హైదరాబాద్‌లోని కేఎల్ హెచ్ అజీజ్ నగర్ క్యాంపస్ వేదికగా సెప్టెంబర్ 16 నుంచి 18 వరకు జరగబోయే ఐఈఈఈ అంతర్జాతీయ సదస్సు “నెక్స్ట్ జెన్ టెక్నాలజీస్ ఆఫ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ జియో సైన్స్ రిమోట్ సెన్సింగ్ ఎర్త్ సెన్స్ 2025” మంగళవారం ప్రారంభమయ్యింది. ఈ ప్రపంచ స్థాయి సమావేశం ద్వారా శాస్త్రవేత్తలు, పరిశోధకులు, పరిశ్రమ నిపుణులు, విద్యార్థులు కృత్రిమ మేధస్సు, భూవిజ్ఞానం, రిమోట్ సెన్సింగ్, అంతరిక్ష సాంకేతిక పరిజ్ఞానాల తాజా పురోగతులను పంచుకోనున్నారు. ఈ సదస్సుకు ఐఈఈఈ, జియో సైన్స్ అండ్ రిమోట్ సెన్సింగ్ సొసైటీ (జీఆర్ఎస్ఎస్) సాంకేతిక సహకారం అందిస్తుండగా, జిఆర్ఎస్ఎస్ ఉపసమితులు, టిసిఎస్ రీసెర్చ్, అర్బన్ కిసాన్ వంటి సంస్థల ఆర్థిక సహాయం, డెవలప్మెంట్ సీడ్ మరియు ఐఎస్పిఆర్ఎస్ వంటి జ్ఞాన భాగస్వాములు మద్దతు అందిస్తున్నారు. ఎర్త్ సెన్స్ 2025 పరిశోధనల ప్రచారం, సహకారం, జ్ఞాన మార్పిడి కోసం ప్రత్యేక వేదికగా నిలుస్తుంది. మంగళవారం ఘనంగా ప్రారంభమైన ఈ సదస్సులో ప్రముఖ విద్యావేత్తలు, పరిశోధకులు, అంతర్జాతీయ పరిశ్రమ నాయుకులు పాల్గొన్నారు.
కేఎల్‌హెచ్ అజీజ్ నగర్ క్యాంపస్‌ను ఆవిష్కరణలు మరియు అంతరశాఖ పరిశోధనలకు కేంద్రంగా గుర్తిస్తూ, కృత్రిమ మేధస్సును భూవిజ్ఞాన, రిమోట్ సెన్సింగ్ సాంకేతికతలతో సమన్వయం చేసే మార్గాలపై చర్చలు జరిగాయి. భూసమీకరణ, పర్యావరణ పర్యవేక్షణ, వాతావరణ మార్పు పరిష్కారాలు, స్థిర వనరుల నిర్వహణ వంటి అంశాలపై దృష్టి సారించారు. వక్తలలో ప్రొఫెసర్. అనాబెల్లా ఫెర్రల్ (కొనిసెట్, అర్జెంటీనా), ప్రొఫెసర్. నార్మా అలియాస్ (యూటీఐ, మలేషియా), డా. నీలేష్ దేశాయి (డైరెక్టర్, స్పేస్ అప్లికేషన్స్ సెంటర్ – ఇస్రో ), బోహారి మహత్ ఉన్నారు. వీరు భూవిజ్ఞానంలో రూపుదిద్దుకుంటున్న ఆధునిక సాంకేతికతలపై తమ విలువైన అనుభవాలను పంచుకున్నారు.
ఈ సదస్సులో వాతావరణ నమూనాలు, కచ్చితమైన వ్యవసాయం, విపత్తు నిర్వహణ, నగర ప్రణాళిక, ఉపగ్రహ ఆధారిత భూ పరిశీలన వంటి రంగాలలో కృత్రిమ మేద మరియు మిషిన్ లెర్నింగ్ వినియోగంపై సాంకేతిక సమావేశాలు, వర్క్‌షాప్‌లు, ప్యానెల్ చర్చలు జరుగుతాయి. కృత్రిమ మేధస్సు వినియోగంలో నైతికత, స్థిరత్వంపై ప్రత్యేక దృష్టి పెట్టనున్నారు. కేఎల్ డీమ్డ్ టూ బి యూనివర్సిటీ వైస్ ప్రెసిడెంట్ ఎర్. కోనేరు లక్ష్మణ్ హవీష్ మాట్లాడుతూ.. “ఎర్త్ సెన్స్ 2025 కేవలం ఒక సదస్సు మాత్రమే కాదు; ఇది ఆవిష్కరణ, స్థిరత్వం, జ్ఞాన మార్పిడి కోసం ప్రపంచ స్థాయి వేదిక. కృత్రిమ మేధ మరియు భూవిజ్ఞాన భవిష్యత్తును తీర్చిదిద్దుతున్న ప్రపంచ ప్రఖ్యాత నిపుణులను కే ఎల్ హెచ్ ఆతిథ్యం ఇవ్వడం మా గర్వకారణం. ఈ వేదిక అర్థవంతమైన చర్చలకు, సహకారానికి ప్రేరణనిస్తుందే కాకుండా, సమాజం మరియు పర్యావరణానికి ఉపయోగపడే పరిశోధనలకు దారి తీస్తుంది.” అన్నారు. ఈ సదస్సును ప్రిన్సిపాల్ డా. ఏ. రామకృష్ణ ఆధ్వర్యంలో, కన్వీనర్ డా. మౌస్మీ అజయ్ చౌరాసియా సమన్వయంతో, అధ్యాపకులు మరియు సిబ్బంది సహకారంతో విజయవంతంగా నిర్వహిస్తున్నారు.