Wednesday, September 10, 2025
ePaper
spot_img
Homeజాతీయంఆన్‌లైన్‌ గేమింగ్ బిల్లుపై గందరగోళం

ఆన్‌లైన్‌ గేమింగ్ బిల్లుపై గందరగోళం

లోక్‌సభ సమావేశాలు బుధవారం ఉదయం ప్రారంభమైన కొద్దిసేపటికే తీవ్ర గందరగోళానికి గురయ్యాయి. దేశంలో వేగంగా విస్తరిస్తున్న ఆన్‌లైన్‌ గేమింగ్ రంగాన్ని నియంత్రించేందుకు కేంద్రం ప్రతిపాదించిన ‘ఆన్‌లైన్‌ గేమింగ్ ప్రమోషన్, నియంత్రణ బిల్లు–2025’ను కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ సభలో ప్రవేశపెట్టగానే ప్రతిపక్ష సభ్యులు ఆందోళనకు దిగారు. వారి నిరసనలతో సభా కార్యక్రమాలు అస్తవ్యస్తమయ్యాయి. దీంతో స్పీకర్‌ మధ్యాహ్నం 2 గంటల వరకు సభను వాయిదా వేశారు. ప్రతిపక్షాల తీరుపై కేంద్ర మంత్రి కిరణ్‌ రిజిజు తీవ్రంగా స్పందించారు. “పార్లమెంటులో జరుగుతున్న దృశ్యాలను చూసి పాఠశాల పిల్లలు కూడా ప్రశ్నించే పరిస్థితి వచ్చింది. అంతరిక్ష రంగంలో సాధించిన విజయాలపై చర్చించేందుకు కూడా ప్రతిపక్షాలు అవకాశం ఇవ్వడం లేదు. ప్రజలంతా గమనిస్తున్నారు” అని వ్యాఖ్యానించారు. సభ్యులు బాధ్యతాయుతంగా వ్యవహరించాలని ఆయన కోరారు.

ఈ బిల్లుతో ఆన్‌లైన్‌ గేమింగ్ రంగాన్ని ఒకే గొడుగు కిందకు తెచ్చి నియంత్రించడమే కాకుండా, ప్రత్యేక జాతీయ అథారిటీని ఏర్పాటు చేయాలని ప్రతిపాదించారు. ఈ-స్పోర్ట్స్‌, ఎడ్యుకేషనల్‌ గేమ్స్‌, సోషల్‌ గేమింగ్ వంటి విభాగాలన్నీ దాని పరిధిలోకి వస్తాయి. ముఖ్యంగా రాష్ట్రాల సరిహద్దులు దాటి లేదా విదేశాల నుంచి నిర్వహించే డబ్బుతో కూడిన ఆన్‌లైన్‌ గేమ్‌లను పూర్తిగా నిషేధించాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. యువతలో వ్యసనాలు, మోసాలు, వ్యక్తిగత డేటా దుర్వినియోగం వంటి సమస్యలను అరికట్టడంతో పాటు ఆర్థిక వ్యవస్థ, జాతీయ సార్వభౌమత్వ పరిరక్షణకు ఈ చట్టం దోహదం చేస్తుందని ప్రభుత్వం స్పష్టం చేసింది.

RELATED ARTICLES
- Advertisment -

Latest News