రిసార్ట్ నిర్వహణపై ఆరోపణలు
అనంత పేరు పెట్టి..
అసాంఘిక కార్యకలాపాలకు అడ్డా..
ప్రభుత్వ ఆదాయానికి గండి!
వికారాబాద్, ఆదాబ్ హైదరాబాద్: వికారాబాద్ జిల్లా కేంద్రానికి కొద్ది దూరంలో అనంత(Anantha) పేరుతో అనుమతులు నామమాత్రంగా తీసుకొని రిసార్ట్(Resort) వెలిసింది. అందులో ఎక్కడ తొంగిచూసినా అక్రమ దందాలే కనబడతాయి. అనంతగిరి ప్రాంతంలో గొట్టిముక్కల గ్రామ పంచాయతీ (Gottimukkala Gram Panchayat) రెవెన్యూ పరిధిలో గ్రామ పంచాయతీ నుంచి కమర్షియల్ పర్మిషన్(Commerical Permission) తీసుకోకుండా కేవలం రెసిడెన్షియల్ అనుమతి(Residential Permission)తోనే రిసార్ట్ నిర్వహిస్తున్నారని ఓ రిసార్ట్ యజమానిపై తీవ్ర ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.
ఈ విధంగా అక్రమంగా రిసార్ట్ నడిపిస్తూ ప్రభుత్వానికి రావాల్సిన ఆదాయానికి భారీ గండి కొడుతున్నారు. ఈ మేరకు స్థానికుల నుంచి పలు సంఘాలు విమర్శిస్తున్నాయి. నిబంధనల ప్రకారం కమర్షియల్ కార్యకలాపాలకు ప్రత్యేక అనుమతులు, పన్నులు, లైసెన్సులు తప్పనిసరి కాగా అవేమీ లేకుండానే రిసార్ట్ నిర్వహిస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. రెసిడెన్షియల్ పర్మిషన్ తీసుకొని వాణిజ్య ప్రయోజనాల కోసం వినియోగించడం చట్టవిరుద్ధమని తెలిసి కూడా ఎవరేం చేస్తారులే అనే స్వేచ్ఛతో జిల్లా స్థాయి అధికారులతో బేరం కుదుర్చుకొని ఇలాంటి రిసార్టు నడిపిస్తున్నారని ఆరోపణలు వినిపిస్తున్నాయి.
ఇదే సమయంలో ఈ వ్యవహారంపై జిల్లా అధికారులు కళ్లు మూసుకున్నట్లుగా వ్యవహరిస్తున్నారనే విమర్శలు కూడా వినిపిస్తున్నాయి. అక్రమ నిర్మాణాలు, అనుమతుల ఉల్లంఘనలపై చర్యలు తీసుకోవాల్సిన అధికారులు మౌనం పాటించడం వెనక ఏమైనా రాజకీయపరమైన బడా నాయకులతో ఒత్తిళ్లు ఉండొచ్చనే విమర్శలు వినిపిస్తున్నాయి. గ్రామస్తులు మాట్లాడుతూ ఇలాంటి అక్రమ రిసార్ట్ వల్ల పర్యావరణానికి నష్టం, శాంతిభద్రతలకు భంగం కలుగుతోందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
వెంటనే అధికారులు స్పందించి రిసార్ట్‌కి ఉన్న అనుమతులను పరిశీలించి, అక్రమాలపై కఠిన చర్యలు తీసుకోవాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. ఇప్పటికైనా జిల్లా యంత్రాంగం స్పందించి అక్రమ రిసార్ట్ నిర్వహణపై విచారణ చేపడుతుందా? లేక, విమర్శలు కాగితాలకే పరిమితమవుతాయా? అనే విషయం తేలాల్సి ఉంది.
