Thursday, September 11, 2025
ePaper
spot_img
Homeఅంతర్జాతీయంనేపాల్‌ ఆందోళనలతో ఖైదీల పరార్‌

నేపాల్‌ ఆందోళనలతో ఖైదీల పరార్‌

పారిపోతున్న ఖైదీలపై ఆర్మీ కాల్పులు

నేపాల్‌ లో జెన్‌-జెడ్‌ ఉద్యమకారులు చేపట్టిన ఆందోళనలను ఆసరాగా తీసుకొని జైళ్ల నుంచి ఖైదీలు పరారవుతున్న క్రమంలో రామెచాప్‌ జైలు నుంచి పారిపోతున్న కొందరు ఖైదీలపై ఆర్మీ బలగాలు కాల్పులు జరిపాయి. దీంతో దేశంలో మరోసారి ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. గురువారం జైలు గేటు తాళాలను విరగ్గొట్టి ఖైదీలు పారిపోయేందుకు ప్రయత్నించారని చీఫ్‌ డిస్టిక్ట్ర్‌ ఆఫీసర్‌ శ్యామ్‌కృష్ణ థామా పేర్కొన్నారు. వారిని అడ్డగించేందుకు ఆర్మీ బలగాలు కాల్పులు జరిపాయని అన్నారు. ఈ కాల్పుల్లో డజను మందికి పైగా ఖైదీలు గాయపడ్డారని వెల్ల‌డించారు. వారికి వైద్యచికిత్స అందిస్తున్నట్లు వివరించారు. ప్రస్తుతం పరిస్థితి అదుపులోనే ఉందన్నారు.

అయితే, కాఠ్‌మాండూ, పోఖరా, లలిత్‌పుర్‌లోని జైళ్ల నుంచి ఇప్పటికే వందలాది మంది ఖైదీలు తప్పించుకున్నట్లు స్థానిక మీడియా పేర్కొంది. మొత్తం 7,000 మంది ఖైదీలు పరారైనట్లు తెలుస్తోంది. ఇక, జైలు నుంచి పారిపోయి వస్తున్న నేపాలీ ఖైదీలను భారత సాయుధ పోలీసుదళం సశస్త్ర సీమా బల్‌ పట్టుకుంది. ఉత్తరప్రదేశ్‌లోని సిద్ధార్థనగర్‌ సమీపంలో 22 మంది నేపాలీ ఖైదీలను అడ్డుకున్నట్లు ఎస్‌ఎస్‌బీ అధికారులు తెలిపారు. నేపాల్‌లో ఆందోళనల నేపథ్యంలో సరిహద్దుల్లో ఎస్‌ఎస్‌బీనే భద్రతను పర్యవేక్షిస్తుంది. దేశంలో తాత్కాలిక ప్రభుత్వ ఏర్పాటుకు సన్నాహాలు జరుగుతున్నాయని కాఠ్‌మాండూ మేయర్‌ బాలెన్‌ షా విజ్ఞప్తి చేశారు.

గురువారం నిరసనకారులను ఉద్దేశిస్తూ ఆయన ఎక్స్‌లో పోస్టు పెట్టారు. సామాజిక మాధ్యమాలపై నిషేధంతో ప్రారంభమైన జెన్‌-జెడ్‌ ఉద్యమం.. అవినీతి వ్యతిరేక ఉద్యమంగా మారి హింసాత్మక ఘటనలకు దారితీసింది. కాఠ్‌మాండూతో సహా పలు నగరాల్లో పెద్దఎత్తున ఘర్షణలు జరగడంతో ఆర్మీ కర్ఫ్యూ విధించింది. ఈ ఆందోళనల్లో ఇప్పటివరకు 25 మంది ప్రాణాలు కోల్పోగా.. 600 మందికి పైగా గాయపడ్డారు.

RELATED ARTICLES
- Advertisment -

Latest News