శ్రీ పద్మావతి అమ్మవారి (Goddess Padmavati) పంచమి తీర్థ మహోత్సవం (Panchami Tirtha Festival) సందర్భంగా టిటిడి అన్నప్రసాద విభాగం ఆధ్వర్యంలో 1.50 లక్షల మంది భక్తుల(Devotees)కు అన్నప్రసాదాలు, అల్పాహారం (Tiffins) అందించారు. టిటిడి ఛైర్మన్ బీఆర్ నాయుడు(BR Naidu), ఈవో అనిల్ కుమార్ సింఘాల్ ఆదేశాల మేరకు టిటిడి జేఈవో వి.వీరబ్రహ్మం పర్యవేక్షణలో అన్నప్రసాద విభాగం అధికారులు ప్రతి భక్తుడికి అన్నప్రసాదాలు అందేలా ప్రత్యేక చర్యలు చేపట్టారు.
భక్తుల సౌకర్యార్థం 160 కౌంటర్లలో తోళ్లప్ప గార్డెన్స్‌లో 50, జిల్లా పరిషత్ హైస్కూల్ వద్ద 40, అయ్యప్ప స్వామి వారి ఆలయం వద్ద 50, పూడి వద్ద 20 అన్నప్రసాద కౌంటర్లలో 24వ తేదీ రాత్రి నుంచి 25వ తేదీ ఉదయం, మధ్యాహ్నం వరకు కదంబం, చక్కెర పొంగలి, దద్దోజనం, పులిహోర, ఉదయం ఉప్మా, పొంగలిని విరివిగా అందజేశారు. పంచమి తీర్థం కోసం పద్మావతీ అన్నప్రసాద కేంద్రం, శ్రీనివాసం కాంప్లెక్స్, టిటిడి పరిపాలనా భవనంలోని ఎంప్లాయిస్ క్యాంటీన్ల నుంచి 13 బాయిలర్స్ ద్వారా వంటలను తయారు చేసి హోల్డింగ్ పాయింట్లు, గ్యాలరీలు, క్యూలైన్లు, భక్తులు అధికంగా ఉండే కూడళ్ల వద్ద పంపిణీ చేశారు. వంటల్లో నాణ్యత, రుచి, శుచి మరింత మెరుగ్గా ఉండేందుకు జీడిపప్పు, నెయ్యిని అదనంగా ఉపయోగించారు.
1.25 లక్షల మందికి బాదంపాలు
పంచమి తీర్థం సందర్భంగా అన్నప్రసాదాలతోపాటు 1.25 లక్షల మందికి బాదం పాలు(Badam Milk), లక్ష మందికి బిస్కెట్ ప్యాకెట్లు, 30 వేల మందికి మజ్జిగ, 30 వేల మందికి సుండలను అందించారు. భక్తులకు సకాలంలో అన్నప్రసాదాలను అందించేందుకు 900 మంది శ్రీవారి సేవకులు, 100 మంది ఎన్.ఎస్.ఎస్. విద్యార్థులు, 200 మంది అన్నప్రసాదం సిబ్బంది, 500 మంది ఎఫ్.ఎం.ఎస్ సిబ్బంది సేవలు అందించారు.
దాదాపు 1.50 లక్షల తాగునీటి బాటిళ్ల పంపిణీ
పంచమి తీర్థం సందర్భంగా లక్షలాది మంది భక్తులకు టిటిడి ఆరోగ్య విభాగం ఆధ్వర్యంలో దాదాపు 1.50 లక్షల తాగునీటి బాటిళ్లు పంపిణీ చేశారు. ఆలయం, పుష్కరిణి పరిసరాల్లో ఎప్పటికప్పుడు చెత్తను తొలగించి పరిశుభ్రంగా ఉంచారు. భక్తుల సౌకర్యార్థం 300 శాశ్వత, తాత్కాలిక, మొబైల్ మరుగుదొడ్లు ఏర్పాటుచేశారు. బ్రహ్మోత్సవాల్లో రోజుకు 300 మంది, పంచమి తీర్థం రోజున 600 మంది పారిశుద్ధ్య సిబ్బంది సేవలందించారు. టిటిడి ఆరోగ్యశాఖ అధికారులు ఏర్పాట్లను పర్యవేక్షించారు.
