Thursday, September 11, 2025
ePaper
spot_img
Homeతెలంగాణకెటిఆర్‌కు లండన్‌ ఆహ్వానం

కెటిఆర్‌కు లండన్‌ ఆహ్వానం

ఆక్స్‌ఫర్డ్‌ ఇండియా ఫోరమ్‌ నుంచి పిలుపు

బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కె.తారక రామారావు మరో ప్రతిష్టాత్మక సమావేశానికి హాజరుకానున్నారు. జూన్‌ 20, 21 తేదీల్లో ఇంగ్లాండ్‌లో జరిగే ఆక్స్‌ఫర్డ్‌ ఇండియా ఫోరమ్‌ సదస్సుకు ముఖ్యవక్తగా పిలుస్తూ ఆ సంస్థ ప్రత్యేకంగా కేటీఆర్‌ను ఆహ్వానించింది. ’భారత అభివృద్ధికి అత్యాధునిక సాంకేతికతలు’ అనే థీమ్‌తో ఈ సంవత్సరం ఈ సదస్సును నిర్వహిస్తున్నట్టు ఆక్స్‌ ఫర్డ్‌ ఇండియా ఫోరం వ్యవస్థాపకులు సిద్ధార్థ్‌ సేఠీ తెలిపారు. కెటిఆర్‌ తన అనుభవాలను, ఆలోచనలను అంతర్జాతీయ విద్యార్థులు, వివిధ దేశాల నిపుణులతో పంచుకుంటే చర్చలు మరింత ఆసక్తికరంగా ఉంటడంతో పాటు భారతదేశ అభివృద్ధి ప్రస్థానంలో భాగం అవ్వడానికి వారందరికీ స్ఫూర్తిగా ఉంటుందని సిద్ధార్థ్‌ సేఠి ప్రత్యేకంగా ప్రస్తావించారు. ప్రపంచ సమస్యలను పరిష్కరించడంతో పాటు భారత్‌లోని స్థిరమైన అభివృద్ధికి అత్యాధునిక సాంకేతికతలు ఎలా ఉపయోగపడతాయన్న అంశంపై ఈ సదస్సులో ప్రధానంగా వక్తలు చర్చిస్తారు.

వివిధ దేశాలకు చెందిన విద్యార్థులు, అధ్యాపకులు, నిపుణుల సమక్షంలో భారతదేశ ప్రగతిపథాన్ని, తెలంగాణలో అమలు చేసిన వినూత్న విధానాలను, టెక్నాలజీ ఆధారిత అభివృద్ధి మోడల్‌ను కేటీఆర్‌ వివరించనున్నారు. ఈ సదస్సులో కేటీఆర్‌ పాల్గొంటే రాబోయే రోజుల్లో ప్రపంచంపై ఇండియా చూపే సానుకూల ప్రభావాన్ని, నాయకత్వ లక్షణాలను ప్రపంచానికి బలంగా చాటొచ్చని సిద్ధార్థ్‌ సేఠి తెలిపారు. ఈ ఆహ్వానాన్ని స్వీకరించి, సదస్సుకు రావాలని సిద్ధార్థ్‌ కోరారు. ఆక్స్‌ఫర్డ్‌ ఇండియా ఫోరమ్‌ సమావేశం యూరప్‌లో భారత్‌కు సంబంధించిన అతి పెద్ద కార్యక్రమం. భారతదేశ పురోగతి, ఆవిష్కరణలను ప్రపంచానికి చూపే వేదిక. మనదేశ అభివృద్ధి, సాంకేతిక రంగాల్లో జరుగుతున్న మార్పులు, గ్లోబల్‌ సహకార అవకాశాలపై ఈ సమావేశంలో చర్చలు జరుగనున్నాయి. భారత్‌ను ప్రపంచానికి దగ్గర చేయడం, పరిశోధన, సాంకేతికత, విధానాల్లో ఇతర దేశాల భాగస్వామ్యాన్ని పెంచడం ఈ ఫోరమ్‌ ప్రధాన లక్ష్యం.

RELATED ARTICLES
- Advertisment -

Latest News