ఎన్టీఆర్ 30వ వర్ధంతి(Vardhanthi) సందర్భంగా టీడీపీ అధినేత(Tdp Chief), ఏపీ సీఎం(Ap CM) చంద్రబాబు(Chandrababu) ఘనంగా నివాళులు(Tributes) అర్పించారు. తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో ఆదివారం నిర్వహించిన కార్యక్రమంలో ఆయన పాల్గొని ప్రసంగించారు. ఎన్టీఆర్ మనకు దూరమై 30 ఏళ్లు అవుతున్నా తెలుగు జాతి గుండెల్లో శాశ్వతంగా ఉండే నాయకుడు ఎన్టీఆర్ అని అన్నారు. పార్టీ పెట్టిన 9 నెలల్లోనే అధికారంలోకి వచ్చిన ఏకైక పార్టీ తెలుగుదేశం పార్టీ అని చెప్పారు. సుపరిపాలనకు అర్థం చెప్పిన వ్యక్తి ఎన్టీఆర్ అని పేర్కొన్నారు. సంక్షేమం, అభివృద్ధి, అందరికి న్యాయం ఆయన సిద్ధాంతాలని వివరించారు.
చంద్రబాబు ఇంకా ఏమన్నారంటే..
‘కారణజన్ముడు, యుగ పురుషుడు, పేదల పెన్నిధి, అన్న నందమూరి తారక రామారావు. ఆ మహనీయుడి 30వ వర్ధంతి సందర్భంగా ఘన నివాళి అర్పిస్తున్నాను. సినీ వినీలాకాశంలో ధృవతారగా వెలిగి, రాజకీయ కురుక్షేత్రంలో అజేయుడైన అన్న ఎన్టీఆర్.. తరతరాల చరిత్రను తిరగరాసిన ధీరోదాత్తుడు. తెలుగువారి ఆత్మగౌరవాన్ని ఆకాశమంత ఎత్తులో నిలబెట్టేందుకు పోరాటం చేసిన ఆయన మనందరికీ ప్రాతఃస్మరణీయుడు. కిలో రెండు రూపాయల బియ్యం, సామాజిక భద్రతా పింఛన్లు, పక్కా ఇళ్ల నిర్మాణం, రైతుకు విద్యుత్, మండల వ్యవస్థతో స్థానిక స్వపరిపాలన, ఆడబిడ్డలకు ఆస్తిలో హక్కు, రాయలసీమకు సాగు, తాగునీటి ప్రాజెక్టులు లాంటి అనితర సాధ్యమైన సంక్షేమ అభివృద్ధి పథకాలతో చరిత్ర గతిని మార్చిన ఆ మహనీయుడు మనకు ఆదర్శం. ఆయన వేసిన బాట అనుసరణీయం. మరొక్కమారు ఆయనకు స్మృత్యంజలి ఘటిస్తున్నాను’ అని పేర్కొన్నారు.

