ఏప్రిల్ 1 నుంచి కొత్త ఆర్థిక సంవత్సరం 2026-27 మొదలుకాబోతున్నది. పాన్ కార్డ్ దరఖాస్తు నుంచి రైల్ టికెట్ క్యాన్సిలేషన్ వరకు వివిధ అంశాల్లో కీలక మార్పులు రాబోతున్నాయి.
ఐటీ యాక్ట్, 1961 స్థానంలో కొత్త చట్టం ఏప్రిల్ 1 నుంచి ఇది అమల్లోకి రానుంది. ఇంతకుముందు పాన్‌కార్డు పొందాలంటే ఆధార్ సమర్పిస్తే సరిపోయేది. ఇకపై ఓటర్ ఐడీ, పాస్‌పోర్ట్, బర్త్ సర్టిఫికెట్ వంటి అదనపు పత్రాలు సమర్పించాల్సి ఉంటుంది. ఒక ఆర్థిక సంవత్సరంలో బ్యాంక్ ఖాతాలో రూ.10 లక్షలు లేదా అంతకంటే ఎక్కువ నగదు ఒకేసారి లేదా విడతల వారీగా జమ చేసినా, ఉపసంహరించుకున్నా పాన్ వివరాలు ఇకపై ఇవ్వాల్సి ఉంటుంది.
రైల్వే టికెట్‌కు సంబంధించి క్యాన్సిలేషన్ నిబంధనలు మారాయి. రైలు ప్రయాణానికి 8 గంటల లోపు టికెట్ రద్దు చేస్తే ఎలాంటి రిఫండ్ రాదు. ఇంతకుముందు ఇది 4 గంటలుగా ఉండేది. ఇంటి అద్దె భత్యం కింద మూల వేతనంలో 50 శాతం పన్ను మినహాయింపు పొందే నగరాలను కేంద్రం 4 నుంచి 8కి పెంచింది. ఇదివరకు ఢిల్లీ, ముంబై, కోల్‌కతా, చెన్నైకి ఈ ప్రయోజనం పరిమితం కాగా, తాజాగా హైదరాబాద్, పుణె, అహ్మదాబాద్, బెంగళూరుకూ విస్తరించింది. ఏప్రిల్ 1 నుంచి ఎల్‌పీజీ, విమాన ఇంధన ధరలను కేంద్రం మరోసారి సవరించే అవకాశముంది.
