- అవినీతిపై ఉన్నతాధికారుల ‘మౌన’ వ్రతం!
- ఫీవర్ హాస్పిటల్ దందాపై చర్యలు ఎప్పుడు?
- లక్షల వసూళ్లలో లినెన్ కీపర్ హస్తం..
- సూపరింటెండెంట్ చూసీచూడనట్లు వ్యవహారం..
- ఈనెల 8న ఆదాబ్లో కథనం ప్రచురించినా స్పందన శ్యూనం..
నల్లకుంట ఫీవర్ హాస్పిటల్లో అవుట్సోర్సింగ్ ఉద్యోగాల పేరుతో సాగుతున్న అక్రమ దందా. నిరుద్యో గులనే కాదు.. ఏళ్ల తరబడి పనిచేస్తున్న కార్మికుల జీవితాలను కూడా నలిపేస్తోంది. ఒకవైపు ఉద్యోగం దక్కాలంటే లక్షల వసూళ్లు, మరోవైపు విధుల్లో ఉన్న కార్మికులకు కనీస వేతనాలే లేని దుస్థితి. ఈపీఎఫ్, ఈఎస్ఐ వంటి భవిష్యత్తు భరోసాలు కాగితాల్లోనే మిగిలి పోతుండగా, చేతికి వచ్చే జీతం ఆకలిని కూడా తీరని వ్వని స్థితి. ఇవన్నీ అధికారుల కళ్లముందే జరుగుతున్నా, పర్యవేక్షించాల్సిన వ్యవస్థ నిమ్మకు నీరెత్తినట్లు ఉండటం.. కార్మికుల కన్నీళ్లకు, అధికారుల మౌనానికి మధ్య ఉన్న ఘోర విరోధాన్ని బట్టబయలు చేస్తోంది..
నల్లకుంటలోని ఫీవర్ హాస్పిటల్లో అవుట్సోర్సింగ్ ఉద్యోగాల విక్రయం ‘ఓపెన్ సీక్రెట’గా మారింది. గత జనవరి 8వ తేదీన ఈ అక్రమ దందా పై ఆధారాలతో సహా సంచలన కథనం వెలువడినప్పటికీ, ఉన్న తాధికారుల్లో ఉలుకూ పలుకూ లేకపోవడం గమనార్హం. లినెన్ కీపర్‌గా పని చేస్తున్న సమీ ఉద్దీన్ అనే వ్యక్తి నిరుద్యోగుల ఆశల ను పెట్టుబడిగా మార్చుకొని లక్షలు గడిస్తున్నా, హాస్పిటల్ సూప రింటెండెంట్ ఎందుకు మిన్నకుండిపోయారో అర్థం కావడం లేదు.
దందా సాగుతోందిలా.. “పోస్టుకో రేటు ` దోపిడీకి రూటు”
అవుట్‌సోర్సింగ్ నియామకాల్లో సమీ ఉద్దీన్ ఒక సమాంతర వ్యవస్థను నడుపుతున్నారనే ఆరోపణలు బలంగా ఉన్నాయి. క్లరికల్ నుంచి సెక్యూరిటీ గార్డు వరకు ప్రతి ఉద్యోగానికి ఒక ధర నిర్ణయించి, అమాయకుల నుంచి భారీగా వసూళ్లకు పాల్పడుతున్నారు. ఈ వ్యవహారం అంతా అధికారుల కళ్లముందే జరుగుతున్నా, అడ్డుకోవాల్సిన వారు ‘మామూళ్ల’ మత్తులో తూగుతున్నారా? అనే అనుమానాలు ప్రజల్లో వ్యక్తమవుతున్నాయి.
కార్మికుల కన్నీళ్లు.. అధికారుల కన్నుగాళ్లు!
ఒకవైపు కొత్త ఉద్యోగాల పేరుతో దోపిడీ జరుగుతుంటే, మరోవైపు పాత కార్మికుల బతుకులు ఛిద్రమవుతున్నాయి. విధుల్లో ఉన్న కార్మికులకు కనీస వేతనాలు కూడా అందడం లేదు. ఈపీఎఫ్, ఈఎసఐ నిధులను ఏజెన్సీలు పక్కదారి పట్టిస్తూ కార్మికుల భవిష్యత్తుతో చెలగాటమాడు తున్నాయి. మస్టర్ రోల్స్‌లో అవకతవకలు చేస్తూ, రికార్డుల్లో చూపే జీతానికి, చేతికి ఇచ్చే మొత్తానికి పొంతన లేకుండా చేస్తున్నా పర్యవేక్షించాల్సిన విభాగం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తోంది.
సూపరింటెండెంట్ మౌనం.. అవినీతికి ప్రాణం!
హాస్పిటల్‌లో ఇంత పెద్ద ఎత్తున అక్రమాలు వెలుగులోకి వచ్చినా, కనీసం ప్రాథమిక విచారణకు కూడా సూపరింటెండెంట్ ఆదేశించకపోవడం పలు అనుమానాలకు తావిస్తోంది. కింది స్థాయి సిబ్బంది ఇంతలా రెచ్చిపోతున్నారంటే వారి వెనుక పెద్దల హస్తం ఉందనే ఆరోపణలు వస్తున్నాయి. ఇప్పటికైనా వైద్య ఆరోగ్య శాఖ ఉన్నతాధికారులు స్పందించి సమగ్ర విచారణ జరపాలి. లేనిపక్షంలో ఈ ‘అవినీతి జ్వరం’ హాస్పిటల్ ప్రతిష్టను పూర్తిగా మంటగలిపే ప్రమాదం ఉంది.
